పునరపి జననం
~~~~~ ~~~~~~~~~~
ఇక మనం అణు బాంబులా విచ్చన్నమై పోవాల్సిందే!
ఇక మనం సునామీలా విరుచుకు పడాల్సిందే!
సింహంలా జూలు విదిల్చి పులిలా గాండ్రించాల్సిందే!
కొవ్వెక్కిన మృగాళ్ళ అరాచకాలకు బలి అయిన అబలలు
రాక్షస సంహారం చెయ్యాల్సిందే!
అభం శుభం తెలియని పసి పిల్లల్ని
చిదిమేస్తున్న నర హంతకుల భరతం పట్టాల్సిందే!
నవ మాసాలు మోసి పెంచిన తల్లిని
క్రిందకు తోసిన కిరాతకుడి చేతులు కాళ్ళు తెగ్గొట్టాల్సిందే!
ఆఫీసుల్లో అమ్మాయిల్ని కామ కేళీ వస్తువులుగా వాడుకొంటున్న
మర్యాద మదన కామ రాజుల్ని ఇరగ దీయాల్సిందే!
మత మార్పిడికి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న
మత పిశాచులకు సిలువ వెయ్యాల్సిందే!
వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తూ వావి వరుసలు మరచి
చెలరేగే గార్దభాల్ని నట్టేట ముంచాల్సిందే!
ప్రజ్వరిల్లిన ప్రచండ భయంకర అక్షరాలు కత్తులై
చుర కత్తులై నరాధముల కుత్తుకలు కత్తరించాల్సిందే!
ఎదురేగుతున్నాను నేను సముద్రాల దిగంతాలకు
ఎగజిమ్ముతున్న లావాల పర్వతాల శిఖరాలకు
నన్ను నేను ఆహుతి చేసుకొని బూడిదగా తిరిగి
ఈ మట్టిలో మళ్ళీ వాలుతాను
అప్పుడయినా ప్రక్షాళన చేసుకొన్న సమాజాన్ని చూడడానికి ఒక చెట్టుగా పుడతాను.
వారణాసి భానుమూర్తి
06.01.2018
No comments:
Post a Comment