Sunday, August 19, 2018

కృతజ్ఞతాభివందనములు


కృతజ్ఞతాభివందనములు

తెలుగు భాష పట్ల మమ కారం , అభిరుచి మెండుగా ఉండడం వలన పదవ తరగతి నుండి పత్రికలు , వాటిలో వచ్చే కవితలు, కథలు చదవడం అలవాటయింది . మనసులోని భావాలు పెల్లుబికి కవిత రూపంలోనో , కథ రూపంలోనో వచ్చేది . '' poetry is the spontaneous overflow of powerful feelings . it takes the origin from emotions recollected in tranquility '' - william words worth గారన్నట్లు బయట కనబడే వస్తు వైవిధ్యం నాలో ఉన్న కవిని ప్రేరేపించే ఉత్ప్రేరకాలు అయ్యేవి . అట్టడుగు ప్రజల జీవన దుర్భరాన్ని చూసి కలత చెందే వాడిని . పిడికెడు మెతుకుల కోసం ఎంగిలి ఆకులు ఏరుకొనే బాధా సర్ప ద్రష్టల జీవన వెతలు నాలో అంతః సంఘర్షణకు దారి తీసేది . దాదాపు 500 కవితలు, 40 దాకా కథలు రాసాను . తొలి కవితా సంపుటి ' సాగర మథనం ' 2000 లో , మలి కవితా సంపుటి ' సముద్ర ఘోష ' 2005 లో ప్రచురించి పాఠక లోకానికి దగ్గరయి, కీ శే డాక్టర్ సినారె ,కీ శే డాక్టర్ అక్కినేని , డాక్టర్ ఎన్ గోపి , , డాక్టర్ ఎం కె రాము , శ్రీ కళా కృష్ణ , శ్రీమతి అత్తలూరి విజయ లక్ష్మి గార్ల ప్రశంసలు పొందినాను . ఇప్పుడు నా మూడవ కవితా సంపుటి ' మట్టి వేదం ' పాఠక మహాశయుల ముందు ఉంచుతున్నాను. ఆశీర్వదించి , ఆదరిస్తారని నా మనవి.
ప్రముఖ కవి , సీనియర్ జర్నలిస్టు శ్రీ  కెరె జగదీష్ గారు నా ఈ కవితా సంకలనానికి తమ చక్కని విశ్లేషణతో ముందు మాట రాసి ఇచ్చినందుకు నా కృతజ్ఞతాభి వందనములు సమర్పించుకొంటున్నాను. ఆయన విశ్లేషణతో ఈ పుస్తకం ఒక్క గొప్ప గుర్తింపు పొందినదని చెప్పక తప్పదు. కెరె జగదీష్ గారు కవి ప్రపంచానికి సుపరిచితులు. ఆయన అంధుల జీవితాల మీద రాసిన దీర్ఘ కావ్యం   ' రాత్రి సూర్యుడు ' అనేక భాషల్లో అనువాదం చెయ్యబడి అనేక మంది ప్రశంసలు అందుకుంది. అలాగే తను రాసిన '  సముద్ర మంత గాయం'  రెండు భాషల్లో అనువదించబడి ఒక గొప్ప జాతీయ కవిగా నిలబెట్టాయి. ఇటివల ప్రచురించిన  ' రాతి నిశ్శబ్దం ' గూడా ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప కవితా సంపుటి .  ముందుమాటతో నా కవితా సంపుటి ' మట్టి వేదం ' ను సుసంపన్నం చేసినందుకు మరో సారి అభివందనాలు తెలుపు కొంటున్నాను.

వాట్సప్ ద్వారా ఎంతోమంది కవులను ప్రోత్సహిస్తూ , నిర్విరామంగా కృషి చేస్తూ , తెలుగు వైభవం ' అనే సంస్థను స్థాపించి , సహస్ర కవి మిత్ర , సహస్ర కవి ప్రపూర్ణ అనే బిరుదల్ని ఇచ్చి , కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ , కవి లోకాన్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్న సాహితీ ప్రియులు శ్రీ మేక రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ నా 'మట్టి వేదం ' ని ప్రచురణకు నోచు కోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను . ఈ సందర్బంగా మేక రవీంద్ర గారికి నా హృదయ పూర్వక అభినందనలు తెలుపు తున్నాను .
నాకు జన్మ నిచ్చిన శ్రీ వారణాసి కృష్ణ మూర్తి రావు గారికి, కీ శే శ్రీమతి వారణాసి స్వర్ణాంబ గారికి నా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను .


ఈ కవితా సంపుటిని వెలుగు లోనికి తెచ్చిన ఎంతోమంది సహృదయలకు , మీడియా మిత్రులకు నా ధన్య వాదములు తెలుపుకొంటున్నాను.
భవదీయుడు
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు


No comments:

Post a Comment