Saturday, October 10, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (2)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు 

(రెండవ భాగం)


అది నాయుడు గారి పల్లె. బాహుదా నది  దక్షిణం వైపున్న గ్రామం.మధ్యలో ప్రవహిస్తున్న బాహుదా నది తరతరాలకు జీవన చైతన్యానికి నిదర్శనంగా ఉంది.‌ బాహుదా నది అంటే ఆ రెండు గ్రామాలకు ప్రాణం. ఆ నది సజీవ ప్రవాహ గంగ. సంవత్సరం అంతా పంటలకు పండించ డానికి సరిపొయ్యే నీరు బాహుదా నది ఇస్తోంది. ఆ గంగా జలం తోనే పెరిగి , పంటలు పండించి , అక్కడే బ్రతుకులు సాగించి , ఆ నది ఒడ్డున ఖననం అయితేనే వారికి తృప్తి. అంతగా ఆ నదితో అనుబంధాన్ని పెంచు కొన్నారు ఆ గ్రామ ప్రజలు. జయ రామ నాయుడు గారి తాత ముత్తాతలు కట్టించిన పోలేరమ్మ గుడికి తరలి వచ్చారు . జయరామ నాయుడు , కుటుంబ సభ్యులు మరియు ఆ గ్రామ ప్రజలు తో సహా అర్చక స్వామిని  అర్చన చెయ్యమన్నారు. 


" మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే,కృష్ణా-కావేరి మధ్య ప్రదేశే .... అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .....సంవత్సరే .... అయనే ....... ఋతౌ .......మాసే .... పక్షే ...... తిథౌ .... వాసరే  శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్ 


" అయ్యా గోత్రం ? " అన్నాడు అర్చక స్వాములు మంత్రాన్ని మధ్యలో ఆపి.


" ఆయప్ప పేరుతోనే గదా సంకల్పం చెప్పేది . 


 రాజశేఖర రెడ్డి.. రత్న పాల గోత్రం " అన్నాడు నాయుడు గారు.


" రత్నపాల గోత్రోద్భవస్య ...రాజశేఖరరెడ్డి నామధేయస్య ....ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి, శ్రీ భద్ర కాళి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే... కరిష్యే ..." 


అంటూ జయరామ నాయుడు గారికి 

అర్చక స్వామి హారతి..తీర్థ ప్రసాదాలు అందించాడు.‌


సకుటుంబ సమేతంగా రెండు గ్రామాలు, రెండు కు

టుంబాలు చల్లగా ఉండాలని మొక్కు కొన్నారు అక్కడున్న వారు  అందరూ.

**************************************************


రాజ శేఖర రెడ్డి ఇల్లు చేరుకోగానే బంట్రోతుల తలల మీద  పిండి వంటలు, అరటి గెలలు, పూలు, వివిధ  రకాల పళ్ళు , పాలు, వెన్న , నెయ్యి, జున్ను, చెరకు గడలు, తేనె వగైరాలు ఇంటి ముందర వరండాలో పెట్టారు. 


" అయ్యా..నాయుడు గారు మీ పుట్టిన రోజున యియ్యి పంపించారండి" అన్నాడు అందులో ఒకాయన .


" అరే ..వాడికి బుద్దే లేదు. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజున ఎందుకిన్ని పంపిస్తాడో?  వద్దని ఎన్నోసార్లు మొత్తు కొన్నా..వినడే" అన్నాడు రెడ్డి గారు .


" శర్మ గారూ! "

" అయ్యా! " రెడ్డి గారి దివాన్ ఉలిక్కి పడుతూ " అర్థ మయ్యింది..మీరు చెప్పక ముందే అమ్మ గారు అన్నీ పంపించారండీ!" 

అన్నాడు దివాన్  శర్మ గారు.‌


" అయ్య గారు సాయంత్రం బాహుదా నది ఒడ్డున మిమ్మల్ని కలుస్తారటండీ " అన్నారు నాయుడు గారి పని వాళ్ళు .


" ఎలాగైనా మీ పుట్టిన రోజున  ఏటి ఒడ్డున గొప్ప ఆటపాటలు రెండు గ్రామాల ప్రజలూ ఆడుకొంటారు గదండీ ! అన్నాడు శర్మ గారు.


రాజ శేఖర రెడ్డి నవ్వి ఊరుకొన్నాడు.

***************************************************



జయరామ నాయుడు గుడి నుండి రచ్చ బండి కెళ్ళి వూరి పెద్దలతో గ్రామ విషయాలు , వ్యవసాయ విషయాలు మాట్లాడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. 

సమయం  మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది.

ఇంటి ముందర ఎద్దుల బండి ఆగింది.  ఆ బండిలోంచి సువాసనలు  గుమ్మళిస్తూ అనేక రకాల పిండివంటలు రెడ్డి గారి తాలూకు మనుషులు దించు తున్నారు.


" ఈశ్వరప్పా ... ఏందప్పా ఇదీ? అని అడిగాడు నాయుడు గారు.


" అయ్యగారి పుట్టిన రోజు గదండీ.. ఇయ్యన్నీ మీకు ఇచ్చి రమ్మన్నారండీ ! " అన్నాడు ఈశ్వరప్ప .


పోళీలు..పాగం పప్పు ఉంటలు, కారాలు..మురుకులు...తేనె తొళ్ళు, అత్తిరసాలు, లడ్డు, కాకినాడ నుండి తెప్పించిన పూత రేకులు, బందరు లడ్డు..కొత్త బట్టలు, పూలు , పండ్లు అన్నీ ఇంటిలో పెట్టారు. 


" మీ రెడ్డికి  సెబుతానే ఉండాను..ఈ అర్భాటాలు , జలసాలు అక్కర లేదు అప్పా అనీ...వింటేగా..ప్రతి సంవత్సరం పండగలకు , పబ్బాలకు, పుట్టిన రోజుకు పంపిస్తాడబ్బా..దాన కర్ణుడు అప్పా మీ రెడ్డి. మా ఇంటికే గాకుండా పల్లెలో అన్ని కుటుంబాలకూ పంచ మంటాడు...ఖర్చుకు వెనకడుగు వెయ్యడు" అన్నాడు అక్కడున్న రెడ్డి గారి మనుషులతో..


" మీకు తెలియనిది ఏముంది  రెడ్డి గారి మనస్సు ?  మరీ మీ స్నేహ బంధం అంత గొప్పది. అందులోనూ ఇద్దరి పుట్టిన రోజూ ఒక్క రోజే గావడం మహా విశేషం ..అది మా కందరికీ సుదినం..అందుకే మీ ఇద్దరి పుట్టిన రోజు వచ్చిందంటే రెండు గ్రామాల ప్రజలకు ఎంతో ఆనందం..సంక్రాంతి పండగ కంటే సంబరాలు ఎక్కువ. ఎలాగూ సాయంత్రం ఇద్దరూ బాహుదా నది ఒడ్డున కలుస్తారు గదా! ఎలాగూ వూర్లో జనాలకు అక్కడ ఆటపాటలు గూడా ఉన్నాయి గదా " అని అన్నాడు నాయుడు గారి దివాన్ సుందర రామ శాస్త్రి గారు..


ఈశ్వరప్పా..రెడ్డి గారికి చెప్పు.. సాయంత్రం  బాహుదా నది ఒడ్డున కలుద్దాం అని" అన్నాడు నాయుడు గారు.

" అలాగే అయ్యా " అని 

రెడ్డి గారి మనుషులు సెలవు తీసుకొని వెళ్ళి పొయ్యారు.

***********************************************

( తరువాత ఏమయ్యిందో రేపు మూడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)




(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

ప్రస్థుత నివాసం‌: హైదరాబాదు.

No comments:

Post a Comment