సంస్కార సమేత రెడ్డి నాయుడు
ఏడవ భాగం(7)
జనవరి నెల వచ్చిందంటే అంటే పుష్య మాసములో పండుగ సంబరాలు ఎక్కువవుతాయి.
వరి ధాన్యం( వడ్లు) ....కందులు..పెసలు...
అలసందలు..మినుములు..ఉలవలు...చెనిక్కాయలు ...ఎక్కడ చూసినా అవే..పంటలు బాగా పండితే ఇంట్లో ..గాదెల్లో..మూటలు మూటలు ధాన్యం పడి ఉంటుంది. చాలా మంది రైతులు మంచి రేటు వచ్చేదాక ఇళ్ళళ్ళో దాచుకొంటారు. కొందరు కాగుల్లో..గెరిసల్లో దాచుకొంటారు.అమ్మగా మిగిలిన ధాన్యాన్ని గూడా ఇళ్ళళ్ళో నే దాచు కొంటారు. చెరకు పంటలు వేసిన వాళ్ళకు ఇల్లంతా బెల్లం చెక్కలే పెట్టు కొంటారు. లక్కిళ్ళ బెల్లం ఎంత కావాలంటే అంత తినొచ్చు. తోటల దగ్గర గానుగ ఆడే టప్పడు పోతే... ఒక పెద్ద పెనాన్ని కట్టెల గాడి పొయ్యి మీద బెట్టి మంట పెట్టి చెరకు నీళ్ళు ఆ పెనం నిండా పోస్తారు. సలసల మని మరిగి కాగినాక చెరకు నీరు ఘనీభవించి బెల్లం తీగలుగా మారుతుంది. ఆ బెల్లం తీగల్నే లక్కిళ్ళ బెల్లం అంటారు. అది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.
సంక్రాంతితో మొదలయ్యే సంబరాలు శివరాత్రి తిరనాల వరకూ ఉంటుంది. అప్పుడు రైతులకు పెద్దగా పనులుండవు గాబట్టి ..ఆటపాటల్లొ ..జల్సాలల్లో మునిగి తేలతారు.
కలకడ తిరునాల అంగ రంగ వైభవంగా శివారాత్రికి మూడు రోజులూ జరుగుతుంది. శివుడి ఆలయం దేదీప్య మానంగా దీప కాంతులతో ..భక్తులతో నిండి పోతుంది.
ఈ నెలలోనే ఎక్కడ నుండో వస్తారు సంచార జాతులు. పూస లమ్ము కొనే వాళ్ళు, తెల్ల వారి జామున వచ్చే బుడబుక్కల వాళ్ళు, హరి దాసులు, గంగిరెద్దుల వాళ్ళు, వేమన వంశస్థులు .. వీరు గుర్రాల మీద పసుపు రంగు పంచె ..పసుపు చొక్కా వేసుకొని వస్తారు. వాళ్ళు వేమన పద్యాలు చెబుతారు.
కొందరు ఒక్క పెద్ద జ్యోతిని వెలిగించి..దేవుడి పటం తగిలించుకొని , ఒక చేత్తో గంట వాయిస్తూ , దేవుడి పాటలు పాడుతూ ఇల్లిల్లు తిరుగు తారు.
రైతులు గూడా సంతోషంగా తమకు పండిన ధాన్యాన్ని ఒక చేట నిండుకూ వీరికి ఇస్తారు. బట్టలు , తృణమో పణమో రూకలు గూడా ఇస్తారు. రాయల సీమ రైతన్నలు దాతృత్వానికి పేరొంది నారు. ఎవ్వరినీ ఒట్టి చేతులతో పోనియ్యరు.
ఇక చేతి వృత్తుల వారు మంగలి..చాకలి...కంసాలి..వారికి రావలసిన ధాన్యం కోసం ప్రతి ఇల్లు తిరిగి రాబట్టు కొంటారు.
బ్రాహ్మణులకు గుమ్మడి కాయలు దానం ఇస్తారు. అలాగే పప్పులు, నెయ్యి, నూనె, ధాన్యం గూడా దానం ఇస్తారు.
ఆ రోజుల్లో మజ్జిగ, పాలు, పెరుగు , నెయ్యి అమ్మా లంటే అవమాన కరంగా తోచేది రైతులకు. తరువాత రాను రాను ఖర్చుల భారాన్ని తట్టుకోలేక కొందరు అమ్మే వారు.నెయ్యి సొలిగె పావలా వుండేది. పెరుగు ముంతల్లో పెట్టి కురవ కులం వారు అంటే గొల్ల వారు బుట్టల్లో పెట్టుకొని తెల్లవారి ఇంటికి వచ్చి ఇచ్చి పొయ్యే వారు. పావలాకు రెండు మూడు ముంతలు ఇచ్చే వారు.
ఆ నెల అంతా ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు , రంగ వల్లుల మధ్య ఆవు పేడతో చేసి ..గుమ్మడి పువ్వు తోనో , తంగేడు పూల తోనో అలంకరించే వారు. అంతకు ముందే తెల్ల వారి జామున్నే లేచి , చీపురుతో ఇంటా, బయట శుభ్రం చేసి , పేడ నీళ్ళతో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టే వారు. ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో నవ నవ లాడేది.
సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి , కనుమ. కొందరు నాలుగవ రోజున ముక్కనుమ అని మాంసాహారం భుజిస్తారు. కనుమ పండగను దోసల పండగ, పశువుల పండగ అంటారు.
కనుమ రోజు పశువులకు స్నానాలు చేయించి శుభ్ర పరుస్తారు. ఆ రోజు వాటికి కావలసిన తిండి వగైరాలు బాగా తిని పిస్తారు. కొమ్ముల్ని బాగా చెక్కి వాటిని రంగు కాగితాలతో , వివిధ రకాల పూల దండలతో అలంకరిస్తారు. మెడలో పూల హారాలు వేసి, రంగు రంగుల గాలి బుడ్డల్ని కడతారు. మెడలో కొత్త చిరు గంటల్ని గూడా కడతారు.
సాయంత్రం అందరి ఇళ్ళళ్ళో ఉన్న పశువులు ఆన్నీ గుడి దగ్గరికి చేరు కోగానే వాటికి పూజ చేసి, బ్యాండు , డోలు వాయిద్యాలతో వూరి బయట వేసిన భోగి మంటల దగ్గరికి తీసు కెళ్ళి , ఆ కంప , కట్టెల్ని పూజల తరువాత వెలిగించి టెంకాయలు కొట్టి పశువులకు దిష్టి తీస్తారు. పశువులను మూడు సార్లు అగ్ని ప్రదక్షిణ చేయించి వది లేస్తారు. అవి పరుగు పరుగున ఎవ్వరి ఇంటికి అవే చేరుతాయి.
గ్రామీణ సంఘ జీవితం..పశు పక్ష్యాదులతో మమేక మయ్యి తర తరాలుగా ఇలాగే సాగుతున్నది. ఇది ఈ వూర్లల్లో జరిగే పండగ తంతు.ఒక్కొక్క ప్రాంతంలో ఇంచుమించు ఇలాగే జరుగుతుంది ఈ పండగ అన్ని చోట్లా.
************************************************"
మామూలుగా చిత్తూరు జిల్లాలో జరిగే పండగ తంతు గూడా మాట్లాడు కోవాలి ఇక్కడ.
ఇప్పుడు మనం సంక్రాంతి పండగ చిత్తూరు జిల్లాలో ఎలా చేసుకొంటారో చూద్దాము.
భోగి పండుగ
వ్వయసాయ దారులైన పల్లె వాసులు తమ వ్యవసాయ పనులన్ని ఒక్క కొలిక్కి వచ్చి పంటలన్నీ ఇంటికొచ్చి న సమయాన వచ్చేదే సంక్రాంతి పండగ. మిగతా పండగలు ఎలా వున్నా రైతుకు ప్రాముఖ్యానిచ్చేదె సంక్రాంతి. ఇవి వరుస పండగలు. ఈ వరుసలో ముందుగా వచ్చేది బోగి పండగ. ఈరోజున తెల్లవారు జామునే ఇంటి ముందు బోగి మంటలు వేస్తారు. ఇంట్లో వున్న పాత సామానులు పనికి రానివన్ని అనగా చాటలు, గంపలు, తట్టలు, చీపుర్లు, అన్నీ ఎవరింటి ముందు వాళ్ళు బోగి మంట పెట్టి కాలుస్తారు. అవన్ని తొందరలో కాలిపోతాయి. ఆ తర్వాత కంపలు, చెత్త, కట్టెలు వేసి మండించి చలి కాచు కుంటారు. మంట వేడికి శరీరం ముందు భాగం బాగా వేడిగా వుంటే వాతావరణం లోని చలికి వీపు బాగా చాల చల్లగావుంటుంది. ఇదొక వింత అనుభూతి. తెల్లవారి కోడిని కోసి లేదా వేరె వూర్ల నుండి వేట కూర తెచ్చి వండి అందులోకి వడలు చేసి తింటారు. కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు. తరువాత వచ్చేది సంక్రాంతి,
సంక్రాంతి
అదె పెద్ద పండగ. ఈ రోజున పెద్దలు తమ తల్లి దండ్రులు చనిపోయిన వారు వారి ఆత్మ శాంతి కొరకు ఉపవాసముండి స్నానం చేసి అయ్యవారి రాక కొరకు ఎదురు చూస్తుంటారు. అయ్యవారు అంటే ఆ ప్రాంత బ్రాంహడు. కొన్ని పల్లెలకు కలిపి ఒక బ్రాంహడు వుంటాడు. అన్ని శుభాసుభ కార్యాలకు అతను రావలసిందే. వేరెవ్వరు రావడానికి వీలు లేదు. ఇది అతని ఇలాకా. ఆ అయ్యవారు వచ్చి నంత వరకు ఆ గృహస్తుడు ఉప వాసముంటాడు. ఆతను వచ్చాక పూజా కార్యుక్రమాలు ప్రారంబించి గృహస్థుని చేత అతని పెద్దలకు తర్పణ, ఇస్తాడు, కాకులకు పిండ ప్రధానం చేయిస్తాడు. ఇలా పెద్దలకు తర్పణ ఇస్తున్నందుకె దీన్ని పెద్ద పండగ అన్నారు. పూజానంతరం, గృహస్తుడిచ్చిన దక్షిణ;; అనగా బియ్యం, కూరగాయలు, పప్పులు మొదలగునవి తీసుకొని మరొక్కరింటి కెళతాడు. ఈరోజున మాంసం వండరు. ఈ రోజున అనేక పిండి వంటలు చేస్తారు. ఈరోజు తప్పక వుండవలసిన పిండి వంట అరిసెలు పిల్లకు పిండిపంటలె పండగ. ఈరోజు నుండే గొబ్బెమ్మ పాటలు పాడతారు ఆడ పిల్లలు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను తీరుస్తారు. గొబ్బెమ్మ అంటే ఆవు పేడను ముద్దగా చేసి ముగ్గు మధ్యలో పెట్టి మధ్యలో గుమ్మడి పూలు పెడ్తారు. ఆ ఊరి ఆడపిల్లలందరూ కలిసి ఒక జట్టుగా చేరి అలంకరించుకొని, ఒక పళ్లెంలో పశుపు ముద్దను వుంచి దానిపై దీపం పెట్టి, చుట్టు పూలను అలంకరించి ప్రతి ఇంటికి వచ్చి ఆ పళ్లేన్ని క్రింద పెట్టి దాని చుట్టు తిరుగుతు తమ రెండు చేతులు తట్టుతూ గొబ్బెమ్మ పాటలు పాడతారు. ఆ ఇంటి వారు దీపంలో నూనె పోసి వారికి బియ్యం కొంత డబ్బులు ఇవ్వాలి. చివరి రోజున ఆ పిల్లలందరు వచ్చిన బియ్యాన్ని పొంగలిపెట్టి తిని ఆనందిస్తారు. ఇది ఆ వూరి ఆడపిల్లల సంబరం. ఈ తతంగం అంతా ఏ వూరి ఆడపిల్లలు ఆవూర్లోనే. పక్క ఊరికెళ్లరు. కానీ.... ఇంత కాలము వ్యవసాయదారుల పొలాల్లో కూలీ చేసిన ఆడవాళ్ళు, ముఖ్యంగా హరిజనులు ఈ రోజున ప్రతి రైతు ఇంటి ముందు గొబ్బెమ్మ పాటలు పాడి ఆడతారు. వారికి రైతు కుటుంబం ధాన్యం, డబ్బులు శక్తాను సారం బారీగానె ఇస్తారు. ఇచ్చినది తక్కువనిపిస్తే వారు వెళ్లరు. బలవంతం చేస్తారు... సాధించు కుంటారు. అదే విధంగా పరా వూరు నుండి కొంత మంది హరిజన మహిళలు వచ్చి గొబ్బెమ్మ పాటలు పాడతారు కాని ఇచ్చింది తీసుకుని వెళతారు. ఇలాంటి వారు యాచకులు కాదు. కేవలం సంక్రాంతి సందర్భంగానె గొబ్బెమ్మ పాటలు పాడి ఆసిస్తారు. అలాగే గంగి రెద్దుల వాళ్లకు కూడా ఇది పెద్ద పండగే. వారు గంగి రెద్దును ఆడించి రైతుల మెప్పించి బహుమతులను పొందుతారు. గంగిరెద్దుల వారు ప్రదార్శించె విన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గది ..... గంగిరెద్దుల వాడు రోడ్డుమీద వెల్లకిలా పడుకొని తన ఎద మీద గంగిరెద్దు ముందరి కాళ్లను పెట్టించుకొని ఆడించడము. రైతులు గంగిరెద్దుల వారికి ధాన్యాన్ని, వేసి పాత బట్టలను, చీరలను ఆ గంగిరెద్దు మీద వేస్తారు. ఆ విధంగా గంగిరెద్దు పైన అనేక మైన రంగులతో బట్టలు కనిపిస్తాయి. ఎవరైనా ఆడపిల్లలు ఎక్కువ బట్టలు వేసుకొని ఆడంబరంగా కనిపిస్తే..... గంగిరెద్దులా తయారయావేంది? అని అంటుంటారు. ఇది ఒక నానుడి.
కనుమ పండగ
మూడో రోజున వచ్చేది కనుమ పడుగ. కనుమ పడగ నాడు కూడా పిండి వంటలదే అగ్ర స్థానం. పార్వేట ఈ నాటి ప్రధాన ఘట్టం. వైష్ణవాలయం ప్రధానంగా వున్న ఒక పల్లె లోనుండి దేవుడిని పల్లికిలో మంగళ వాయద్యాలతో ఆ చుట్టు పల్లెలలో వూరేగించి చివరన దగ్గరలో వున్న కొండ ప్రాంతంలో గాని మైదాన ప్రాంతంలో గాని దేవుడిని దించి అక్కడ శమీ వృక్షం క్రింద పూజ నిర్వహించి, అప్పటికె పూజించి సిద్దం చేసు కున్న ఒక గొర్రె పొట్టేలును దూరంగా ఆ కొండ వాలులో కట్టేసి సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఒక హద్దు ఏర్పరచి అక్కడ అందరు నిలిచి తమ తుపాకులతో దూరంగా వున్న గొర్రె పోతును కాల్చాలి. ఎవరు కాసిస్తే అది వారికే చెందు తుంది. ఎవరూ కాల్చ లేక పోతె అది ఇంతవరకు దేవుని వూరేగింపులో పాల్గొన్న మంగలి వారికి చెందు తుంది. మంగలి వారు ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని ఆ పొట్టేలుకు ఎలాంటి దెబ్బ తగల కుండుటకు ఏవో కనికట్టు విద్యలు, మంత్రాలు వేస్తుంటారు. తుపాకులు లేనివారు తూటాలు తెచ్చుకొని ఇతరుల తుపాకులతో ప్రయత్నిస్తారు. చుట్టు ప్రక్కల పల్లె వాసులకు ఇదొక పెద్ద వినోద కార్యక్రమం. ఈ ఆచారానికి మాతృక:..... తిరుమల లోని శ్రీ వేంకటేస్వర స్వామి వారికి కనుమ రోజున వేటగాని వేషం వేసి విల్లంబులు ధరింప జేసి గోగర్బం డాంకు ఎదురుగా వున్న పార్వేట మిట్టకు ఊరేగింపుగా తీసుక వస్తారు. అక్కడ స్వామి వారు క్రూర మృగాలను వేటాడి నట్టు కొన్ని కార్యక్రమాలు చేసి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుతారు. ఆరోజుల్లో తిరుమల వాసుడు విల్లంబులతో క్రూర మృగాలను వేటాడితే....... ఈ నాడు మానవుడు తుపాకులతో బంధించి వుంచిన గొర్రె పోతును వేటాడ తారు, అదీ ఆ దేవుని పేరు మీద.
పశువుల పండుగ
పశువుల పండగే ఈ వరుసలో చివరిది. ఈ రోజున పిండి వంటలదే పండుగ. సాయంకాలం ఊరి బయట కాటమ రాజు వద్ద పొంగిళ్లు పెట్టి పూజ చేస్తారు. కాటమ రాజు అంటే అక్కడేమి గుడి వుండదు. ఒక చెట్టు క్రింది తాత్కాలికంగా రెండు రాళ్లను పెట్టి వాటిని కడిగి వీబూతి పట్టెలు పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేస్తారు. అక్కడి పూజారి ఆ వూరి చాకిలే. ఆ దేవుని ముందు వూరి ఆడవారందరు గిన్నెల్లో బియ్యం, బెల్లం తెచ్చి అక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగలి వండుతారు.. ఇంత లోపల చాకలి దేవుని వద్ద అలంకరణ పూర్తి చేస్తాడు. అందరు తలోక పొంగలి ముద్దను తీసి దేవుని ముందు కుప్పగా పెడ్తారు. చాకలి పూజా కార్యక్రమం కానిస్తాడు. అప్పటికే వూర్లో వున్న ఆవులను ఎద్దులను అన్నింటిని ఇక్కడికి తోలుకొస్తారు. కోళ్లను మొక్కుకున్న వాళ్ళు చాకలికి తమ కోళ్లను ఇస్తారు. అతను వాటిని కోసి దేవుని ముందు వేస్తాడు. పూజానంతరం పొంగలిని తలా కొంత ప్రసాదంగా తీసుకొని ఒక పెద్ద పొంగలి ముద్దను పశువుల కాపరికి ఇచ్చి తినమని, అతని వీపుకు ఇంకొక ముద్దను కొడతాడు చాకలి. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పొంగలిని తింటూ పశువులకున్న పగ్గాలను, దారాలను తీసేసి తరుముతాడు. అవి తలోదిక్కుకు వెళ్లి పోతాయి. అప్పటికి చేలన్నీ పరిగిలి పోయి వుంటాయి కనుక అవి ఎక్కడ ఏ చేల్లో దూరినా అడగడానికి లేదు. ఆరాత్రికి పాలు తాగె దూడలను కూడా కట్టడి చేయరు. అనగా పశువులకు స్వాతంత్ర్యం అన్నమాట. అదే పశువుల పండుగ. ఆ సందర్భంలోనె ఒక నెల నుండి కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయె, పశువుల కాపరులు, రైతులు అక్కడ ఒక కంపో, కర్రో వేస్తుంటారు. ఈ నాటికి అది ఒక పెద్ద కుప్ప అయి వుంటుంది. పశువుల కాపరి ఆ కుప్పకు నిప్పు పెట్టి పశువులను బెదిరించి తరిమెస్తాడు. ఆ కంపల కుప్పను చిట్లా కుప్ప అంటారు. ఆ మంట ఆరిపోయిన తర్వాత అందరు అక్కడి నుండి నిష్క్రమిస్తారు. ఇంటి కెళ్లి...దేవుని వద్ద కోసిన కోళ్లలు బాగు చేసుకుని కూర వండుకుని తింటారు.
జల్లికట్టు
ఈ పండుగకు జరిగే జల్లికట్టు చిత్తూరు జిల్లా, తమిళనాడులో భారీ ఎత్తున జరుగు తుంటాయి. వీధుల్లో డప్పులను వాయించి అలంక రించిన పశువులను తరుము తారు. అలా రెండు మూడు సార్లు పశువులను తరిమాక ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు రంగులతో అలంక రించిన బలమైన ఎద్దులలు, కోడెలను.... తరుముతారు. ముందుగా వాటి కొమ్ములకు రంగులు పూసి ఒక తువ్వాలు కట్టి అందులో వంద రూపాయలు .... వారి స్థాయిని బట్టి ఐదు వందల రూపాయలను కట్టి అల్లి వద్ద నిలిపి డప్పులతొ వాటిని బెదిరించి తరుముతారు. ధైర్యం వున్న వారు వాటిని పట్టి లొంగ దీసుకొని దాని కొమ్ములకు కట్టిన బట్టలోని డబ్బులు తీసుకోవచ్చు. దాని కొరకు కొంత మంది బలవంతులు తయారుగా వుంటారు. కొన్ని ఎద్దులు, లేదా కోడెలు తమ యజమానిని తప్ప ఇతరుల నెవ్వరిని దరి చేరనియ్యవు. అలాంటి వాటిమీద చెయ్యి వేయడమే ప్రమాదం. అటు వంటి వాటిని బెదరగొట్టిన తర్వాత వాటిని లొంగ దీసు కోవడం చాల ప్రమాధ కరమైన పని. అయినా కొందరు ఈ సాహసానికి పూను కుంటారు. ఇంకొన్ని ఎద్దులుంటాయి. అవి వట్టి బెదురు గొడ్డులు. వాటిని బెదిరిస్తే అవి చేసె వీరంగం అంతా ఇంతాకాదు. వాటిని ఆపడం అతి కష్టం. వీటి వలన ప్రమాదం ఎక్కువ. ఎందు కంటే ఇవి బెదిరి పోయి ఇరుపక్కల క్రీడను చూస్తున్న జనంలోకి దూరి పోతాయి. ఈ క్రీడలో చాల మందికి గాయాలవు తుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరుగు తుంటుంది. ఇలాంటి క్రీడను ప్రభుత్యాలు నిషేధించినా ఫలితం లేదు. ఇటు వంటి క్రీడ పలాన పల్లెలో జరుగు తుందని ముందుగాని ఆ చుట్టు ప్రక్కల పల్లెల్లో దండోర వేసి తెలియ జేసి వుంటారు. దాంతో ఆ చుట్టు ప్రక్కల రైతులు తమ ఎద్దులను కోడెలను అలంకరించు కొని అక్కడికి తీసు కెళతారు.
************************************************"
తరువాత మన కథ లోకి వస్తే....
రెండు గ్రామాల ప్రజలు గూడా ఒక్క చోటే చేరి ఈ అగ్ని ప్రదక్షిణ వారి పశువులతో చేయించారు.
అక్కడకు వచ్చిన పశువుల్లో కెల్లా రాజశేఖర రెడ్డి , మరియు జయరామ నాయుడు పశువులు చాలా ఉన్నతంగా అలంకరించారు.
అవి ఆరోగ్యంగా చాలా చలాకీగా గూడ ఉన్నాయి.
సుధాకర్ నాయుడు మరియు దివాకర్ నాయుడు తమ కున్న ఎద్దుల రెండు జతల్ని , ఆవుల్ని , వాటి లేగ దూడల్ని, బర్రెల్ని తీసు కొచ్చారు.
అలాగే రమ గూడా పట్టు లంగా, ఓణీతో అందంగా అలంకరించుకొని అన్న గార్లకు తోడుగా వచ్చింది.
ఈ ప్రక్క నుండి అశోక్ రెడ్డి గూడా జీత గాళ్ళతో తమ పశువులను అందంగా అలంకరించుకొని వచ్చాడు.
రెండు గ్రామాల ప్రజలు ఆనందంగా గెంతులు వేస్తూ కనుమ పండగను చేసు కొంటున్నారు.
పశువులు ప్రదక్షిణ అయిన వెంటనే సుధాకర్ ..దివాకర్ తిరుగు ముఖం పట్టారు.
కానీ రమ రాలేదేమిటని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు.
రమ , అశోక్ ఒక బండ మీద కూర్చొని తెచ్చుకొన్న ఫలహారాలను తింటూ జోకులు వేసు కొంటూ పడి పడి నవ్వు కొంటున్నారు.
దివాకర్ నాయుడి కి ఒళ్ళు మండి పోయింది.
" రమా " అంటూ గట్టిగా అరచాడు.
ఆ గర్జనకు లేడి పిల్లలా భయ పడిన రమ ఒక్క ఉదుటున లేచింది.
ఆ లేవడంలో ఆ గాలికి రమ వేసుకొన్న పైట కొంగు రెప రెప లాడుతూ అశోక్ మీద పడింది.
ఈ దృశ్యం చూసిన రమ అన్నలకు అరి కాలు నుండి మంట ఎక్కింది.
**************************************************"
సుధాకర్ ..దివాకర్ ఇంటికి చేరుకొన్నారు. రమ గూడా వంట ఇంట్లోకి తల్లి నిర్మలమ్మకు సహాయ పడుతోంది.
జయరామ నాయుడు బయట వ్యవహరాలు చూసుకొని ఇంట్లోకి వచ్చి దొడ్లో ఉన్న బచ్చలి కి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొన్నాడు శుభ్రంగా..
సుధాకర్ తువ్వాలు తెచ్చి ఇచ్చాడు నాయనకు. దివాకర్ మంచి నీళ్ల లోటా అందించాడు.
" ఏరా ..బాగా జరిగిందా పసువుల మెరవణి? మంటలు బాగానే ఏసినారా? మన పసువులు మూడు సార్లు ప్రదక్షిన చేసినాయా? ఆటికి దిష్టి తీసినారా? " అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
" అంతా బాగా జరిగింది నాయనా! మన పసువులు గూడా ఇంటికొచ్చి మేత మేస్తున్నాయిలే" అన్నాడు దివాకర్.
అందరూ హాల్లో కొచ్చి కూర్చొన్నారు.
" నాయనా ..నీతో ఒక ఇసయం చెప్పాల" అన్నాడు సుధాకర్.
" చెప్పు రా" అన్నాడు నాయుడు గారు.
" మన సెల్లెలు తొమ్మిది దాటి పదో తరగతి కి వస్తా ఉండాది. దానికి పెళ్ళీడు గూడా వస్తా వుండాది. ఏ మంచి అయ్యకో ఇచ్చి పెళ్ళి సేసెయ్యాలి నాయనా! " సుధాకర్ అన్నాడు.
" అప్పుడే ఏమంత తొందర అబ్బీ..ఇంకా చిన్న పిల్లనే గదా? "
నాయుడు గారు కొంచెం అసహనంగా అన్నాడు.
" లేదు నాయనా.స్కూళ్ళో మేము తలెత్తు కోలేకుండా ఉన్నాము. మగోళ్ళతో మా చెల్లెలు మాట్లాడుతుంటే మేము తట్టుకోలేము నాయనా" అన్నాడు సుధాకర్ అశోక్ ని దృష్టిలో పెట్టుకొని.
" నేనింకా బతికే ఉండాను గదా? నా కూతురు తో ఎవ్వరయినా పరాసికాలు ఆడితే వాడి తల కాయ తెగ నరుకుతా..మన కుటుంబ ప్రతిష్ట..మన వంశ మర్యాదలు కాపాడాలి. మీకెందుకురా..ఇంకా మీరు సిన్న పిల్లలే గదా..బాగా సదువు కోని ఆ పదో తరగతి గట్టెక్కండి . రమ గూడా పదవ తరగతి పాసు కానీ..తర్వాత పెళ్ళి విషయం ఆలోచిస్తాం " అన్నాడు నాయుడు గారు.
నాయన తమ మాట విన లేదని చాలా కోపం వచ్చింది కొడుకు లిద్దరికి.
అంతలో నిర్మలమ్మ ..రమ హాల్లోకి వచ్చి భోజనానికి పిలిచారు.
అందరూ కనుమ రోజు చేసిన చేపల పులుసు..కోడి కూర..మాంసాహార ప్రత్యేక వంటకాల్ని తృప్తిగా ఆరగించారు.
ఆ రాత్రి పడుకోబయ్యే ముందు నిర్మలమ్మతో" రమకు వయసు వస్తోంది.కాస్తా జాగ్రత్తగా ఉండమని చెప్పు అమ్మికి" అన్నాడు నాయుడు గారు.
" అలాగే నండీ " అని తల వూపింది నిర్మలమ్మ.
***********************************************************************************************తరువాత ఏమయ్యిందో రేపు ఎనిమిదవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
Copy Rights @ author
No comments:
Post a Comment