Tuesday, May 16, 2017

జీవన గతులు

కవితా శీర్షిక :

జీవన గతులు 

రచన: వారణాశి భాను మూర్తి రావు.


ఆకాశం పాలి పోవడం లేదూ
ఒంటరిగా  కునారిల్లుతున్న  ఎడారి దిబ్బలాగా
రోడ్లు బిత్తర  పోవడం లేదూ
క్లీనరు నడిపిన  బస్సు లాగా
సముద్రం  క్రుంగి  పోవడం  లేదూ
జాలర్లు మింగిన  చేపల్లాగా
చంద్రుడు  నాకయితే  కాళ్ళు తెగిన
ఒంటె  లాగా కనబడ్డం లేదు
నల్లని అడవిలో తెల్లని  కుందేళ్ళ
సమూహం లా ఉన్నాడు
జీవితం చక్కర్లు కొడుతోంది
వింత సంత ల్లాంటి  సామూహికాల్ని
కలిపేసుకొంటూ
ఫిలసాఫికల్  కాంప్లెక్సిటీస్  ఆఫ్  లైఫ్
విచిత్ర  సంబంధ  బాంధవ్యాలతో
క్రుంగి పోవడం లేదూ ...సముద్రం లాగా
కెరటానికీ  గమనం ఉంది
గమ్యం ఉంది
ఎగిరి  గంతేసి  మళ్ళీ  మళ్ళీ ముందుకు ఉరుకు తూనే ఉంటుంది
అమాంతం  సునామీల సమస్యలు
తీరాల్ని  మింగినా
జీవితం పొద్దు  పొడుస్తూనే  ఉంది
గత్యంతరం  లేక సూర్యుడు
ఉదయిస్తున్నాడా ?
క్షిణించిన  చంద్రుడూ
పున్నమిని  చేరుకొంటాడు  ధీమాగా !
మాట్లాడకండి.....
మౌనంగా జీవన భాష  వినండి
మనం గూడా  కాల చక్రానికి
ఇరుసులై పోతాం !!

bhanuvaranasi/ 09.01.2017

No comments:

Post a Comment