Saturday, September 30, 2017

అహో ! శ్రీ కృష్ణ దేవరాయా !!

అహో  !  శ్రీ  కృష్ణ  దేవరాయా !!
-----------------------------------------------



అహో !  శ్రీ  కృష్ణ  దేవరాయా !!
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా !
ఉత్తంగ  తరంగ  తేజో ప్రతాపా !
సురుచిర మధుర  దరహాసా ! రాజా నరసింహా !!
ఏమని  చెప్పను ? ఎలా చెప్పను ?  ఏమని పొగడుదును ?
సాహితి  సమరాంగ  సార్వ భౌమా !
కవి పోషకా  !  భువన విజయ  అభయ  ప్రదాతా !!
ఆముక్త  మాల్యద  విరచిత కవి రాజమా !
తుళువ  సరస నాయకా నాగులాంబల  వంశోద్ధారకా !
ఆంధ్ర  దేశాన  అవతరించిన  అవతార పురుషా !
తెలుగు జాతికి దొరికిన జాతి రత్నమా !
అష్ట దిగ్గజముల కవి పితామహ పెద్ద నామాత్యుని
గద్దెనెక్కించిన  సార్వోచిష  మను  సంభవా !
గండ పెండేరము తొడిగి
కవిత్వానికి  కనకాభిషేకం చేసిన  ప్రబంధ నాయకా !
పంచ కావ్యాల  పరబ్రహ్మవై - సాహిత్య  పోషకుడివై
'దేశ భాష లందు తెలుగు లెస్స '  అని నుడివిన తెలుగు తేజమా !
తిమ్మరుసు మంత్ర యుక్తి - కృష్ణ  రాయల ధీయుక్తి
తుళువ  రాజా వంశ  కీర్తి - జగమున తిరుగులేని  విజయ నగర సామ్రాజ్య శక్తి
దక్షిణ  దేశ  యాత్ర  - తూర్పు  దేశ  దిగ్విజయ యాత్ర
బీజాపూరు సుల్తాను  నీకు సలాము - కళింగ  గజపతి నీకు వశము
ఉదయ గిరి నీకు వశము - కొండ వీడు  శరణు  శరణు
తమిళ దేశము తల్లడిల్లినది - శత్రు రాజులు  సామంతు లైరి
విజయ నగర సామ్రాజ్య  పతాకను రెప రెప లాడించినవి
కర్ణాటక హంపి శిధిలాలు గావు
అవి నీ  భాసురానికి  సజీవ  చిత్రాలు
ప్రతి తెలుగు  వాడి గుండెల్లో వెలుగు తున్న సజీవ దీపాలు
నీ  స్వర్ణ యుగమున  మేము పుట్టలేదని  వగచి నాము '
కానీ - నీవు అందించిన శౌర్యమే  మాకు శిరోధార్యము
నీవు జగతికిచ్చిన సాహిత్య సౌరభాలే  మా నవ జీవన జ్ఞాపికలు
సదా మా ఎదలో నిలచిన  అమర జీవీ - కృష్ణ దేవ రాయా !
మా  కవితాభినందనం  అందు కోవయ్యా  సకల కళా ప్రియా !

రచన : సహస్ర  కవి మిత్ర  వారణాసి భాను మూర్తి  రావు
99890 73105
హైదరాబాదు



హామీ పత్రము
ఈ  కవిత  నా స్వంత మనియు , దేనికిని  కాపీ  గాదనియు , అనుకరణము కాదనియు , సరస్వతి దేవి కృప వల్లనే  ఈ  రోజు  రాయ గలిగాననియు , ఇది ఇంత వరకు  ఎక్కడికి పరిశీలనకు , పోటీకి పంబ లేదనియు మీకు  ఇందు మూలముగా తెలియ చేయు చున్నాను .



No comments:

Post a Comment