Saturday, September 15, 2018

సినీ మాయ

సినీ మాయచే
-----------------------------------------
నా కళ్ళల్లో బొమ్మలు రాలిపోతున్నాయి
నా నరాల్లో కొమ్మలు కాలి పోతున్నాయి
గీతానికి సంగీతానికి తేడా తెలియని
విద్వాంసులు కొందరు చప్పట్ల కోసం ఎగబడుతున్నారు
కొన్ని సూర్య కిరణాలు  వెలుగును దిగమింగుకొని
ఇంకో గ్రహాన్ని  వెతుక్కొంటున్నాయి
కొన్ని నక్షత్రాలు మసక బారి  వెలుగుతున్నాయి
కొందరు చరిత్రకారులు పుంఖాను పుంఖానులుగా
వర్త మానాన్ని వక్రీకరిస్తున్నారు
పర పరాగ సంపర్కం కోసం
ఎగబడే తుమ్మెదలు పువ్వుల్ని నమిలేస్తున్నాయి
అక్కడ అభం శుభం తెలియని అహల్యలు రాతి శిల్పాలై
రాముడి కోసం  వెతుకుతున్నారు
బురద లోంచి తామర పూవులు పుడుతున్నా
ముళ్ల కంపల బారిన పడి ముక్కలవుతున్నాయి
కొన్ని సిరా చుక్కలు అక్కడ సారా నిషాలో
తల్లికి చెల్లికి తేడా తెలియని మత్తులో
ద్వంద పదార్థాల్ని వడ్డిస్తున్నారు
బీడు వోయిన చలన చిత్ర సీమలో కొన్ని
అమృత బిందువుల్ని కురిపించాలని ఉంది
అవి పూల వనాల్ని  పెంచి
ఆ కళామ తల్లికి మళ్ళీ పూర్వ ప్రాభవాల
పుష్పాభిషేకం చెయ్యాలి! 



వారణాసి భానుమూర్తి రావు
13.09.2018


No comments:

Post a Comment