Sunday, October 11, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (5)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు (5)


( ఐదవ భాగం)


ఒక్క రోజు లెక్కల మాస్టరు క్లాసు జరుగుతోంది.

అశోక్ రెడ్డికి లెక్కలు బాగా వచ్చు. ఏది చెప్పినా వెంటనే నేర్చు కొంటాడు. అంతకు ముందు రోజు బారు వడ్డీ , చక్ర వడ్డి గురించి విపులంగా వివరించారు‌ మాస్టారు. ఈ రోజు కొన్ని లెక్కలు చెయ్యాలి. కొన్ని విద్యార్థులతోనే బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో లెక్కల్ని  సాల్వ్  చెయ్య మన్నాడు.


" పిల్లలూ ..నిన్న మనం బారు వడ్డి , చక్ర వడ్డి గురించి నేర్చు కొన్నాం గదా? అసలు వడ్డీ అంటే ఏమిటి? " అని ఒక పిల్లవాడ్ని అడిగాడు మాస్టారు.


" వడ్డి అనగా కొంత సొమ్మును అప్పుగా తీసుకొని దానికి చెల్లించే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు" 


" కరెక్ట్..బారు వడ్డీ అంటే ఏమిటి?" 


" సాధారణ వడ్డీ ..వడ్డీని తీసు కొన్న అప్పు మీద  అనుకొన్న రేటు‌ ప్రకారం  ఆ నిర్ణీత కాలానికి వడ్డీని చెల్లించే పద్దతి. "' అని ఇంకొక కుర్రాడు చెప్పాడు

" అశోక్ .. నువ్వు చక్ర వడ్డీ అంటే ఏమిటో చెప్పగలవా? 


" వడ్డీ పై వడ్డిని లెక్కకట్టే విధానాన్ని చక్ర వడ్డీ అంటారు"  అంటూ తనే వాటి ఫార్ములాలను గూడా చెప్పాడు.

బారు వడ్డి ..చక్ర వడ్డి ఫార్ములాలను చక్కగా బోర్డు మీద వివరించాడు.

" అశోక్ చూశారా? ఎంత చక్కగా వివరిస్తున్నాడో? " అని అన్నాడు గణితం మాస్టారు.

" సుధాకర్ ..ఈ లెక్క ఒక్కటి ఇస్తాను..చెయ్య గలవా? " అని సుధాకర్ కేసి అడిగాడు సార్.

" అలాగే సార్" 

సుధాకర్ బోర్డు దగ్గరకు వచ్చాడు.

" 6000 రూపాయల అప్పుపై , సంవత్సరానికి 5 % వడ్డీ చొప్పున , మూడు సంవత్సరాల కాలంలో అయ్యే వడ్డి  బారు వడ్డీ ప్రకారం ఎంత? " 

సుధాకర్ కి అసలు ఏమి వ్రాయాలో తెలియడం లేదు. అసలు లెక్క అర్థం కావడం లేదు.

క్లాసులో అందరూ పగలబడి నవ్వారు.

ప్రక్కనే నిలబడిన అశోక్ గూడా గట్టిగా నవ్వాడు. 

" వీడికి పొట్ట బొడిస్తే అక్షరం ముక్క గూడా రాదు గానీ , అశొక్‌ నువ్వు చెయ్య గలవా? " అని అడిగాడు సార్.

" బారు వడ్డీ సూత్రం ....

SI = PTR /100. 

6000x 5x3/100= 900  సాధారణ వడ్డి ప్రకారం

చక్ర వడ్డి సూత్రం 

CI = P(1+R/100)n 


చక్రవడ్డి 945.75 అవుతుంది అని వివరించాడు అశోక్ రెడ్డి


క్లాస్ రూమ్ అంతా కర తాళ ధ్వనులతో  మారుమోగి  పోయింది.

సుధాకర్ నాయుడు మొహంలో నెత్తురు  చుక్క లేదు. అవమాన భారంతో మెల్లగా వచ్చి తన సీట్లో కూర్చొన్నాడు.


అశోక్ వల్ల తను టిచర్ చేత చీవాట్లు తిన్నాడని తనలో తను కుమిలి పొయ్యాడు. అశోక్ మీద చాలా ఉక్రోషం పెంచు కొన్నాడు సుధాకర్ .

************************************************** 


ఆ రోజు సాయంకాలం నాలుగు గంటల నుండి  పి టి క్లాసు ఉంది.

పిల్లలంతా వారి వారి అభీష్టం మేరకు ఏ గేమైనా ఆడుకోవచ్చు.

ఆ స్కూలుకు విశాల మైన మైదానం ఉన్నది. అన్ని  ఔట్ డోర్ ఆటలకు మంచి  క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆడపిల్లలు బాడ్ మింటన్..టెన్ని కాయిట్ , కో , కో ఆడుతారు మామూలుగా. మగ పిల్లలు కబడి, వాలీ బాల్, ఫుట్ బాల్, బాడ్ మింటన్ ఆడుతారు. ప్రతి గవర్నమెంటు హైస్కూల్లో ఆటపాటలకు ప్రాముఖ్యత ఇస్తారు. విశాల మైన మైదానాలు ప్రతి స్కూలుకు ఉంటాయి. అవే గాకుండా రన్నింగు రేస్, హై జంప్, లాంగ్ జంప్ లాంటి వాటిల్లో గూడా పోటీలు ఉంటాయి.‌

సంవత్సరంలొ ఒక్క సారి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు నాటకాలు, పాటలు , ఆటలు , ఫాన్సీ  డ్రెస్సులు ఊంటాయి. 


అప్పట్లో పిల్లలు హై స్కూలు చదువు లోనే అన్నీ నేర్చుకొనేవారు.

శరీర దారుడ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం గూడా ఉండేది విద్యార్థులకు.

పదవ తరగతి విద్యార్థులంతా రెండు జట్లుగా విడి పోయి కబడి ఆడుతున్నారు.

బనీన్లతో ప్రతి ఒక్కరూ నిలబడి ఇసుక నింపిన గ్రౌండు లో  కబడి ఆడుతున్నారు.


కబడి ..కబడి..కబడి...కబడి..

ఎవ్వరికీ చిక్క కుండా లైన్ దాటకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 

సుధాకర్ ఒక జట్టులో, అశోక్ ఇంకొక జట్టులో ఉన్నారు.


ఇప్పుడు అశొక్ వంతు వచ్చింది.

చిన్న పిల్లాడు గదా ..అందరినీ అదిలిస్తూ కబడి కబడి అని మళ్ళీ తన జట్టు వైపు వచ్చాడు. ఈ సారి సుధాకర్ ఇంకొక జట్టు వైపు వచ్చి  ఆడ సాగాడు. 


అశోక్ ని ఎలాగైనా ఓడించాలని సుధాకర్ నిశ్చయంగా ఉన్నాడు.

కానీ కుదర లేదు.


మళ్ళీ అశోక్ వంతు వచ్చింది. సుధాకర్ జట్టు వైపు రాకెట్ స్పీడులో కబడి కబడి అంటూ పరుగెత్తాడు.


అంతే..ఒక్క సారిగా అశోక్ మీద ఆంబోతు పడినట్లుగా సుధాకర్ అశోక్ చేతులు విరుస్తూ వీపు మీద పిడి గుద్దులు గుద్ది, ఒళ్ళంతా గోర్లతో రక్తమొచ్చేటట్లు  గీకాడు.


ఆ బాధ భరించ లేక అశోక్ అమ్మా అంటూ తెలివి తప్పి పడి పొయ్యాడు.

అక్క డున్న వారంతా అశొక్ ను ఎత్తుకొని మంచి నీళ్ళు తాగించి ఉపశమనం చేశారు.

అంతలో పి టి మాస్టర్ వచ్చి ప్రాధమిక చికిత్స చేశాడు. సుధాకర్ ఈ పని చేశాడని అతడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.


" రేపు నీ సంగతి..హెడ్ మాస్టర్ కి చెప్పి పనిష్ మెంటు ఇప్పిస్తా ..ఒరేయ్ ..సుధాకర్..చిన్న పిల్లోడ్ని అలా బరుకు తావా? 

" అన్నాడు పి టి సార్.

" చెప్పుకో ...నా కేం భయం లేదు " అన్నాడు సుధాకర్ నాయుడు నిర్లక్ష్యంగా సమాధాన మిస్తూ.


***********************************************తరువాత ఏమయ్యిందో రేపు  ఆరవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

Copy Rights @ author

కాపీ హక్కులు రచయితవి.

No comments:

Post a Comment