Saturday, September 24, 2016

వానమ్మా .... ఇక రావమ్మా !!

వానమ్మా .... ఇక రావమ్మా !!
--------------------------------

కురుస్తున్న వానమ్మను వద్దనడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?
ఆకాశం  చిల్లులు పడేలా కుంభ వృష్టి  ఆపడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?

కట్టుకొన్న ఆకాశ  హర్మ్యాలు కూలి పోతున్నాయనా  నీ  బాధ ?
చెరువులు   మాయం చేసి  కట్టుకొన్న ఇళ్ళు  కూలి పోతున్నాయనా  నీ  ఆక్రోశం?
కబ్జా గాళ్ళ  కబంధ హస్తాల్లో   చిక్కుకొన్న  నేలతల్లి  కష్టాలు  తీరినాయనా నీ కోపం  ?
 దొంగ  దారిన  చేసుకొంటున్న  అవినీతి సొమ్ము రాదనా  నీ  బాధ?

మాయ మాటలు చెప్పి భూబకాసురులు
పచ్చని భూముల్ని లాక్కొని
 రైతన్న కడుపులో  మట్టి గొట్టి
బంగారు భూముల్ని  మసి చేసి  నుసి చేసి
కాంక్రీట్  జంగల్ని  ప్లాట్లు  చేసి
నేలమ్మ కడుపులో నిప్పులు బోసి
నాలాలు ,  కాల్వలు , చెరువులు , నదులు కబ్జాలు చేసి
ఒక పదును  వానకే  వాగులై వంకలై
నగరాన్ని  సముద్రంలో  ముంచి
సామాన్యుడి  జీవితాల్ని అతలా కుతలం చేసి
వానమ్మా  .... నువ్వు మాకు వద్దమ్మా....
వానమ్మా .... ఇక రాకమ్మా  అంటూ
దొంగ దండాలు  పెడితే పనికి రాదన్నా
నగరాలు  నిలువునా మునిగి పొయ్యే రోజు దగ్గరి  లోనే ఉంది
పంటలు పండే భూములు లేక ప్లాస్టిక్  బియ్యం తినే  రోజు  వస్తోంది
అన్నా ... రైతన్న ల ఉరిత్రాడులు  లెక్క బెట్టండి
నేల  తల్లి  శాపాలు   మనసు పెట్టి వినండి
చెరువు తల్లుల  ఏడ్పుల శోక గీతాల్ని  వినండి
నగరం  నడి బొడ్డున  హుస్సేన్  సాగర్  విష నురగలు కక్కుతోంది
ఇళ్లన్నీ  బురద కొంపలై  కంపు గొడుతున్నాయి
అపార్టుమెంట్లన్నీ  సెల్లార్  కొల్లేరులై  తేలి పోతున్నాయి
ఇక నైనా  కళ్ళు తెరవండి
చెర్వు గట్ల మీద ఇళ్ళు కట్టకండి
నాలాల్ని , కాల్వల్ని, ఏటి  గట్లను   వదలండి!!


(పది రోజులుగా ఎడతెగని కుంభ వృష్టి తో మన నగర జీవితం అతలా  కుతలమైన వేళ  రాసిన కవిత.  ఇదీ  మన నగర జీవన  వ్యధ  కథా  గీతం !!)



No comments:

Post a Comment