Tuesday, October 6, 2020

బాలూ..నీ గానం అమరం

బాలూ..నీ గానం అమరం

------------------------------------------

ఈ సూర్యుడు పడమటి కనుమల మధ్య దాక్కొన్నాడు

ఇక రేపు తూరుపు కొండల మధ్య ఉదయించడు కాబోలు

ప్రకృతి స్థాణువై  పోగా

ఆకాశ మార్గాన దిగులు మేఘాలు వర్షిస్తున్నై!

నీ గానామృతాన్ని ఒడిసి పట్టుకొనే కల కూజితాలు


మూగగా రోదిస్తున్నాయి

కళ్ళు కన్నీటి సంద్రాలయి కోట్లాది గుండెలు 

 నిర్బల నిర్వేద నిస్సహాయ స్థితిలో అచేతనమయినై!

పాటల మాంత్రికుడి ' పాడుతా తీయగా'  వేదిక

వెల వెల బోయుంది

తెలుగు పదాల తేనెలూరు ప్రతి మాట నీ నోట

అమృతాన్ని అమ్మ పాలతో త్రాగి పాడిన నీ పాట

సరిగమల సరాగాలు పలికించు నీ గాత్రం

గమకాలను అలవోకగా ఆలపించు నీ నాదం 

తెలుగు నాట నువ్వు నాటిన 

 నీ గాన హరిత వనాల్లో

చిరు చిరు పదాలు పాడుతున్న చిన్ని చిన్ని కోయిలలు

శంకరాభరణ రాగాల్ని  అలవోకగా పాడాలని 

 నీ ఆశీస్సుల కోసం వేచియున్నారు

పాటే ప్రాణమై  మాటే మంత్రమై 

గాన గంధర్వుడివై తెలుగు జాతిని వదలి

 భువి నుండి ఇల చేరుకొన్నావు

పాటవై వచ్చావు భువనానికి

గానమై వెళ్ళావు గగనానికి

నీ పాటలు మా నవ నాడుల్లో

ప్రవహిస్తూనే ఉంటాయి

మా ఎద సవ్వడిలో

నీ నాద వాయులీనాలు 

వినబడుతూనే ఉంటాయి.


రచన: వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు










No comments:

Post a Comment