Saturday, September 30, 2017

అమరావతి

అమరావతి 
---------------------------------------------------
అమరావతి ధాన్య   కటక మట ఒక నాడు
పరి పాలించిరి  తెలుగు రాజులు  ఆనాడు
శాతకర్ణి  శాలివాహన  యుగ కర్త  ఆనాడు
చంద్ర బాబు  నవ్య అమరావతి సృష్టికర్త  ఈనాడు

బుద్ధుడు  తిరుగాడిన శాంతి  తపోవనం అమరావతి
అమర లింగేశ్వరుడు  అమృత మూర్తియై  వెలసిన  అమరావతి
స్వర్గం లో  ఇంద్రుడి  రాజధాని  అమరావతి
భూతలంలో ఆంధ్రుల  స్వప్న సాకారం  ఈ  అమరావతి

ఆకాశ  జల పాతాలు  - జీవ నదుల అనుసంధానాలు
పచ్చిక  బయళ్లు - హరిత వనాలు - ఉద్యాన వనాలు
అనుకొంటే  మనిషి  సాధించ లేనిది  ఏముంది ?
వెను వెంటే నాయకుడుంటే  తిరుగు లేనిది ఏముంది ?

రాజధాని  లేని  రాష్ట్ర మిచ్చినారని బెంబేలెత్తిన  ఆంధ్రులకు
ముక్కోటి  దేవతలు అండగా  నిలిచారు  అమరావతిలో
ఎనిమిదవ వింతగా  నిలుస్తున్న  అమరావతికి
ప్రపంచ దేశాలు  నీరాజనం  పట్టే  రోజు  వస్తుంది !

ఆకాశ హర్మ్యాలు - పచ్చని  భవనాలు - స్వర్ణ తోరణాలు
అద్దంలా  మెరిసి  పొయ్యే తారు  రోడ్లు - జల తారు  కూడళ్లు
ప్రపంచమా  ఆగు - సంధి  కాలం దాటి పోనీ !
అమరావతి  నీకు ఆహ్వానం పంపిస్తుంది !

ప్రపంచ పెట్టుబడుల స్వర్గ ధామం
బడుగు జీవితాల్లో  వెలుగులు  చిందే  వైకుంఠ    ధామం
ఐదు  కోట్ల  ఆంధ్రుల  ఆశా దీపం  అమరావతి !
భరతా వనికే  మణి  మకుట  మహోజ్వల రత్న హారం  అమరావతి !!



రచన:  వారణాసి  భానుమూర్తి రావు
హైదరాబాదు
99890 73105


అహో ! శ్రీ కృష్ణ దేవరాయా !!

అహో  !  శ్రీ  కృష్ణ  దేవరాయా !!
-----------------------------------------------



అహో !  శ్రీ  కృష్ణ  దేవరాయా !!
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా !
ఉత్తంగ  తరంగ  తేజో ప్రతాపా !
సురుచిర మధుర  దరహాసా ! రాజా నరసింహా !!
ఏమని  చెప్పను ? ఎలా చెప్పను ?  ఏమని పొగడుదును ?
సాహితి  సమరాంగ  సార్వ భౌమా !
కవి పోషకా  !  భువన విజయ  అభయ  ప్రదాతా !!
ఆముక్త  మాల్యద  విరచిత కవి రాజమా !
తుళువ  సరస నాయకా నాగులాంబల  వంశోద్ధారకా !
ఆంధ్ర  దేశాన  అవతరించిన  అవతార పురుషా !
తెలుగు జాతికి దొరికిన జాతి రత్నమా !
అష్ట దిగ్గజముల కవి పితామహ పెద్ద నామాత్యుని
గద్దెనెక్కించిన  సార్వోచిష  మను  సంభవా !
గండ పెండేరము తొడిగి
కవిత్వానికి  కనకాభిషేకం చేసిన  ప్రబంధ నాయకా !
పంచ కావ్యాల  పరబ్రహ్మవై - సాహిత్య  పోషకుడివై
'దేశ భాష లందు తెలుగు లెస్స '  అని నుడివిన తెలుగు తేజమా !
తిమ్మరుసు మంత్ర యుక్తి - కృష్ణ  రాయల ధీయుక్తి
తుళువ  రాజా వంశ  కీర్తి - జగమున తిరుగులేని  విజయ నగర సామ్రాజ్య శక్తి
దక్షిణ  దేశ  యాత్ర  - తూర్పు  దేశ  దిగ్విజయ యాత్ర
బీజాపూరు సుల్తాను  నీకు సలాము - కళింగ  గజపతి నీకు వశము
ఉదయ గిరి నీకు వశము - కొండ వీడు  శరణు  శరణు
తమిళ దేశము తల్లడిల్లినది - శత్రు రాజులు  సామంతు లైరి
విజయ నగర సామ్రాజ్య  పతాకను రెప రెప లాడించినవి
కర్ణాటక హంపి శిధిలాలు గావు
అవి నీ  భాసురానికి  సజీవ  చిత్రాలు
ప్రతి తెలుగు  వాడి గుండెల్లో వెలుగు తున్న సజీవ దీపాలు
నీ  స్వర్ణ యుగమున  మేము పుట్టలేదని  వగచి నాము '
కానీ - నీవు అందించిన శౌర్యమే  మాకు శిరోధార్యము
నీవు జగతికిచ్చిన సాహిత్య సౌరభాలే  మా నవ జీవన జ్ఞాపికలు
సదా మా ఎదలో నిలచిన  అమర జీవీ - కృష్ణ దేవ రాయా !
మా  కవితాభినందనం  అందు కోవయ్యా  సకల కళా ప్రియా !

రచన : సహస్ర  కవి మిత్ర  వారణాసి భాను మూర్తి  రావు
99890 73105
హైదరాబాదు



హామీ పత్రము
ఈ  కవిత  నా స్వంత మనియు , దేనికిని  కాపీ  గాదనియు , అనుకరణము కాదనియు , సరస్వతి దేవి కృప వల్లనే  ఈ  రోజు  రాయ గలిగాననియు , ఇది ఇంత వరకు  ఎక్కడికి పరిశీలనకు , పోటీకి పంబ లేదనియు మీకు  ఇందు మూలముగా తెలియ చేయు చున్నాను .



Sunday, September 17, 2017

తెలుగు ప్రాభవం

తెలుగు ప్రాభవం
-------------------------------------------------------------------
రచన : వారణాసి భానుమూర్తి రావు
-------------------------------------------------------------------

తెలుగు భాష  మాట్లాడితే  తక్కువేమీ  గాదు
అరువు తెచ్చుకొన్న  ఆంగ్ల  భాష  దమ్మిడీకి కొరగాదు
అమ్మ లాంటి తెలుగు భాష అందరికీ  జీవ భాష
కమ్మ నైన లాలి పాట  తెలుగు వారి జోల పాట


నన్నయ్య తిక్కన ఎర్రాప్రగ్గడల తెలుగు భారతం
కుమ్మరి మొల్ల  తెనిగించిన మొల్ల రామాయణం
త్యాగరాజు  పాడిన అచ్చ మైన  తెలుగు కృతులు
అన్నమయ్య అలరించిన  అందమైన పదాలు


అభినవ వ్యాసుడు పోతన పలికించిన  భాగవతము
అష్ట కవుల భువన విజయము తెలుగు తల్లి జయము
కృష్ణ రాయల 'ఆముక్త మాల్యద 'అమ్మ మెడలో మణి  హారము
తిరుపతి వెంకట కవుల తెలుగు పద్యము అజరామరము


చిలక మర్తి గురుజాడ రాయప్రోలు కందుకూరి
నా తెలుగు తల్లి సిగలో విరిసిన మల్లెలు మకరందాలు
'మా తెలుగు తల్లికి మల్లె పూదండ ' అనిన శంకరంబాడి
పదికోట్ల తెలుగు వారు పాడుతున్న  ప్రణవ గీత మది


శ్రీ శ్రీ పలికించిన అభ్యుదయ గీతము  'మహా ప్రస్థానము '
సినారె  కలాన ఎగరేసిన 'విశ్వంభర'  విజయ కేతనము
పాటల బ్రహ్మ వేటూరి తెలుగు వారి 'శంకరా భరణము '
'సిరివెన్నెల' పూయించిన తెలుగు పాటల నందన వనము


జయము జయము తెలుగు తల్లి జయమమ్మా  నీకు
అమ్మ భాష మన  తెలుగు భాష  మరచి పోకు
తెలుగు జాతి పాడుతున్న తెలుగు పాట వినుము
'దేశ  భాష లందు తెలుగు లెస్స '  అని  గొంతెత్తి పాడుము .

-----------------------------------------------------------------------------

ఈ  పై నా గేయం /కవిత ' తెలుగు ప్రాభవం ' నా స్వంత మనియు , ఎక్కడ అనుసరణీయము గాదనియు , ఇది ఇంతవరకు ప్రచురణకు నోచు కోలేదనియు , ఏ  పత్రికకు పంపలేదనియు ,
ఈ  నా కవిత/గేయం  మీద పూర్తి  హక్కులు నావే ననియు ఇందు మూలముగా మీకు తెలుపు తున్నాను .

వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
99890 73105
--------------------------------------------------------------------------------------

Sunday, September 10, 2017

సూర్య గ్రహణం

సూర్య గ్రహణం
రచన: భానుమూర్తి వారణాశి
------------------++-------------------------------
సూర్యుడు పొద్దున్నే సిగరెట్ కాల్చాడేమో
ఎక్కడ చూసినా పొగ మంచు

నా బాల్కొనీలో కూర్చొని
ఉదయాన్ని వార్తల్ని కాఫీని
జుగల్ బందీ చేయిస్తున్నాను

అక్షరానికి అక్షరానికి మధ్య యుద్ధం
అవి చావవులే .... ఎందుకంటే
మన మంతా చదువుకొన్న నిరక్ష రాస్యులం గదా!

పత్రికల్లో వార్తలన్నీ  నిజాలు గావని
అవి కొందరి ఇజాలని
తెలిసాక కాఫీ చేదుగా ఉంది
యెల్లొ జర్నలిజం
వండిన కషాయంలా

నేను పత్రిక  సమూహాల్ని
తప్పులు పట్టడం లేదు

అవినీతి సొమ్ములు పత్రికల పైరుకు
ఎరువు ఎలా అయిందని?

వితండ వాదాలు
సంపాదకీయాలుగా
ఎప్పుడు ఎలా మారిందని?

నిజాన్ని నానా విధాలుగా
ముప్పు తెప్పలు
ఎలా పెట్టగలరా అని?

పత్రిక మూలుగు తోంది
నాలుగో పిల్లర్ విరిగి పోయిందని

ఒక్క దోసెడు నిజం ఎక్కడయినా
దొరుకుతుందేమోనని
పత్రికను మళ్ళి తిరగ దోడుతున్నా !
------------------++++++----------------------------