Sunday, April 10, 2016

నోబెల్ సోల్ !

నోబెల్ సోల్ !



 మా క్షురకుని  కత్తి
నా మెడ మీద  నుండి  పీక  వరకు వచ్చినా
లేశ మైన  భయం లేని నాకు
అతడి నోటి వెంబడి  వచ్చే 
సమస్యా లంకారా వ్యక్త అవ్యక్తా వ్యంగ చతురోక్తుల
సామాన్య ,రాజకీయ, సాంఘిక , చలన చిత్ర ఆవ్రతమై
నిరంకుశ  , నిర్మోహ  , నిరవధిక  వాగ్ధాటి పటిమకు
ఆశ్చర్య  పోతూ   భయ పడి పోతాను  నేను !

అతని క్షురకాలయంలో
పిల్లలు పెద్దలు  ముళ్ళ మీద
కళ్ళు పెట్టి   వాళ్ళు  కాలాన్ని నములుతూ
వార్తా పత్రికల  కథల  లోకి  విహరిస్తూ
కేశ   ఖండన  కాలాన్ని  బేరీజు  వెసుకొంటుంటారు

కులం , మతం  అడగని
ధనిక పేద తెలియని అపరిచిత , పరిచిత వ్యక్తుల
క్షురకర్మ  చెయ్యడమే అతని పని
నిజంగా  అతను  నాకు గొప్ప సంస్కర్త
మహాత్ముడు , మహితాత్ముడు

ప్రపంచాన్ని ఒక్క
ముక్కలో  విడమరచి  అర్థం చెప్పే మహా జ్ఞాని
ఆర్థిక  సంస్కరణలు
తమ  వృత్తికి  ఉరిత్రాళ్ళైనై
మల్టీ నేషనల్ కంపనీలు ఏసీ  గదుల్లో పెట్టిన
సలూన్లు  తమ పాలిట బలి  పీఠాలయినై
అని నాతొ అన్నప్పుడు  ఒక భయం
అతని  ముఖంలో  ప్రస్పుట మయింది


 కాలం తెచ్చిన  మార్పులు
ఇంటి అరుగుల మీద నుండి
లక్జరీ ఫైవ్  స్టార్  ఏసీ  సలూన్ల దాక
ఎలా ఎగబడింది కథ చెబుతూ
నా గుబురు గడ్డాన్ని ట్రిమ్ చేస్తాడు

వంద రూపాయలు ఉంచుకోమ్మన్నా
పనికి తగ్గ డబ్బు తీసుకోని
మూడు పదులు తో సరిపెట్టుకొన్న
మా బార్బెర్ నిజంగా నాకు దేవుడే !

దేశాన్ని కబళించే కింగ్ ఫిశర్లు  , 2జి రాజులు ,
కోట్లు మింగిన  రాజకీయ వాదులు
కబ్జా లు చేసే భూబకాసురులు
కల్తి  వ్యాపారం చేసే నకిలీ  వ్యాపారస్తులు
కిడ్నీ లు అమ్ముకొనే దొంగ డాక్టర్లు
పసి పాపల్ని  అమ్ముకొనే  నర్సులూ
ఇంతమంది రాక్షసులు  తిరుగుతున్న ఈ దేశంలో
మా బార్బెర్  ఒక  నోబెల్  సోల్ !



భానుమూర్తి  వారణాసి




No comments:

Post a Comment