Sunday, May 15, 2016

కొనకంచి గారి తో కొన్ని క్షణాలు

కొనకంచి  గారి తో  కొన్ని  క్షణాలు
----------------------------

''గుడ్  మార్నింగ్  సర్ ''

ప్రొద్దున్నే  మా ఇంటి దగ్గరే ఉన్న పార్కులో  వాకింగ్  చేస్తున్నపుడు , ఒక  సన్నని  స్వరం  పలకరించింది . ఆశ్చర్యంగా  ఆ వ్యక్తీ వైపు చూశాను  . మృదువైన  కంఠం , కళ్ళల్లో  ప్రస్పుట మవుతున్న వెలుగు , సాదా సీదా  గా  కన బడుతున్న విగ్రహం , తెల్లని  గుబురు గడ్డం   , సంస్కారం  ఉట్టిపడుతున్న  ఆయన  బాడీ లాంగ్వేజ్  కన బడు తున్నాయి . నాకు అతనిలో  ఒక రవీంద్ర  నాథ్  టాగోర్  ని  చూసి నట్లుంది

''మీరు ... మీరు... ''

ఒకే ఒక్కసారి  కలిసి నట్లు గుర్తు .  కవి సంగమం లో కలిసి నట్లు  లీలగా  జ్ఞప్తికి  వచ్చింది .

''నేను  కొనకంచి ని అండీ ''

నా ఆనందానికి అవధులు లేవు .

''గ్లాడ్  టు  మీట్  యు  సర్ . నేను  భాను మూర్తి  ని ''

పరిచయాలు  అయ్యాక , అయన  తన కవితా  ప్రస్థానం  వైపుకు వెళ్ళింది  చర్చ . ఆయనకు  ఉన్న   జ్ఞానానికి , కవిత్వం పట్ల  ఉన్న  ఆయనకు  ఉన్న మక్కువ , ధ్యాస,  commitment , dedication  అన్ని  నాకు  కొన్ని  క్షణాల్లో   నే  అర్థం  అయ్యింది .

''నేనేమీ   మాట్లాడను ''అంటూనే  అనంత మైన  ఎన్నో తెలియని విషయాలను  అతని మాటల్లో  తెలుస్తుంది  మనకు. అయనకు  ఒక  సబ్జెక్టు మీద  వున్న నిర్దిష్ట మయిన , కచ్చిత మైన అబిప్రాయం  , ముక్కు సూటిగా  పొయ్యే  మనస్తత్వం  ఉండడం  వల్ల నిజంగా అతన్ని ఒక  విశిష్ట మైన వ్యక్తీ  గా నిలబెడతాయి .

' రెక్కల పులి '  తన  కవితా ప్రస్థానం లో  ఒక  మైలు  రాయి  వంటిది  అని ఆయన  అన్నపుడు  నాకు వొళ్ళు పులకరించింది . ఎందు కంటే  ఒకే  సబ్జెక్టు మీద  దీర్ఘ కవిత  రాయడం  నిజంగా  గొప్ప విషయం  .

''మీ ' మంత్ర లిపి ' పుస్తకం చాలా  బాగుందండి .పాఠకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది '' అన్నాను నేను .

ఆ మరుసటి రోజు  తన పుస్తకాన్ని నాకు ప్రెసెంట్ చేసారు కొనకంచి గారు. నేను నా ' సముద్ర ఘోష ' ,' సాగర మథనం ' తనకు ఇచ్చాను .

గానీ  నేనా పుస్తకాన్ని ఇది వరకే  బుక్ ఎక్సిబిషన్లో కొన్నాను . చదవడం గూడా  జరిగింది .

మన రెండు తెలుగు  రాష్ట్రాల్లో  ను  ' కొన కంచి గారి కవిత్వానికి  హారతులు పట్టే  పాఠకులు  కో కొల్లలు ఉన్నారు .

కొన  కంచి గారికవిత్వాన్ని  అర్థం చేసుకోవడం చాలా కష్టం . పది వాక్యాల్లో  కవితల్ని ముగించేసి  కవిత్వాన్ని చేసే వాళ్లకు విభిన్నంగా  కొన కంచి గారి   కవిత్వం  ఒక ప్రవాహం లా  ముందుకు  వురికి పోతూనే  ఉంటుంది . ఒక్కొక్క సారి  ఉప్పెన  వచ్చిన  కెరటాల్లాగా , ఇంకొక సారి జల పాతం  లోకి ఉరుకు తున్నట్లుగా  పాఠకుల్ని   ఉరుకులు , పరుగులు  పెట్టిస్తుంది .

కొనకంచి గారి  కవిత్వాన్ని  గురించి  చెప్పడం  నాకు ఒక సాహసమే  అని చెప్పవచ్చు.   వారు నిత్య  అగ్నిహోత్రుడు లాగా , నిత్య కవితా సాగర  మథనాన్ని  చేస్తూ , నూతన  కవితా అగ్ని పూలను  పూయిస్తారు తన కలం చేత . మనసు భావాలన్నీ , ఒక్క సారిగా  అక్షరాల  విస్ఫోటనాలై   మన ముందు  ప్రజ్వరిల్లి మనల్ని , ఈ  సమాజాన్ని  ప్రశ్నిస్తాయి .

 ' గ్రహణం ' పట్టిన  ఈ  సమాజం కోసం  , ' అశ్రువు ' ఒక్కటి ధార పోసి , ' పూర్ణిమ ' ని చిగురింప  చేసారు  కొనకంచి గారు . 'చూపులు  వాలిన  చోట ' 'మంత్రలిపి 'ని కవిత్వం  చేశారు .

Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. - William Wordsworth .

కోన కంచి గారి కవిత్వం  powerful  feelings  వల్ల  ఉబికి వచ్చిన  spontaneous  over flow  అని  నిక్కచ్చితంగా చెప్పవచ్చు .

 త్వరలో  విడుదల  అవుతున్న ' నేనేమీ  మాట్లాడను ' సందర్భంగా , కవి గారికి శుభా  కాంక్షలు  తెలుపు తున్నాను .

భానుమూర్తి / 15.05.2016

Tuesday, May 10, 2016

ముఖ పుస్తకం ( face book )

ముఖ పుస్తకం ( face book )


లంఖణాలున్నా
లైక్  లే చాలు  కడుపు  నిండి పోతుంది
పస్థులున్నా
కామెంట్లే  చాలు  పండుగ  అయి పోతుంది
ముఖ పుస్తకం చేస్తుంది  గారడీ
అందరం   కావాలి  ఇక  రెడీ  రెడీ

కొందరు  కవులు
గేయాలతో  గాయాలు చేస్తారు
మరి కొందరు  కవులు
కవనాలతో  వనాలు  పూయిస్తారు

కొందరు  చిత్రాలతో
విచిత్రాలను  చూపిస్తారు
మరి కొందరు  తమ రాతలతో
టెన్షన్  పెట్టేస్తారు

ముఖ పుస్తకం  లో  ముఖ పరిచయం  లేకున్నా
అందరు  హితులే  , సన్నీ హితులే !

పుస్తకాలు చదవడం  కన్నా
బతుకు  పుస్తకం  చదవడం  మిన్నా 
ముఖ పుస్తకం లో  బతుకు పేజీలున్నా
అవి చదవడం  ఇంకా  గొప్పన్నా !!
 

Saturday, May 7, 2016

కవితాంతరంగం

కవితాంతరంగం




కవితాంత  రంగం  అనే శీర్షికలో - కవి సంగమం  అనే పేస్ బుక్  గ్రూప్ లో , నా  'సాగర మథనం ' అన్న  కవితా సంపుటి  గురించి  06. 05. 2016  నాడు  వచ్చిన  విశ్లేషణ గురించి  నా  మాటలు కొన్ని .

ఒక కవిగా  నా జీవితం ధన్య మయిందనే భావిస్తాను , కవితాంత  రంగంలో  మీ విశ్లేషణ  చదివాక . ఒక కవి అంతరంగాన్ని , అతని కవితల ద్వారా  అవిష్కరించడం , ఆతను  రాసిన  కవితల్ని క్షుణ్ణంగా  పరిశీలించి ఒక సమగ్ర మైన  నివేదికను  రాయడం అనేది  అసమాన్యమైన  క్రియ గా నేను అనుకొంటున్నాను . రాజా రామ్  తూముచర్ల  గారి కలం నుండి జారి పడుతున్న ఆణి  ముత్యాల్ల్లాంటి  కవితాంతరంగమ్ శీర్షికలో  నా పేరు చోటు  చేసు కోవడం  నిజంగా నేను ఏ జన్మలో  చేసు కొన్న అదృష్టమో ! అవును ... కవుల గురించి , వారి కవితల గురించి , వారి  ప్రతిభ  గురించి   కవి సంగమం  లో చేరిన  తర్వాతనే  నాకు తెలిసింది . ఇక్కడ  ఏంతో  మంది  ప్రతిభా వంతులు , కవిత్వాన్నే  ఉపిరిగా  చేసుకొని  బ్రతుకు తున్న మహాను భావుల  కవితల  గురించి  చదవడం, ముఖ  పరిచయం  లేక పోయినా  , ముఖ పుస్తకం ద్వారా  పరిచయం గావడం  నా అదృష్టం  గా భావిస్తున్నాను . అత్యంత  ప్రతిభాశాలి  , కవి సంగమం  అనే చెట్టు మీద  వాలుతున్న  పిట్టల్ని  ఒక్క చోట  చేర్చిన ఘనత  శ్రీ యాకుబ్  గారిది , అతనితో  పాటు పని చేస్తున్న వాహెద్  మరియు  సతీష్ లాంటి  యువ  కవులది గూడా . ఈ  సందర్భంగా  వారందరికీ  పేరు పేరునా  కృతజ్ఞతలు  తెలుపు కొంటున్నాను . 2000 సంవత్సరంలో , నేను  హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా లో  సి జి  ఎం ( ఫైనాన్సు ) గా పని చేస్తున్నపుడు  Dr  గోపి , తెలుగు  విశ్వ విద్యాలయం  వైస్  ఛాన్సలర్ గారి ఆశీస్సులతో ,నా  మొదటి పుస్తకం ' సాగర మథనం ' కవితా సంపుటిని రిలీజ్  చెసాను. తరువాత  2005 లో ' సముద్ర ఘోష ' అనే పుస్తకాన్ని  Dr రాము , రసమయి  మరియు Dr సినారే గారి చేతుల మీదుగా రిలీజ్ చేసాను . ఈ పుస్తకం  Dr అక్కినేని నాగేశ్వర  రావు  గారికి అంకితం ఇవ్వడం  జరిగింది .  అదే  విధంగా , ముఖ పుస్తకం  లో వస్తున్న   కవి సంగంమం  మరియు మిగిలిన గ్రూప్  లలో  125 కవితల్ని ఇంత  వరకు రాయడం  జరిగింది . శ్రీ   రాజా రామ్  గారు  నా కవితల  పట్ల  వెలిబుచ్చిన అబిప్రాయాలని సహృదయంతో  ఆదరిస్తున్నాను.  మున్ముందు మరింత  గాఢమైన , సాంద్రత కలిగిన  కవితల్ని రాయడానికి  ప్రయత్నిస్తాను . ఈ  కవితాంత రంగం  లో నాకు  చోటు  కల్పించి నందుకు  రాజా రామ్  తూముచర్ల గారికి , కవి సంగమం  నిర్వాహకులకు మరియు నా తోటి  కవి సోదరులకు  అందరికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను - వారణాసి భానుమూర్తి రావు 

Friday, May 6, 2016

మేధావుల్లారా !


మేధావుల్లారా !



ఈ  దేశంలో  మేధావులంతా
నోరు విప్పని  నాడు 
వానపాము గూడా  విషసర్పమై  కాటేస్తుంది

మేధావులంతా  గబ్బిలాల్లా
తలక్రిందులై  తపస్సు చేస్తున్నంత  వరకూ
వితండ వాదమే  మహా వేదమై పోతుంది

మేధావుల్లారా
రండర్రా  రోడ్ల మీదకు

ద్వంద నీతులు  కొందరు  పలుకుతున్నా
నోరు మెదపని  సజ్జనుల్లారా
రండర్రా  దండోరా  వేయడానికి

న్యాయ దేవత కళ్ళల్లో  కన్నీళ్ళు
భరత  మాత  ఒంటి నిండా  రక్తపు  మరకలు
మూడు హత్యలు , ఆరు  మాన భంగాలు
కుల మతాలు కట్టుకొన్న  కుళ్ళు ఆన కట్టలు
ఎవడికి వాడే  రాజ్యాంగాన్ని  రచిస్తున్నారు
ఎవడికి వాడే  చట్టాల్ని నిర్వచిస్తున్నారు
వేదాలకు  అవేదాలు
అవేదాలకు వేదాలు వల్లిస్తున్నారు
దేశం  బ్రష్టు పట్టిపోతోంది
ఈ దేశంలో  మట్టి  కల్మషం
గాలి కల్మషం , నీరు  కల్మషం
మనసులు  కల్మషం , మనుషులు  కల్మషం

ఒప్పుకోండి  మేధావుల్లారా
ఓడి  పోయ్యామని .....
కుళ్ళిన  వ్యవస్థను  మార్చలేమని  !


పాము కుబుసం  వదలినట్లు
కొత్త  చర్మాన్ని  తగిలించు కొని రండి
మీ కళ్ళల్లోని  రేటినాలు  మార్చి చూడండి
బానిస  మనస్త్వత్వం  నుండి బయట పడండి


మీ భయాన్ని , అసమర్థతను
మీ బ్లేజేర్ కిందనో  , రేబాన్  గ్లాసుల  వెనకనో
దాచేసి  తప్పుని ఒప్పుగా , ఒప్పుని తప్పుగా చెప్పకండి!

రండి  మేధావుల్లారా !
అందరం కలిసి  కొత్త దేశాన్ని నిర్మిద్దాం
మట్టి వాసన  మనుషుల్లో నింపడానికి...



“The fundamental cause of the trouble is that in the modern world the stupid are cocksure while the intelligent are full of doubt.”
Bertrand Russell