Wednesday, May 31, 2017

స్వేద గీతం

స్వేద గీతం



ఏ సమాధులపై
మనిషి జీవితాన్ని చెక్కి
బ్రతుకు పాటను వ్రాస్తారో

ఏ సమాధులపై
ఎర్ర గులాబీలను పరచి
జీవన స్మృతులను నెమరువేస్తారో
ఆ సమాధుల వంక
నిర్వీర్యంగా నిర్లిప్తంగా చూస్తున్నా

ఏ రాజ వంశీయులో
రాచరికపు వ్యవస్థను గుర్తుకు తెచ్చుకొమ్మనా -
ఈ సమాధుల మందిరాలను నిర్మించారు

ఫిరంగులు పేలిన ఇనుపగోళాలతో
కోట గోడలు పగిలి ముక్కలు కాగా
ఇనుప చూలలతో  నిర్మించిన
సింహ ద్వారాలు  తుత్తునియలు కాగా
రాచరికపు వ్యవస్థ ఏ నాడొ మట్టిలో కలిసిపోయింది

రాచరికపు టెత్తులతో మనిషి మృగమై
సామన్యుడి రక్తంతో
కొండల్ని కోటలుగా మార్చాడు

తనకి మరణం తప్పదని తెలిసి
బంగారు తాపడాలతొ సమాధుల్ని తయారు చేయించాడు

సామాన్యుడి స్వేదం అప్పుడు ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది
సామాన్యుడి రక్తం   అప్పుడూ ఎప్పుడూ కరిగిపోతూనే వుంది
రాజుల సమాధులు సామాన్యుడి స్వేదంతో పునీత మవుతూనే ఉంటాయి
ప్రాకారాల గోడలు  సామాన్యుడి రుధిరంతో ఎర్రగా ప్రకాశిస్తూనే ఉంటాయి
చరిత్ర చెప్పకున్నా
జాతి కళ్ళకు అది ఆవృత మవుతూనే ఉంటుంది
సమాధులు సమాధులగానే మిగులుతాయి

గానీ జాతికి మాత్రం సమాధి గోడల నుండి
సన్నని స్వేద గీతం మాత్రం వినబడుతూనే ఉంటుంది.

రచన : భాను మూర్తి
31.05.2017

No comments:

Post a Comment