Wednesday, January 9, 2019

బ్రతుకు వెతుకు లాట

****************************
అంశం:భూమి‌పుత్రుల పాద యాత్రలు
కవి: వారణాసి భానుమూర్తి రావు
శీర్షిక:  బ్రతుకు వెతుకు లాట
సంఖ్య: 04
తేది.07.01.2019
******************************

భూమి పుత్రుల పాదయాత్రలు
అవనిపై ఆరని బ్రతుకు చిత్రాలు
బ్రతుకు సిలువపై గాయపడ్డ దీన జీవులు
జీవితాన ఓడి పోయిన  రెక్కల పురుగులు

దశ , దిశ లేని పయనంలో
ఎక్కడి కని పాద యాత్ర?
చంకన బిడ్డల్ని - నెత్తిన మూటల్ని
పెట్టుకొని ఎక్కడికని నీ జీవన యాత్ర?

భూమి తల్లిని‌ నమ్ముకొన్నా
పల్లె నీడని బ్రతుకుతున్నా
అనివార్య మైనది నీ వలస యాత్ర

ఎండి పోయిన - చీలి పోయిన
బీడులు వారిన - నిస్సార మైన
పొలాల్ని వదలి - హలాల్ని‌ వదలి
నోరు లేని జీవాల్ని వదలి
అమ్మ నొదలి- అయ్య నొదలి
పల్లె నొదలి- గూడు నొదలి
నగరానికి పాదయాత్ర చేసిన భూమి పుత్రా!
నరక నగర మందు అడ్దాకూలీగా
అవతార మెత్తిన రైతు సోదరా!
పని కోసం - పొట్ట కోసం
ఎదురు జూసి- ఎదురు‌జూసి
సొమ్మగిల్లి- చెమ్మ గిల్లి
జీవన యాత్రను సాగించే రైతు బిడ్డా!
మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండె నోయి
వెతుకు లాటను మాని పల్లె మార్గం పట్టవోయి!!


వారణాశి భానుమూర్తి రావు
హైదరాబాదు
07.01.2019



*10)వారణాశి భానుమూర్తి రావు*

బతుకుశిలువపై గాయపడ్డ దీనజీవులు,భూమిని నమ్మూకొన్నా ఫలితం లేక తనవారిని,ఊరిని,అందరినీ వదిలి వలసెల్లాల్సిన పరిస్తితి వస్తోందంటూ భూమిపుత్రులు జీవితాన ఓడిపోయిన రెక్కలపురుగులంటూ కవితనందించారు

*సమీక్షల ముగింపు*
చాలా ముఖ్యమైన ఆలోచించదగిన అంశం నేటి అంశం....మనకు అన్నంముద్దయ్యే రైతన్నల బతుకులు నేడు హక్కులసాధనకై రోడ్డొక్కడం శోచనీయం...భూమంత సహనమూర్తులకే ఆగ్రహమొస్తే ధరిణీజనులకు ఇక దిక్కేది...అందుకే రైతన్నల శ్రేయస్సుకై అందరూ ఆలోచించాలి..


No comments:

Post a Comment