Tuesday, April 19, 2016

చెరువు

చెరువు
----------


అలా  ఎంత సేపు  నడుస్తున్నానో  నాకే తెలియదు
సాయంకాలపు  నీరెండ  నన్ను చుట్టేసు కొనింది
మా వూరి  చెరువు గట్ల మీద
ఆమె ప్రవాహం లా నాకు ఎదురయింది
తీతవ పక్షులు పాడుతున్న  రాగాలు
చెరువు నీళ్ళల్లో  దోబుచులాడుతున్న  చేపల నక్షత్రాలు
ఆ సాయంకాలం  నా గుండెల్లో ఒక  పల్లె రాగమై  పలికింది
ఆమె  నా  ఎదురుగా  నిలబడింది
ఆకసాన  మేఘాలు  పన్నీటి తుంపర్లను  పంపించాయి
ఆమె కొంగు నా మీద  ఛత్రమై  గాలిలో ఎగిరింది
ఆమె వక్ష సంపద  నా   రెటినాలో  చిత్రమై నిలిచింది
ఆమె సిగ్గుల  మొగ్గయి బుగ్గలు నిగ్గయి
పసిడి కెంపుల కాంతిలో మెరుస్తున్నాయి
అప్పుడెప్పుడో  రెక్కల మనుషులు
గగనంలో  కనబడి మాయ మయి నట్లుగా
ఆమె  హటాత్తుగా  ఒక వసంతమై నిలిచింది
అవును ..... ఒక  పది  ఉగాదుల  తర్వాత
ఒక మహా యుగమై  ఆమె నన్ను పలకరించింది
అలా ఎంతసేపు ఆమె కళ్ళల్లో ని అమాయకత్వాన్ని
చూ స్తున్నన్నో నాకే తెలియదు
ఇళ్ళకు  వెడుతున్న పశువుల గంటల శబ్దం
ఎగురుతున్న గోధూళి  వాసన
సన్నని జల్లులు అందించిన కమ్మని మట్టి వాసన
కనుల ముందు బాపు  బొమ్మలా  ఆమె 
నా ఉచ్వాస  నిశ్వాసాల  సవ్వడిని  నియంత్రిస్తున్నాయి
తూరుపుదిక్కున  ఇంద్ర ధనస్సు దిగి వచ్చిన  దేవ కన్యలా
ఆమె  వదనం  సంధ్య కాంతిలో  మెరుస్తోంది
అవును ...
పది సంవత్సరాల్లో ఎంత  మార్పు?
పండక్కి వచ్చారా బాబు గారు?
చిగురు టాకులు తిని మదించిన కోయిల లా వుంది ఆమె స్వరం
ఆమె  గాలికి ఎగిరిపోతున్న పమిట సర్దుకొంటూ
మాటలు  గద్గద స్వరంలోంచి  బయటకు  రాలేక  కన్నీటిని  కురిపించాయి
నువ్వు వివాహితవా ? బాల్య  వివాహమా?
దక్షిణం దిక్కు ఉరుములు మెరుపులు
ఒక్క సారిగా ఉలిక్కపడ్డ పక్షులు
వలయా కారంలో తిరుగు తున్నాయి
పసి వాడని ప్రాయంలో పెళ్లి 
పదేళ్ళకే  వైధవ్యమా ?
ఎంతమంది  పూర్ణమ్మలు బలి అవుతున్నారో ?
ఆమె  చిటికెన వ్రేలు పట్టుకొని
ఏడు  అడుగులు నడిచాను
నాకు తెలుసు  .....
ఈ చెరువు గట్ల మీద మహా ప్రళయం  జరుగుతుందని
రెండు సమాధుల మధ్య  కత్తుల  యుద్ధం  జరుగుతుందని
రెండు పల్లెల  మధ్య  భీకర పోరు  జరుగుతుందని
రేపు తెల్లవారదు ...
చీకటి  కొన్ని సార్లు  ఉదయిస్తుంది
చీకటి కొన్ని  సార్లు  తెగిస్తుంది
కట్టు బాట్లు  ముళ్ళను తెంపి
సరిహద్దు కంచెల్ని దాటి
చీకటి చూపిన బాటలో
గమ్యం  చేరే వరకు  నడుస్తూనే ఉన్నాము

నాకు తెలియదు ....
పత్రికలో అక్షరాల సందేశం చదివే దాకా ...
వందల సంవత్సరాల  క్రితం  కట్టిన
ఆ పురాతన చెరువు  గట్టు తెగి పడి  పోయిందని
రక్త సిక్త మైన  చెరువు నీరు
రెండు పల్లెల్ని  ముంచే సిందని

మనిషి  కట్టుబాట్లకు
చెరువు బలి అయింది !
---------------------------------------------------------------------




 
వారణాసి భానుమూర్తి రావు
13.04. 2016











No comments:

Post a Comment