Wednesday, January 9, 2019

పుష్ప విలాపం


******************************

కవి: వారణాసి భానుమూర్తి రావు
శీర్షిక: పుష్ప విలాపం
సంఖ్య: 6
తేది: 09.01.2019 ; బుధ  వారం
***************************

నిన్నటి వరకు
ఆడుతూ , తూలుతూ
అందమైన  లోకాన్నీ
అందులోని  ఆర్ణవాన్ని
మాత్రమే  తెలుసు కొన్న  ముద్దబంతి లాంటి  పిచ్చిపిల్ల !

రంగుల  అద్దాల  వెనుక
దాగిన  కలల  ప్రపంచం
రేపటి తన  ఆశల్ని  'విస్కీ ' లో   కలిపేసింది.
తనకు' రేపు '  గురించే  తెలుసు !
'రేప్'  గురించి అసలు తెలీదే !

 అనాఘ్రాత పూవులా తనూ పెరిగింది
స్నేహ హస్తాలు చాచిన కొన్ని చేతుల్ని  నమ్మింది

పువ్వులకు ఏమి తెలుసు?
కండ కావరంతో బలిసిన తుమ్మెదలు కాటు వేస్తాయని !
అందమైన  లోకంలో  బ్రహ్మ  జెముడు చెట్లున్నాయని !
అమాంతం నోట్లోకి  లాక్కొనే  విష పుష్పాలు  ఉన్నాయని  !
అంతే  గాదు  ...   కార్నివోరస్  లాంటి చెట్లు  మన మధ్యనే  తిరుగుతూ ఉంటాయనీ !

ముద్దబంతి పూవు లాంటి తన తనువును వాడుకొని
స్నేహానికి అపహాస్యం చేశారు

తన కి ఏ పాపం తెలియదు
రెడ్ లైట్ ఏరియాకి  ఎవ్వరో తనని అమ్మేశారు
ఇప్పుడు తను  ఏ దేవుడి పూజకూ పనికి రాని ముద్ద బంతి పూవు!!
ఎండకు ఎండి, వానకు తడిచి రాలిపొయ్యే బంతి పువ్వు మాత్రమే!!
తన పుష్ప విలాపం ఎవ్వరు అర్థం చేసుకొంటారు??

-------------------------------------------------------------------------------------
వారణాసి భానుమూర్తి రావు


No comments:

Post a Comment