Monday, September 26, 2016

పోనీ పోతే పోనీ !

పోనీ పోతే పోనీ !
----------------------------

తడి  ఆరని  గొంతులు
కన్నీటి సము ద్రాలయిన లోగిళ్ళు
నీళ్ల సమాధులయిన గుంతలు
మనిషి మనుగడ  ప్రశ్నార్థకం
నగరం సాగర మయిన రోజు

జవాబు దారితనం లేని
అధికారుల గుండెల్లో రైళ్లు
జవాబు లేని ప్రశ్నలు
ప్రశ్నించ లేని  ప్రజలు

మాయమై  పోయిన చెరువులమ్మల సాక్షిగా
నీటి తల్లికి ఏమి తెలుసు
తాను ఎక్కడ ప్రవహిస్తోందని ?

నీరు పల్ల  మెరుగు
నిజం దేవుడెరుగు

నాకిక్కడ ఒక నిజం తేలుతోంది
అధికారులు,  కబ్జా రాకాసుల  వేసుకొన్న పందెం లో
అమాయకులు  బలి  అవుతున్నారని...

 చెరువులమ్మలు గట్లను తెంపుకొని
కొల్లేరు లయిన  బజార్లు , బళ్ళు  , ఇళ్ళు

మృత్యు  కుహరాల్లాంటి  మాన్ హోళ్ళు
మరణ శాసనాలు రాస్తుంటే
మన స్మార్ట్ సిటీ  జీవితాలు నరక కూపాలు

ఏమున్నది చెప్పడానికి  గర్వ కారణం ?
ఏ ప్రభుత్వ మొచ్చినా   కనబడని  అభివృద్ధి  తోరణం

కాగితాల్లో  ప్రణాళికలు  కాగితం పడవలై
ఏ  తీరానికి  సగటు మనిషిని  తీసుకు  వెడతాయో ?

నిన్న వేసిన  రోడ్లు  కాంట్రాక్టర్ల  మోసానికి బలి  అయిన అబలలు
మొన్న కట్టిన ప్రాజెక్టులు ఇసుక తేలిన శిధిల  కళేబరాలు

ప్రజల నెత్తిన పెడుతున్న శఠగోపాలు
ప్రజా బ్రతుకుల్ని  లోపలికి లాక్కొనే  రక్త బిల్వాలు

''పోనీ పొతే పోనీ .... రానీ  రాక  పోనీ
చావనీ  జనాల్ ... చేరనీ నరకాల్ '' -
అని అనుకోవడం లేదు  నేను ...

రేపటి ఉదయం ఒక
అభ్యుదయ  గీతమై  మనల్ని  మురిపిస్తుందేమో !

కాగడాలు వెలిగించి  రండి
ఆ ఉదయం కోసం   వెతుకు దాం  !











No comments:

Post a Comment