Wednesday, January 9, 2019

దేశ ముదుర్లు

******************************
అంశం: దేశ ముదుర్లు
కవి: వారణాసి భానుమూర్తి రావు
శీర్షిక: దేశ ముదుర్లు
సంఖ్య:5
తేది: 08.01.2019 ; మంగళ వారం
****************************

కొందరు దేశ ముదుర్లు చిలవలు పలవలుగా
అబధ్దాల కత్తులకు పదునులు పెడుతూ
కాలం గడుఫుతూ ఉంటారు

వాళ్ల రక్తంలో చక్కెర అధిక శాతం ఉంటుంది
కాని వాళ్ళు మధు మేహ వ్యాధి గ్రస్థులు
వాళ్ళు తియ్యగా మాట్లాడ గలరు

అడవిలో పూచే రాక్షస పూలు వంటి వారు
వాలిన ప్రతి జీవాన్ని కూడ బలుక్కుని
అమాంతంగా నోట్లోకి జార విడుచు కొంటారు
నింపాదిగా కూర్చొని రక్తాని జుర్రు కొంటారు

అవసరానికి ఆసరా ఇవ్వరు వాళ్ళు
అప్పనంగా వచ్చి పచ్చని చెట్టు మీద వాలే పక్షుల్లా వాలుతారు
అందని ద్రాక్ష పళ్ళ కోసం అర్రులు చాచే రకం వాళ్ళు
వాళ్ల పిడి వాదానికి మీరు మీ పిడికిళ్ళు తెరుస్తారు

మీ గుండె కేరింతలు కొడుతుంది చిన్నపిల్లలా
మీరు హిప్నటైజ్ చేసిన వ్యక్తిలా వాళ్ళు చెప్పింది చేస్తారు
ఆకాశంలొ హరివిల్లుని అనుకొన్నప్పుడు చూపించ గలరు
అవధూత లక్షణాలు వాళ్ళళ్ళో ఎక్కువుంటాయి
కానీ వాళ్ళు మాయలేడి రూపంలో ఉన్న మారీచులు
అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలేరు
నీ ముఖాన్నే అద్దంగా మార్చి వాళ్ళు చూసుకొంటారు
నీ కనుపాపల్లొంచి వెలుతుర్ని వాళ్ళు వెతుక్కొంటారు
నీ ముక్కు లోంచి వాళ్ళు శ్వాసని పీల్చ గలరు

వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు!
వాళ్ళే పరాన్న జీవులు !!
---------------------------------------------------------------------------------
*యం.వెంకటలక్ష్మి గారి సమీక్షలు (886)*

*06*  *వారణాసి భానుమూర్తి రావు*
శీర్షిక : పరాన్నజీవులు
" కొందరు దేశముదుర్లు అబద్ధాల కత్తులకు పదును పెడుతూ " ఉంటారు అనే ఎత్తుగడ చాలా బాగుంది.
వాళ్ళు తియ్యని మాటలతో గొంతు కోస్తారనీ, తోటి జీవుల రక్తాన్ని తాగే రాక్షసపూల వంటి వారనీ, మారీచుల లాంటి వారనీ, సామాన్యుల కష్టార్జితం పై పడి బతికే పరాన్నజీవులనీ వాస్తవాలను చెప్పారు కవి.



No comments:

Post a Comment