నా పల్లె ప్రపంచం !
ఎల్లలు లేని మా పల్లె ప్రపంచాన్ని చూడాలని ఉంది
ఆకాశం సాక్షిగా ఎగిరే పక్షులతో తీరాలకు చేరాలని ఉంది
అలల సాక్షిగా చలాకి చేపలతో ఏట్లో ఈదాలని ఉంది
గాలి పటం మీద కూర్చోని మేఘ మాలికలతో మాట్లాడాలని ఉంది
కొబ్బరాకుల మీద జాలు వారే వాన తీర్థాన్ని తాగాలని ఉంది
గడ్డి పువ్వునై మంచు బిందువుల్ని పలక రించాలని ఉంది
గన్నేరు పువ్వునై గాలికి ఊగాలని ఉంది
అమ్మ చేతి గోరు వెన్న ముద్దల్ని తినాలని
నాన్న వెంబడి బడి కెళ్లి అ ,ఆ లు రుద్దాలని
బడి పంతుళ్ళ చింత బర్ర దెబ్బలు తినాలని
మా పల్లె సాక్షిగా నా బాల్యాన్ని మళ్ళి గడపాలని ఉంది
పొలాల గట్ల చెరుకు గడ ల్ని
మామిడి తోపుల్లో మామిడి కాయల్ని
చేన్లల్లో పచ్చి సెనక్కాయల గుత్తుల్ని లాగి
కడుపు నింపుకొన్న బాల్యం గావాలని ఉంది
మునగ చెట్ల తొర్రల్ని కట్టుకొని దిగుడు బావుల్లో
మునిగి కుర్ర చేష్టలు చేసిన బాల్యాన్ని నాకెవరు ఇస్తారు ?
కిర్రు మంచం మీద ఆరు బయట పడుకొని
ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టాలని ఉంది
ఊరి చివర పున్నమి వెలుతురులో
కబడీ ఆడాలని ఉంది
సాయంత్రానికి చెట్టు మీద చేరే కాకుల శబ్దం
ఇళ్ళకు చేరే పశువులు చేసే కోలాహలం
గోవులు రేపే గోధూళి వాసన ఇక ఎవరిస్తారు ?
పల్లె ఒక ఆత్మీయత
పల్లె ఒక అమ్మ వొడి
పలకరింపుల ప్రేమల వడ్డన లను వద్దన గలమా ?
నా పల్లె నా ప్రపంచం
నా పల్లె నా అనుబంధం
నా పల్లె నా అంతరంగం
నా పల్లె నా అత్మరాత్మ
పల్లె కోసం పరితపించండి
పల్లె కోసం పరుగుతియ్యండి
పల్లె కోసం పల్లె ప్రజల కోసం
ఉన్నదాని లో సెలవు జెయ్యండి
పల్లె ని పలకరించని వాడు మనిషి గాలేడేమో !
పల్లె తో అనుబంధం లేని వాడు పరిపూర్ణుడు గాలేడేమో !
పల్లె శ్రమైక జన జీవన సౌందర్యాన్ని అనుభవించడానికి ఒక జన్మ చాలదేమో !
పల్లె కోసం - పల్లె గాలి కోసం
మట్టి కోసం - మట్టి వాసన కోసం
మరో జన్మ వేచి వుంటాను !
మా పల్లె మట్టిలో మళ్లీ మొలకనై పుడతాను !!
No comments:
Post a Comment