Sunday, October 11, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(4)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు(4)

( నాలుగవ భాగం)



జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ రెండు గ్రామాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉంటుంది మహల్ లో అనే టౌన్ లో.


బాహుదా నదిని దాటుకొని పోవాలి మహల్ కి పోవాలంటే. ఆరవ తరగతి నుండి  పదవ   తరగతి వరకు ఈ ఉన్నత పాఠ శాల లోనే చదువు కోవాలి. 


ఉన్న గ్రామాల్లో ఐదవ తరగతి వరకే ఉంది. అదీ ఏకో పాధ్యాయుడు ఉన్న ప్రాధమిక పాఠ శాల . 


చాలా మంది ఆర్థిక పరిస్థితుల వల్ల పదవ  తరగతి వరకు చదివి మానేస్తారు. ఇంకా బీద వారు ఉన్న గ్రామంలో ఐదవ తరగతి వరకే చదివి మానేస్తారు.


మహల్ లో ఉన్న స్కూల్లో  రాజశేఖర్ రెడ్డి  ఒకే కొడుకు  అశోక్ రెడ్డి , జయరామ నాయుడు  పెద్ద కొడుకు సుధాకర్ నాయుడు పదవ తరగతిలో చదువుతున్నారు. 


సుధాకర్ అశోక్ కంటే ఒక్క సంవత్సరం పెద్దయినా ఎనిమిదవ తరగతిలో‌ బోల్తా పడ్డాడు. అసలు పరీక్షలే వ్రాయలేదు. అందుకే అశోక్ తో చదవ వలసి వచ్చింది.


అన్న దమ్ముల కిద్దరికి చదువు మీద ధ్యాస లేదు. ఏదో పదవ తరగతి వరకు లాగించాలని  అనుకొన్నారు.

నాయుడు గారి చిన్న కొడుకు దివాకర్ నాయుడు, కూతురు రమా నాయుడు తొమ్మిదో తరగతిలో చదువు తున్నారు. దివాకర్ ఒక సారి  తొమ్మిదో  తరగతి ఫైల్ అయి పోవడం వల్ల రమ తో ఒకే క్లాసులో చదవ వలసి వచ్చింది. ఇది తనకు చాలా అవమాన భారంగా తోచేది.


స్కూలు గంట గణ గణ మని  కొట్టాడు  స్కూలు ప్యూన్‌..

అందరూ అసెంబ్లీ గ్రౌండ్ కి చేరుకొని ప్రార్థనా గీతం పాడారు.హెడ్ మాస్టర్ ఏదో కొన్ని  నైతిక విలువలు గురించి ఉపన్యాస మిచ్చారు.


జన గణ మణ అయిన తర్వాత ఎవరెవరి క్లాసు రూముల్లోకి  వారు వెళ్ళారు.


క్లాసుకు వెడుతున్న  రమ అశోక్ రెడ్డిని చూసి నవ్వింది  రమ.


" రమ ....బాగున్నావా? " అశోక్ రెడ్డి రమను చూస్తూ అన్నాడు.


" ఆ ..బాగున్నా.. నువ్వు ఎలా ఉన్నావబ్బా? " అని అడిగింది రమ.


ఆ తొట్రు పాటులో రమ చేతుల్లో ఉన్న పుస్తకాలు జారి క్రింద పడి పొయ్యాయి.


ఆ పుస్తకాల్ని అన్నీ తీసి రమకు అందించాడు.

" థాంక్స్ " రమ నవ్వుతూ తీసుకొంది పుస్తకాల్ని.


ఈ దృశ్యాన్నంతా దివాకర్, సుధాకర్ అన్న దమ్ములు దూరాన్నుంచి చూస్తూ గమనించారు.


*************************************************


అశోక్ రెడ్డి అన్ని తరగతుల్లోనూ ఫస్టే..చదువులో చాలా ముందుంటాడు. అందుకే అశోక్ రెడ్డి అంటే  స్కూల్లోని టీచర్లకు చాలా  ఇష్టం . 


సుధాకర్ , దివాకర్ కి చదువంటే పొసగదు. అన్నీ సగటు మార్కులతో పాసు అవుతారు. నాయుడు గారు పదవ తరగతి వరకు సదివి ఏడ్చండి...మళ్ళీ ఏదో యాపారం పెట్టిస్తానని చెప్పడంతో అసలు చదువు మీద ధ్యాసే పోదు ఇద్దరికీ .


రమ మళ్ళీ క్లాస్ ఫస్ట్  వస్తుంది. బాగా చదువుతుంది. అందుకే రమ అంటే చాలా కోపం అన్నయ్య లిద్దరికి. 


తెలియని వన్నీ అశోక్ ని అడిగి నేర్చు కొంటుంది రమ. అలా అశోక్ తో చనువుగా ఉండడం  సుధాకర్ కి , దివాకర్ కి గిట్టదు.


**************************************************


లెక్కల మాస్టారు క్లాసు తీసుకొని లెక్కలు నేర్పిస్తున్నాడు.

అశోక్ లెక్కలో దిట్ట..బాగా నేర్చు కొంటాడు.

ఈ సారి మీకు స్కూల్ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. లెక్కల్లో నూటికి నూరు మార్కులు సంపాయించు కొంటే స్కూల్ ఫస్ట్ వస్తారు. తరువాత చదువులకు_ పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యడానికి మీకు ఈ మార్కులు ఉపయోగ పడతాయి. మీరందరూ ఈ సంవత్సరం బాగా చదివితే మీకు నేను మంచి బహుమానాలు, క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను. సరేనా ? అని క్లాసు అంతా కలియ తిరుగుతూ అన్నాడు లెక్కల మాస్టారు.


అందరూ హుషారుగా " సరే సార్ " ..అన్నారు .


ఒక్క సుధాకర్ నాయుడు తప్ప. కిటికీలోంచి బయటకు చూస్తూ చెట్టు మీద' కావ్...కావ్..' అని  అరుస్తున్న కాకి శబ్ధాన్ని వింటున్నాడు.

---------------------------------------------------------------------

తరువాత ఏమయ్యిందో రేపు  ఐదవ  భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)




(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 


ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

Copy Rights @ With Author

---------------------------------------------------------------------


No comments:

Post a Comment