భానుమూర్తి గారి భావ ప్రకంపనలు
''that thinking or speaking about society is also at another level thinking and speaking about life.'' - ruth padel
కవిత్వం అంటే వినోదం కాదు . వేడుక అంతకన్నా కాదు . ప్రాణ భూతమైన ఒక చర్య , సామాజిక బాధ్యత . ఆధునిక కవిత్వానికి నూట ఇరవయ్యేళ్ల చరిత్ర ( 1899 -2018 ) పూర్తి కావస్తున్నది . అనేక సామాజిక ఉద్యమాలకు , భావ జాలాలకు ఈ చరిత్ర కవిత్వరూపంగా నిలుస్తున్నది. తెలుగు కవులు నిర్వహిస్తున్న సామాజిక బాధ్యతకు ఈ చరిత్ర సాక్షి . అలాంటి బాధ్యతాయుత పాత్ర నిర్వహణలో కవులు అత్యంత జాగ్రత్తగా , పరిశీలనా దృక్పథం కలిగి ఉండి , ఎప్పటికప్పుడు స్పందిస్తూ , తన చుట్టూ సమాజం లోని బాధితులు,అభాగ్యులు,దుఃఖిత పీడితుల పక్షాన నిలబడాల్సిన తమ వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాల్సి ఉంటుంది .
కాలంతో పాటు ప్రయాణిస్తారు కొందరు. కొత్త భావాలను సంతరించుకొని , చిగురులెత్తే కొత్త స్వరాలతో , ఆ స్వరాల్లోని సృజనాత్మకత అభినివేశంతో ఉద్దీపులవుతారు . వారు వయస్సుతో నిమిత్తం లేకుండా , స్పందన , ప్రతిస్పందనలతో తమ రచనలను కొన సాగిస్తారు .వారు వ్యక్తీకరించే మాటలను సూటిగా , పదునుగా చెప్పాలన్న ధోరణిని ఎవరైనా స్వాగతించాల్సిందే !. ఈ మధ్య కాలంలో విసురుగా , దుడుకుగా , నిజాన్ని నిక్కచ్చిగా చేప్పే స్వరాలు నేటి సాహిత్య రంగంలో వినిపిస్తున్నాయి. తాము చెప్పాలనుకొన్న పద్ధతిలో అంటే ఘాటుగా చెప్పాలన్న పట్టుదల కొందరి రచనలో స్పష్టంగా కనిపిస్తుంది . అందులో తప్పు లేదనిపిస్తుంది . తమలోని రచనా శక్తిని తాకట్టు పెట్టి లొంగి పొయ్యే వాళ్ళు అప్పుడూ వున్నారు . ఇప్పుడూ వున్నారు . ఎప్పుడూ ఉంటారు .
''కసితో స్వార్థం శిరస్సును గండ్ర గొడ్డలితో నరక గల్గిన వాడే నేటి హీరో'' అన్న శివసాగర్ మాటకి ఇప్పటికి ప్రాసంగికత ఉంది. కులం, మతం, పెట్టుబడి మనుషుల మీద చేసే పెత్తనాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నించిందాల్సిందే అన్న సత్యాన్ని కవులు గమనించి తమ రచనలలో నిగ్గదీసే వాక్యాల్ని కనబరచడమే నిజమైన జీవన చైతన్యానికి దాఖలాగా నిలిచిపోతుంది.
'' there is genuine suffering in the world, the suffering of actual people , and poetry addresses this suffering almost better than anything else. we are not passive but active subjects of both personal and society history. it demands our attention , our intervention. memory is a responsibility'' - edward hirsch.
పట్టభద్రులై వివిధ కార్పొరేట్ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్ బాధ్యతలను నిర్వహించి , వారణాసి భానుమూర్తి రావు గారు , తమ చిన్నతనంలో తల్లి తండ్రులు ఎదుర్కొన్న కష్టాల్ని , కన్నీటి సంఘటనల్ని నేటికీ గుర్తు చేసుకొంటూ , సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి , రచనల పట్ల ఆసక్తి పెంచుకొన్నారు .సమాజంలోని ద్వంద వైఖరి మారాలని , కులమత సంఘాలు కనుమరుగై పోవాలని , అలాగే స్వార్థ రాజకీయాలు కూడా ఉండరాదని గట్టిగా నమ్మిన వ్యక్తిగా తమ ఆలోచనల్ని కవిత్వాలుగా, రచనలుగా మార్చుకొని సాహిత్య రంగంలో ప్రవేశించారు. కవిగా , రచయితగా కవితలు, కథానికలు రాస్తూ గొప్ప సాహిత్య సేవ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ' సాగర మథనం ' తొలి కవితా సంపుటితో సాహిత్య రంగ ప్రవేశం చేసి పలువురి ప్రశంసలు పొందినారు . మలి కవితా సంపుటి ' సముద్ర ఘోష' 2005 లో ప్రచురించి సాహిత్య రంగంలో తమ కంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. ఇదిగో , ఇప్పుడు తమ మూడవ కవిత కవితా సంకలనాన్ని ' మట్టి వేదం ' పేరిట పాఠక లోకానికి పరిచయం చేస్తున్నారు.
ఇందులో దాదాపు 40 కవితలు సామాజిక బాధ్యతతో రాసినవే !
వ్యవసాయ రంగంలో రైతుల కన్నీటి వ్యధల్ని గమనించిన భానుమూర్తి గారు తమ 'మట్టివేదం ' కవితలో
''మడిలో కదం తొక్కుతూ
మట్టిని తొక్కిన పాదం
వరి పంటకు దుక్కి పెడుతూ
బురద పూలు పూచిన పాదం
ఆ మట్టి రైతన్న పాదాలకు
అభివాదం చేస్తూ
రాస్తున్న మట్టి గేయ నాది ''
అంటూ రైతన్నల మీద తనకున్న ప్రేమను , అభిమానాన్ని , గౌరవాన్ని తెలపడం అభినందనీయం . అలాగే
'' నా మట్టి వేదాన్ని అంకిత మివ్వడానికి
సాదా సీదా మనుషుల కోసం నేను వెతకడం లేదు
మట్టినే విభూదిలా పూసుకొనే మట్టి శివుళ్ళను వెతుకుతున్నా
మట్టికోసం తపస్సు చేసే మట్టి మునుల్ని వెతుకుతున్నా
మట్టిని నమ్ముకొని మట్టిలో బంగారాన్ని
పండించే మట్టి రైతన్నల కోసం వెతుకుతున్నా !''
అంటూ కవితను ముగించడం చాలా బాగుంది . అంటే మట్టినే నమ్ముకొని , మట్టి కోసం పరితపించి , ఆ మట్టి లోనే బంగారు పంటల్ని పండించే రైతుల కోసం తానూ గాలిస్తున్నానని చెప్పడంలో రైతాంగం పట్ల ఆయనకున్న ఆసక్తి కనబడుతోంది.
ఎంతటి కవి అయినా తాను బాల్యంలో తిరుగాడిన పల్లె వాతావరణాన్ని , తీపి గుర్తుల్ని , అక్కడి ఆత్మీయతల్ని మరువ లేడు .అలాంటి అనుభవాల్నే భానుమూర్తి గారు ' నా పల్లె ప్రపంచం ' కవితలో తెలుపుతూ
'' గడ్డి పువ్వునై మంచు బిందువుల్ని పలక రించాలని వుంది
గన్నేరు పువ్వునై గాలికి వూగాలని ఉంది ''
అంటూ ఎంతో అందంగా చెపుతూ ఈ కాంక్రీటు నగరాల్లో
'' సాయంత్రం చెట్టు మీద చేరే కాకుల శబ్ధం
ఇళ్లకు చేరే పశువులు చేసే కోలాహలం
గోవులు రేపే గోధూళి వాసన ఇక ఎవరిస్తారు ? ''
అని వాపోతారు. అంతటి అందమైన పల్లె ప్రపంచానికి దూరమై నగరాల్లో మర మనుషులుగా బతుకుతున్న మానవ జీవితాన్ని ప్రతిబింబించే అంశాలతో ఈ కవిత చక్కగా సాగింది.
నేటి వ్యవస్థలో పెచ్చి పెరిగి పోయిన హింస , దిక్కు తెలియని కుటుంబ వ్యవస్థ , అనాధల , అభాగ్యుల కన్నీటి కథలకు అద్ధం పెట్టే కవితగా ' విషం కురిసిన రాత్రి ' ముగింపులో
'' అస్తవ్యస్తమైన వ్యవస్థ బాగుపడే వరకు
ప్రతి రాత్రి విషం కురుస్తూనే ఉంటుంది ''
అని తన అసహాయతను , ఆవేదనను వ్యక్తం చేశారు .
' నాన్న' అనే కవితలో
'' నాన్నల త్యాగాలు వృధా కావు
చిన్న మొక్కలై , వృక్షాలై ఫలాల్ని అందిస్తాయి '' అనడం చాలా బాగుంది.
కన్న పేగు బంధం దూరమై , ఆ తల్లి తండ్రులు అనుభవించే వ్యధా భరిత కథల్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాము. వృద్ధులైన తల్లి తండ్రులు కన్న బిడ్డల కోసం అహర్నిశలు కలవరించడం లాంటి దృశ్యాలు మన సమాజంలో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటనకు సంబంధించి బిడ్డకు దూరమైన ఒక కన్నతల్లి పడే ఆవేదనని ' బిడ్డా నిన్ను సూసి ' అనే కవితలో
'' ఎక్కడున్నా నీవు - సల్లగుంటే సాలు
కొలువు లోన నువ్వు - మంచి గుంటే మే
లు
ఒక్క సారి వచ్చి - పలకరించు కొడుకో
బిడ్డా నిన్ను సూసి - పాన మొదులు తాను ''
అనడంతో కళ్ళు చెమరిస్తాయి . వాస్తవాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి .
తల్లిని స్మరించకుండా ఏ కవీ తన కవితా సంపుటిని పూర్తి చేయలేడన్నది నగ్న సత్యం . ప్రతి కవీ తన తల్లితో అనురాగ అనుబంధాల్ని , ప్రేమ బంధాల్ని దూరం చేసుకొని ఉండలేడు . అలాంటి పరిస్థితుల్లోనే కవిగారు తన ' అమ్మా నన్ను క్షమిస్తావా ? అనే కవితలో
'' నా కోసం ఉపవాసాలు చేశావు
నా కోసం జాగరణలు చేశావు
గానీ నీకోసం మేము ఏమీ చేయలేదని చింతిస్తున్నా ! ''
అంటూ
''ఇంకొక జన్మ అంటూ ఉంటే
నువ్వు నా కూతురిగా పుట్టు తల్లీ
నీ ఋణం నేను తీర్చుకొంటానమ్మా !''
అని చెప్పడం ఎంతో హృద్యంగా ఉంది .
'' రండి మేధావుల్లారా
అందరం కలిసి కొత్త దేశాన్ని నిర్మిద్దాం
మట్టి వాసన మనుషుల్లో నింపడానికి ''
అంటూ ' మేధావుల్లారా ' అనే కవితలో పిలుపు నివ్వడం బాగుంది .
ఈ కవితలో అస్తవ్యస్తమైన దేశ పరిస్థితుల్ని కవిత్వికరించడం సుగమంగా సాగింది . బ్రష్టు పట్టిపోతున్న దేశంలో కుళ్ళన వ్యవస్థను మార్చలేమని వ్యధ చెందడంలో భానుమూర్తి గారు సఫలీకృతులయ్యారు. అలాగే 'మిత్రమా ' , నేను రోజూ ఏడుస్తున్నాను ' , ' పోనీ పొతే పోనీ ' , ' అసలు నువ్వెవరు ' , ' మా గుడిసె ' , ' పుష్పించిన మనిషి ' లాంటి కవితలు ఆకట్టు కొంటాయి.
సమాజాన్ని నిశితంగా పరిశీలించిన భానుమూర్తి గారు , సమాజం లోని పలు అంశాలను కవితా వస్తువులుగా తీసుకొని కవిత్వికరించడానికి తన శాయశక్తులా కృషి చేశారు.
ఒక కవి సాధన క్రమంలో వస్తువు - లోలోతుల్లోకి పోయి అంతర్గత నివృత్తిలో నీటి పిట్టలా పైకి తేలుతాడు . కవి అనుభవించిన దంతా మనం అనుభవించలేక పోవచ్చు . కానీ మనదయిన నిర్మాణం జరగ డానికి , ఆ కవి - ఆ కవిత ఉపయోగ పడతాయి . ఒక వస్తువు మీద కవిత ఎత్తుకంటే ఆ వస్తువు విశ్లేషణ ఒక conclusion కి drive చేసే దిశగా సాగుతుంది .
సమాజం పట్ల , కవిత్వం పట్ల ఏంతో ఆసక్తి , శ్రద్ధ కనబరుస్తున్న భానుమూర్తి గారు జీవితానికున్న అన్ని కోణాలను అధ్యయనం చెయ్యడంలో మరింత ముందడుగు వేస్తూ , కవితా నిర్మాణంలోని మెళుకువలను , ఎత్తుగడలను , శిల్పం , అభివ్యక్తి లాంటి విషయాల పట్ల సంపూర్ణమైన పరిశీలనలను చేస్తూ మరిన్ని ఉత్తమ కవితలతో ఈ సాహిత్య రంగంలో ముందడుగు వేస్తారని ఆశిస్తూ , అద్భుతమైన ' మట్టి వేదం ' శీర్షికతో వెలుగు లోకి తెచ్చిన భానుమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపు తున్నాను.
తేదీ : 15 .06 . 2018
కెరె జగదీష్
కవి , సీనియర్ జర్నలిస్టు
రాయదుర్గం
అనంతపురం జిల్లా , ఆ .ప్ర
No comments:
Post a Comment