Wednesday, September 28, 2016

కవిత్వం రాయడం అవసరమా ??


కవిత్వం రాయడం అవసరమా ??
---------------------------------------------

ఆకలి దప్పులు  మరచి  , ఆలు  బిడ్డలని  అరచి 
బంధు మిత్రులని వదలి , తల్లి దండ్రులను  మరచి 
ఏకాకినై  , నాలుగు గోడల మధ్య రాసితి  పలు  కావ్యముల్ ....  అన్నా డట  ఒక  కవి.

 కవి జీవితమే  ఒక ప్రవాహం లాంటిది. భావ ప్రవాహం లో కొట్టుకు మిట్టాడుతూ బాహ్య ప్రపంచాన్ని మరచి పోతాడు. తన అంతర్గత లోకంలో విహరిస్తూ ఒక ట్రాన్స్  లోకి వెళ్లి కవిత్వాన్ని రాస్తాడు.   పూర్వ కవులు  ఆనాడు ఎన్నో ప్రభందాలు , కావ్యాలు  రాసి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత గూడా మనల్ని అలరిస్తున్నాయి . ఆనాడు  రాజ పోషకులు , కళా రాధకులు ఉండే వారు. అలనాడు సామాన్య మానవులు  గూడా  ఎంతో కొంత ఆశు కవిత్వాన్ని  చెప్ప గలిగే  వారు. కవిత్రయం రాసిన  మహా భారతం  మన జాతిని ఎంత ప్రభావితం చేసింది అంటే భారతం చదవని వాడు , వినని వాడు  ఒక  చవట క్రింద లెక్కే అన్నట్లు ఉండేది. తిరుపతి వెంకట కవులు  రాసిన భారత పద్యాలు  ఈ నాటికి  పామరులు గూడా పాడుకొనే విధంగా  అలరించాయి. 

మరి ఈ  నాటి కవులు రాసిన  కవిత్వం ఎంత వరకు సజీవంగా ఉండగలదు అనేది ప్రశ్న ? నిన్న రాసిన కవిత ఈ  రోజు గుర్తు ఉండడం లేదు . మనం కవిత్వం పట్ల  చూపిస్తున్న  ఉదాసీనత  కారణమా ? ఈ నాడు  పుట్ట గొడుగుల్లా  కవులు ఉద్భవిస్తున్నారు. పండితుడు కానక్కరలేదు కవిత్వం రాయడానికి ఇప్పుడు . పామరులయినా  గీతాల్ని, కవిత్వాన్ని  అలవోకగా  చెబుతున్నారు, రాస్తున్నారు . 

రాసిన కవిత్వాలు  వేలాది రూపాయలు  పోసి  సంపుటిలుగా  ప్రచురిస్తే   పుస్తకాలు కొనే వాళ్ళే కరువయ్యారు.  ప్రతి కవిఇంట్లో అమ్ముడు కాని  పదార్థం పుస్తకాల రూపంలో  అటకల మీద కవిని వెక్కిరిస్తూనే ఉంటుంది . ప్రతి కవి హృదయ గవాక్షంలో తొంగి చూస్తే , కవి ఆవేదన అర్థ మవుతుంది . కవి గాని వాడు కవిత్వాన్ని ఏమర్థం చేసు కొంటాడు ? ప్రతి మనిషికి  కొంచెం కవిత్వపువాసనలు ఉంటేనే గానీ  కవులు రాసిన కవిత్వాన్ని  చదవ గలుగు తారు  .
పాశ్చాత్త్య దేశాలలో  కవిత్వానికి చాలా ఆదరణ  ఉంది. ప్రతి సామాన్య మానవుడి చేతిలో ఎదో పుస్తకం ఉంటుంది. వాళ్ళు తీరిక వేళల్లో పుస్తకాల్ని  బాగా చదువు తారు. అందుకే అక్కడి కవులు  రాసిన పుస్తకాలకు  మిలియన్ల  డాలర్ల  కొద్దీ  రాయల్టీ  వస్తుంది . అక్కడ సాహిత్యం గూడా  బాగా చదివే  వాళ్ళు ఉన్నారు. 

మన దగ్గర టీవీ లాంటి మాధ్యమాలు వచ్చిన తరువాత చదివే  నాథుడే లేడు . పెద్ద పెద్ద కవులు గూడా  స్వంత డబ్బా వాయించుకొని  మార్కెటింగ్ చేసుకొన్నా పుస్తకాలు అమ్ముడు పోవడంలేదు.  చెదలు పట్టి  గిడ్డంగుల్లో  అమ్ముడు కాని  పుస్తకాల్ని  ఏమి చెయ్యాలో  తెలియక తలలు పట్టుకొని కూర్చొన్న  పబ్లిషర్స్ ఉన్నారు . 

మహా భాగవతాన్ని  తెనిగించిన బమ్మెర పోతన  గారు అన్నట్లు  నరాధములకు నా కావ్య కన్నియను ఇవ్వను గాక ఇవ్వను అన్నాడు . 

కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

అలాంటి  కవులు  మనకు ఇప్పుడు గూడా ఉన్నారు. వాళ్ళ పని రాయడమే ! అలాంటి కవులకు నా జోహార్లు !

ఏమయినా   కవిత్వాన్ని   మళ్లి  సజీవంగా  పునరుద్ధించేందుకు కొన్ని కళా పీఠాలు , కల్చరల్ అసోసియేషన్స్ , ప్రభుత్వాలు కలిసి పని చేస్తే కవిత్వాన్ని , కవుల్ని  మనం కాపాడు కోవచ్చు . కవికి అవార్డు లతో పాటు  రివార్డ్ లు గూడా ముఖ్యమే గదా ! ఒక ప్రొఫెషన్  గా  తీసుకొన్న ఒక వ్యక్తి  కవి గా నిల దోక్కుగోగలడా అనేది ప్రశ్న ?  లేదనే , లేదనే సమాధానం వస్తుంది.  అందుకే  ఈ  సమాజంలో కవులు  నిత్య దరిద్రంతో  బాధ పడుతున్నారు . ఇప్పటి కయినా  మంచి కవులను ప్రోత్సహించడం మంచిది.


         భానుమూర్తి  వారణాశి 






No comments:

Post a Comment