Sunday, October 11, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(6)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు

ఆరవ భాగం(6)


ఆ సాయంకాలం అశోక్ రెడ్డి ఇల్లు చేరగానే తల్లీ తండ్రి..జీత గాళ్ళు భయ పడ్డారు.


" ఏమైందమ్మా? ఎందుకు ..దెబ్బలు తగిలాయి? ఎక్కడైనా పడిపోయినావా? ఎవరైనా కొట్టినారా? " తల్లి అన్న పూర్ణమ్మ  అడిగింది కొడుకును దగ్గరగా హత్తుకొంటూ


అక్కడున్న వారంతా ఎవరికి తోచిన విధంగా అశోక్ రెడ్డికి సపర్యలు చేస్తున్నారు..


రాజ శేఖర్ రెడ్డి కబురందగానే  ఆయుర్వేద వైద్యుడు లక్ష్మి నారాయణ ఉరుకులు పరుగులతో వచ్చాడు.


చెయ్యి పట్టుకొని నాడి చూస్తూ." .ఏమి కాలేదమ్మా..పిల్లోడికి దెబ్బలు తగిలాయి. అంతే.." అని పెట్టెలోంచి ఒక పసురు సీసాను తీసి అశోక్ రెడ్డి గాయాల మీద పూశాడు.


" అబ్బ..మంట..అమ్మా " అశోక్ మూలుగుతున్నాడు.


" ఆహా. ఏమీ కాదు..పూసుకో..అదే తగ్గుతుంది" అన్నాడు రెడ్డి గారు.


" అసలు ఏమయిందమ్మా? " మళ్ళీ అడిగింది తన తల్లి.


" ఏమీ కాలేదమ్మా..మామిడి కాయలు తిందామని చెట్టు ఎక్కి జారి పడిపొయ్యా...అందులో కింద కొన్ని  రాళ్ళు ఉన్నాయి.రాళ్ళ మీద పడి పోయినా.." అన్నాడు అశోక్.


జరిగిన కథ నిజం చెబితే అనుకోని అవాంతరాలు కలగ వచ్చు. సుధా కర్ నాయుడు కొట్టాడని చెబితే ..నాయనకు కోపం రావచ్చు. జయరామ నాయుడు , నాయన కుటుంబాల మధ్య చిచ్చు రేగ వచ్చు..అందుకే అశోక్ జరిగిన నిజాన్ని దాచి పెట్టి  చెట్టు మీద నుండి పడినాడని అబద్దం చెప్పాడు.


కొన్ని రోజుల తర్వాత అశోక్ గాయాలన్నీ మాని పొయ్యాయి. మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది.


మళ్ళీ యధావిధిగా స్కూలుకు వెళ్ళాడు అశోక్ రెడ్డి.

***********************************************


వారం రోజుల తరువాత బడికి వచ్చిన అశోక్ చూసి రమ తన బాగోగులు అడిగింది.


" నన్ను క్షమించు అశోక్ " అని రమ అశోక్ వైపు చూస్తూ బాధగా అంది.


అశోక్ రమ కళ్ళల్లోకి చూశాడు. ఆమె ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది.


" మా అన్న వలనే నీకు వొళ్ళంతా దెబ్బలు తగిలినాయని స్కూల్లో అందరూ అంటా ఉండారు. నిన్న మా క్లాస్ మేట్  సుమతి గూడా అదే చెప్పింది. మా అన్న తరపున క్షమాపణలు చెబుతున్నా. మనసులో ఏమీ పెట్టుకోకు..నాయనకు గూడా ఈ విషయం తెలీదు" అంది రమ.


" నువ్వేమీ బాధ పడమాక..నేను బాగానే ఉండాను గదా? " అన్నాడు అశోక్ ..


అంతలోనే స్కూల్ బెల్లు  కొట్టడంతో ఎవ్వరి క్లాస్ రూములకు వారు వెళ్ళారు.


*************************************************


ఆ మరుసటి రోజు క్లాస్ రూమ్‌కి తొందరగా వచ్చింది రమ.. కొంచెం  నోట్స్ వ్రాసుకోవడానికి.

అప్పటికే పిల్లలు వచ్చారు.


రమ తల వంచు కొని సీరియస్ గా రాసుకొంటున్నది

తన ప్రక్క కూర్చున్న సుమతి రమ చెవిలో ఏదో చెప్పింది గుసగుసమని.


రమ తలెత్తి బ్లాక్ బోర్డు వైపు చూసింది.

" ప్రేమ +త్యాగం = పెళ్ళి" 

" రమ + అశోక్ = ?  "

అని ఎవ్వడో అకతాయి వ్రాశాడు.


రమ పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని భోరున ఏడ్చింది.

సుమతికి చాలా కోపం వచ్చింది.


వెంటనే డస్టర్ తీసుకొని తుడిచి వేసి.." ఇలాంటి పిచ్చి  గీతలు ఇంకో సారి వ్రాస్తే హెడ్ మాస్టర్ కి చెప్పి టీ సీ ఇప్పిస్తా..ఏమను కొంటున్నార్రా.. ఆడపిల్లల్ని ఏడిపిస్తే తగిన బుద్ది చెబుతాము" అని ఉగ్ర కాళిలా అరచింది .

క్లాస్ రూమ్ అంతా నిశ్శబ్ధమై పోయింది.


అంతలో వెనుక బేంచిలో ఉన్న కొందరు అకతాయి పిల్లలు పిల్లి లాగా " మ్యావ్ ..మ్యావ్ " అని అరచారు.

క్లాస్ లోని పిల్లలంతా అంతా ఒక్కసారి గొల్లుమని నవ్వారు.


అవమాన భారంతో రమ వెక్కిళ్ళు పెట్టి  ఏడ్చింది.

అంతలో తెలుగు మాస్టారు క్లాసు రూమ్ లోకి అడుగు పెట్టాడు.


క్లాస్ రూమ్ అంతా ఒక్క సారిగా సద్దు మణిగింది.

*************************************************తరువాత ఏమయ్యిందో రేపు  ఏడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

Copy Rights @ author


No comments:

Post a Comment