Friday, January 1, 2016

స్వర్గం చేజారి పోయింది !

స్వర్గం  చేజారి పోయింది !
--------------------------------------

ఏయ్ 
మిస్టర్
నువ్వు  స్వర్గాన్ని  చూశావా ?
నీ కళ్ళల్లోంచి  జారి  పడిందిప్పుడే !

నువ్వు ఏ  స్వర్గం కోసం కలలు కన్నావో
అది  నీ కళ్ళ ముందే  జారి పోయింది
ఇన్నాళ్ళూ  స్వప్నాల్ని నంజుకొని  తినే వాడివి
ఈ వేళ నిజాల్ని  కక్కుతున్నావ్ !
నువ్వు స్వర్గాన్ని  చూసావో  లేదో ...
చూడాలని  వుందో  లేదో ..  కానీ  ఒక  స్వర్గం  చేజారి పోయింది !

నరకాన్ని మటుకు మహా నగరంలో  చూస్తున్నావు
పసి పిల్లల ప్రాణాలు బస్సు చక్రాల  క్రింద వదిలినా
రోడ్ల మీద గుడులు , దర్గాలు  రాత్రికి రాత్రే  మొలుస్తున్నా
నోరు తెరచిన మాన్  హొల్లు  మనుషుల్ని మింగినా
బద్ధకం రాయుళ్ళు  రోడ్ల  మీదనే  రొచ్చు  రొచ్చు చేస్తున్నా
మనకేం గాదు ...

స్వర్గం  సిటీ లల్లోనే ఉంది
మెట్రో  రైళ్ళు  మన తలకాయల మీద  నడుస్తాయి
ఇగ కాస్సేపట్లో  ఇసిత్రంగా  ప్రజలు ఆకాశం మీద  నడుస్తారు
ఇరుకు రోడ్ల మీద  నరకానికి  బారికేడ్లు  సిద్దంగా  ఉన్నాయి
కొమ్మలు నరికిన చెట్లు  సిమెంటు  దిమ్మెల మీద  పురుడు పోసు కొంటున్నాయి
వాన చుక్కలు ఇంకుడు  గుంతల్లేక  తారు రోడ్ల మీద వాగులయ్యాయి
ఎండి పోయిన  భూగర్భ  కుహరాల్లో  స్మశాన వాటిక లున్నాయి
విరామమే  లేని  రోడ్లు  చచ్చిన  పాముల్లా పడి ఉన్నాయి
ఈ నగరంలో  పీల్చే గాలి విషం  అవుతుంది
ఈ నగరంలో త్రాగే  నీరు  గరళం అవుతుంది
ఈ నగరంలో  తినే తిండి  పాషాణం అవుతుంది
మార్చురీ లలలో  శవాలు  కాటిక కాపరి  అడ్రస్సు కోసం  వెతుకు తున్నాయి
నగరంలో  దయ్యాలు  పారాడుతూనే  ఉంటాయి
ఔటర్ రింగు  రోడ్డులో  మరణ మృదంగాల  ట్యూన్ విన బడుతూనే ఉంటుంది
సిటి లో పచ్చ దనం  ప్లాస్టిక్  కొమ్మల్లో విరగ బుస్తోంది
నడిజామున  నగరం లో   ఆమ్ల  తుంపర కురుస్తోంది
పర్యావరణం  బాలన్సు  తప్పి   కుంటి నడక  నడుస్తోంది
అభివృద్ది పేరుతో   భూమాతకు  అబార్షన్లు  చేస్తూనే ఉన్నారు
నగరంలో  పచ్చ దనం పరారై పోయింది
నగరం గరం గరం లా  గరం చాయ్  లా ఉంది
నాకు   కావాల్సింది  ఈ  నగరం గాదు
అంబలి  తాగిస్తూ  ఎదకు హత్తుకొనే  అమ్మ గావాలి
పచ్చ దనం  కప్పుకొన్న  పల్లె పందిరి  గావాలి
పీల్చ డానికి  చల్లని గాలి గావాలి
తాగడానికి  దోసెడు  నీళ్ళు  గావాలి
జీవించ  డానికి  నాకు  ఒక్క  స్వర్గం  కావాలి
బ్రతక డానికి  నాకు ఒక్క పల్లె గావాలి !!





 

Thursday, December 31, 2015

ప్రశ్నించని మనిషి

ప్రశ్నించని  మనిషి
-------------------------------------------------
మనిషి  ప్రశ్నించు  కోవడం మానేశాడు ...
కనీసం  తన అంతరాత్మతో గూడా ---
మనిషి   ఆలోచించడం గూడా   ఎప్పుడో మానేశాడు !

తప్పుల తడక జీవితం
తప్పులెంచు కోవడానికే  సరిపోతోంది
ద్వేషాల  దోషాలతో
మనిషి  మారణాయుధమై  పోతున్నాడు
ఇంగిత జ్ఞానం  గూడా  లేని  మనిషి
పశువులా  ప్రవర్తిస్తున్నాడు

నర  జాతిని సమస్తము  నరికి
తన  జాతిని  ఉద్దరిస్తాడా ?
పర జాతిని కాదంటూ
స్వ జాతినే   సంహరిస్తాడా ?

ఎక్కడ  మతోన్మాదులు  ఉద్భవిస్తారో
అక్కడ  రక్తం నిండిన నేల చిమ్ముతుంది  విషం
ఎక్కడ  ప్రశ్నించ లేని  ప్రవచ నాలు ఉంటాయో
అక్కడ  పతన  మవుతుంది మానవత్వం

చరిత్రలొ హోలోకాస్ట్ ఉదంతాలు
మిగిల్చు కోనింది ఏమి లేదు
శరణా ర్థుల  ఆకలి  కేకలు తప్ప !
అభం శుభం తెలియని చిన్నారుల ఆర్తనాదాలు తప్ప !
మానవ శోకం  పాడిన  మరణ శ్లోకం  తప్ప !















 

Thursday, December 24, 2015

కల్తీ వాదం

కల్తీ  వాదం
--------------------------


ఎవడు మనిషి ?
ఎవడు జంతువు ?
ఏమిటి బేధం ?
గుర్తించావా  నువ్వు  ఒక కోతికి పుట్టిన మనిషి వని
ఆలోచించావా  నువ్వు ఒక మనిషికి పుట్టిన జంతువని
డార్విన్ సిద్దాంతం  కంటే నీ సిద్దాంతం గొప్పదా ?


అసలు  నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది
నీ చూపుల్లో ఏదో  వక్రతనం  పరావర్తనం చెందుతోంది
నీ  మాటల్లో ఏదో వ్యంగం తనం  గోచ రిస్తోంది
నువ్వు కూడా కల్తీ వాదివేనా ?

వెంపర్లాడుతున్న  మనసుని  కిటికీ  రెక్కలు లాగి లోపలి ఈడ్సుకు రా!
తన్నుకు చస్తున్న ఈ  జనాలతో  మనకేమి పని లేదు  బ్రదర్ !
వాళ్ళు తన్నుకు చావనీ !

కల్తి కబుర్లు  చెప్పే   మాయల మరాటిలతో  మన కేమీ  పని లేదు
పాలల్లో  యూరియా విషం కలిపి  అమ్ముకొనే   పాపాత్ములతో  అసలు పని లేదు
బతుకుల్నే బజారు పాలు  చేస్తున్న కాల్ మనీ  కాలే గాళ్ళ తో మన కేమి పని లేదు
కాదేది కల్తీ  కనర్హం !!


కిళ్లి  మరకలతో  కంపు కొడుతున్న రోడ్లని మనం శుభ్రం  చెయ్యలేము
కల్తీ  వ్యాపారాలతో  కడుపు నింపుకొనే  కేటు  గాళ్ళను మార్చ లేము
ఎర్ర సిరాతో రక్తాన్ని కల్తీ  చేసే  అమ్ముకొనే రాక్షసుల్ని మార్చాలేము
కాదేది కల్తీ  కనర్హం !!

అదో అలా విను !
నిశ్శబ్దం  చేసే శబ్దం  భరించ గలవా ?
శబ్ద విరామంలో  గూడా నిశ్శబ్ద  శబ్దాన్ని వినే గ్రహణ శక్తి నీకుందా ??
నీ మనస్సు చేసే  అర్తనాదాల్ని వినగలవా మిత్రమా ?
స్వల్ప విరామంలో నైనా  నీ  మనసు నీతో మాట్లాడనీ  !
నాకే తెలుసులే ...

నిజాన్ని  కక్కుతుందనే గా నీ మనస్సుని సెల్ఫీ లో బంధిచ లేక పోయ్యావు !!



 భాను మూర్తి / 24. 12.2015 / Thursday
 

Friday, December 11, 2015

వేదన


వేదన
--------------------------------
గమ్మత్తుగా
మత్తు లోకి జారుకొన్నా !
ఒక  వెలుగు కోసం
దిక్కులు చూస్తున్నా !

గాడాంధ  కారంలో
సుషుప్తావస్థ లోకి జారుకొన్నా !
నా మదిలో
కాంతి రేఖలు లేవే !
నా ఎదలో
క్రాంతి  జాడలు కాన రావే !

 ఎక్కడివీ
 నిన్నటి వెలుగు రేఖలు ?
 ఎక్కడివీ
 నిన్నటి భావ వీచికలు  ?

అక్షరాల సమాధుల  మధ్య వెతుకు తున్నా
ఇంకొక  నవ  గీతాన్ని  రాయాలని
సందేహాల  దేహాల  మధ్య
కొత్త  జీవితాన్నితయారు చేసుకొంటున్నా!
బ్రతుకు  పుస్తకం  అంకితం ఇవ్వడానికి
వెతుకుతున్నా ఈ  జనారణ్యంలో
ఒక్క  మనసున్న మనిషి  కోసం !
















 

Monday, October 12, 2015

అన్వేషణ

 అన్వేషణ


నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి
నాకు  కొన్ని పరిధులు ఉన్నాయి
నాకు కొన్ని నిబద్ధతలు ఉన్నాయి
నాకు కొన్ని  ప్రామాణికాలు ఉన్నాయి
నాకు కొన్ని  అవరోధాలు ఉన్నాయి
నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి

అవును
నన్ను నేను అప్పుడప్పుడు ప్రక్షాళన  చేసుకొంటాను
నన్ను నేను  అప్పుడప్పుడు  పరీక్షించు  కొంటాను

అవును
నువ్వు నన్ను వేలెత్తి చూపినపుడు
నీ వ్రేళ్ళ మధ్య నుంచి  వెలుగులా జారి పోతాను
నువ్వు నా కోసం  కార్చిచ్చు  వై  అడువుల్ని  వెతుకుతున్నపుడు
నీ  పిడికిలి  మధ్య  చీకటినై  నీ  గుండె గోడల్లో  మృత కణాన్నై  పడి  ఉంటాను

అవును
కన బడే  ముళ్ళ కంపల్ని  ఎత్తి  వాడిన అంకురాల్ని  పొదివి పట్టుకొన్నా
అగ్ని గుండం లోకి  జారి పోతున్న  కీటకాల్ని   గుండెకు  హత్తుకొన్నా
వ్యవస్థల  అవస్థలలో  కూరుకు పోయిన  పిపీలకల్ని బయటకు తీస్తున్నా
కుల మత  పంజరాల్లో  ఇరుక్కుపోయిన  శాంతి కపోతాల్ని కాపాడుతున్నా

అవును
నేను కవిని !

అక్షరాల బీజాక్షరాల్తో 
కొన్ని సూర్య మండలాల్ని  వెలిగిస్తాను
కొన్ని కొత్త గ్రహాల కోసం
అన్వేషణ మొదలు పెడతాను

అవును
నేను కవిని !








Saturday, October 10, 2015

ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


కవిత్వం అంటే ఏమిటి? కోన్ని మంచి మాటలు చెప్పడం , సమాజాన్ని జాగృతి  చెయ్యడం , అన్యాయాన్ని వేలెత్తి చూపడం , ప్రజల మనో భావాల్ని   దెబ్బ తినకుండా వ్రాయడం .

ఈ ఆమధ్య వ్రాస్తున్న కవులు తెగ ఆవేశ  పడి  పోయి  ఏది  వ్రాయచ్చో , ఏది వ్రాయ  గూడదో  అని తెలియకుండా  , నోటి కి ఏది వస్తే అది వ్రాయడం , వచన కవిత్వం గదా అని ప్రతి ఒకడు ఏదో  ఒకటి వ్రాయడం అలవాటై పొయింది . ముఖ పుస్తకం , blogs వచ్చిన తర్వాత  ఈ  జబ్బు చాలా  ముదిరి పోయింది  . ఎందుకంటే  ముఖ పుస్తకంలో  సంపాదకులు  గానీ , కవితను సరి  చూసి  పబ్లిష్  చెయ్యడానికి  ఎవరు ఉండరు . ఇక్కడ  కవి రాసింది  రాసినట్లు గానే  post  చెయ్యబడుతుంది .  గాంధీ  చంపినా వాడు గాడ్సే . గాంధీ  మంచి  వాడు , మహత్ముడు . మరి గాడ్సే గూడా   మంచి వాడే మరి కొందరికి  . ఒక వర్గం  కవులు గాంధీ  ని గురించి రాస్తే , ఇంకొక వర్గం కవులు గాడ్సే గూడా గొప్ప వాడని రాస్తారు. అంటే ఒకే  విషయం మీద , రెండు విభిన్న  వైరుధ్యాలు  గన  బడుతాయి. అమ్మ మంచిదా , నాన్న మంచోడా అని అడిగితే   , ఇద్దరు మంచోళ్ళే  అన్న బిడ్డ లా కవి  తన అశావహ దృక్పథాన్ని , విషయ పరిజ్ఞానాన్ని  ,  ఒక  positive belief  ని balanced  approach  తో అలవరచు కొవాలి.  కవి  తాను  వ్రాస్తున్న  విషయం  మీద  సమన్వయ  న్యాయం  చెయ్యగలగాలి.

కులాల  గురించి పరస్పర దూషణలు చేసుకోవడం, ఇతర మతాల్ని కించ పరచడం,   ఒకరి ఆహారపు అలవాట్లను  , వేష భాషల్ని, వారి సంప్రదాయాల్ని  అగౌరవ పరచడం లాంటి విషయాల మీద కవులు  రాయక పోవడం మంచిది. చైనా లో కుక్కల్ని , జపాన్ లో కప్పల్ని తింటారు. కొందరు ఎలుకల్ని , బొద్దింక ల్ని గూడా కొందరు  తింటారు . అవి మన లాంటి దేశాల్లో  తినరు. అలా అని వాళ్ళని అసహ్యించు కొంటమా ?

 కవి  ఏ విషయాన్ని అయినా బాహ్య దృష్టి , అంతర్గత దృష్టి తో చూడ గలిగినప్పుడే   రాణిస్తాడు .  తన చెప్ప  దలచు కొన్న దేదో  నిర్మోహ మాటం గా రాయ గలిగిన వాడే  మంచి  కవి. కొన్ని  సమాజ సహజ  సూత్రాలను బట్టి కవి  మసలు కొవాలి. సమాజం కంటే కవి గొప్ప వాడు గాదు.  తండ్రి కూతురు మధ్య , అన్న చెల్లెళ్ళ మధ్య  అనురాగం ఉంటుంది గానీ , sexual  perceptions ఉండవు . ఆ మధ్య ఒక కవి  ,' నాన్న నా యోనిలో ...'  అని ఒక కవితను రాసి  మళ్లీ  డిలీట్  చేశారు . అంటే ఆత ను చెప్ప దలచు కొన్నది  child sexual molest  మీద. గానీ రాస్తున్నది బూతు  కవిత్వం .

చెప్పదలచు కొన్నది ఒకటి  , రాస్తున్నది  వేరొకటి  అయితే ఆ కవిత్వానికి  విలువ ఏముంటుంది ? పద ప్రయోగాలు చెయ్యాలనే  ఆరాటం ,  తనకు  తప్ప వేరే వాళ్లకు అర్థం గాకుండా వ్రాయడం ఈ  మధ్య fashion  అయిపొయింది .
చిన్న చిన్న పదాలతో , పామరులకు గూడా  అర్థమయ్యే రీతిలో కవులు వ్రాయ లేరా ?

'' దేశ  మంటే  మట్టి  గాదోయ్ ! దేశ  మంటే  మనుషులోయ్ !!'' అన్న గురుజాడ  కవితలో గొప్ప పద ప్రయోగం ఏమి లేదు కదా ?

(డిస్క్లైమర్; ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది  గాదు .ఇది  కేవలం నా  వ్యక్తిగత అభిప్రాయం  మాత్రమే )

Friday, October 2, 2015

అగ్నిపూలు

అగ్నిపూలు



అదిగో
ఆ బురద నీటిలో  ఆకలి చేపలు
ఎలా  తల్లడిల్లుతున్నాయో
ఎలా  మల్లగుల్లాలు  పడుతున్నాయో  చూడు
తాటాకు  చప్పుళ్ళలో
వాన చినుకు  శబ్దంలో
గుండె  గూడై
చూరు  చెరువై
ఎండ మావై
భ్రమలు  కల్పిస్తున్న  జీవితం
తలక్రిందులై  కన్పిస్తుంది నాకు
ఈ  మాయా  దర్పణంలో

అదిగో
జీవ  హరితాన్ని  హరించి
పేలవంగా  బొమికలతో
శ్మశానంలో  పీనుగు కాలిన
పొగల్లా  పారాడే
శిలల్లాంటి  శవాలు
బ్రతుకే  చూడని  అనుభవాలు

అదిగో
మానవ హారానికి
దారాల్లా నిలబడ్డ కాగడాలు
వెలుతురు  చుక్కలు మ్రింగి
చీకటి  తుఫానులో
చిక్కుకొన్న వాళ్ళు
దిక్కూ మొక్కూ  లేక
అసృక్కుల  ఏరులో
అప్రచ్చన్నమైన   అహ్రీకులు
వాళ్ళ  ఘర్మ  జలానికి
వాళ్ళ ధర్మ జలానికి
రాలి పడ్డ  శ్వేత  బిందువులు
నేల  మీద  పడి  అగ్ని  పూలవుతున్నాయి
వాళ్ళు  పలికిన ప్రతి మాట
అంకుశం తగిలిన భూమిలో
అంకురమై
అక్షరమై
జన జాతిని  జాగృతం   చేస్తుంది
మానవత   పరిమళాల్ని  వెదజల్లుతుంది