సంస్కార సమేత రెడ్డి నాయుడు
పండ్రెండవ భాగం(12)
రెండు గ్రామాల్లోనూ వైషమ్యాలు పెరిగి పోవడం చూసి అశోక్, రమలకు చాలా బాధగా ఉంది. రామలక్ష్మణుల్లా ఉన్న రెడ్డి గారికి , నాయుడు గారికి మధ్య వైరం పెరిగి పోవడానికి తమే కారణం గదా అనుకొని సరిగ్గా అన్నం గూడా తినడం లేదు. చదువు మీద గూడా ధ్యాస పెట్టడం లేదు. ఎలాగైనా పరిస్థితి జారి పోక ముందే పరిస్థితుల్ని చక్క దిద్దాలనే తాపత్రయం వారిలో ఎక్కువయ్యింది.
అశోక్ రెడ్డి , రమలను వారి వారి ఇళ్ళల్లో కట్టు దిట్టం చేశారు. ఇల్లు దాటితే కాళ్ళు విరగ్గొడతానని బెదిరించాడు అశోక్ తండ్రి రాజ శేఖర్ రెడ్డి గారు.
ఇక్కడ రమకు గూడా అదే పరిస్థితి.
" ఇకపైన నువ్వు అశోక్ ..ఎక్కడయినా కలిసి నట్లు నాకు తెలిసిందో కూతురని గూడా చూడకుండా నీ తల కాయ నరికి పోలేరమ్మ గుడికి కడతాను."అని నాయుడు గారు భయంకరంగా హెచ్చరించాడు.
ఇంటిలో ఉన్న నిర్మలమ్మ , మణెమ్మ , రమ చిగురు టాకులా వణికి పొయ్యారు.
" నాయన సెప్పినట్లు ఇను తల్లీ " అంది మణెమ్మ రమను దగ్గరకి తీసుకొంటూ.
" అలాగే పెద్దమ్మా! " అంటూ ఆమె ఒడిలో వాలి పోయి వెక్కి వెక్కి ఏడ్చింది రమ.
***************************************************
కాలం ముందుకు వెడుతోంది..
కానీ రెండు గ్రామాల ప్రజలు ముందు లాగా సంతోషంగా లేరు. దిన దిన గండం...నూరేళ్ళ ఆయస్సు అన్నట్లు బతుకు తున్నారు.
ఎక్కడ , ఎప్పుడు ఏ దుర్వార్త విన వలసి వస్తుందో అని భయ పడి పోతున్నారు.
రమ ..అశోక్ ని కలవ లేక పోతోంది. అశోక్ ని..రమని స్కూలుకు పంపడం మానేశారు. ఎక్కడయినా ఎవ్వరయినా వచ్చి పిల్లల్ని చంపేస్తారేమో అని భయం.
కానీ చాలా సార్లు అడుక్కొన్న పిమ్మట అశోక్ రెడ్డిని పది మంది యువకులయిన పాలేర్లను తోడుగా పంపించాడు రాజ శేఖర్ రెడ్డి గారు. ఆ పదవ తరగతి పరీక్షలు అయ్యేంత వరకూ ప్రతి రోజూ వాళ్ళు అశోక్ ని కాపాడాలి. మళ్ళీ ఇంటికి క్షేమంగా చేర్చాలి. స్కూల్ ఫైనల్ పరీక్షలు అశోక్ ఈ విధంగా తోడు తీసుకొని రాయాల్సి వచ్చింది.
తొలుత ఆడపిల్లలకు చదువు అక్కర లేదు ..బడికి వెళ్ళ నవసరం లేదని నాయుడు గారు తీవ్రంగా మందలించాడు. కానీ హెడ్ మాస్టారు కబురు పంపించాడు.
" రమ స్కూల్లో చాలా తెలివైన పిల్ల అని..చదువు మానిపించొద్దు " అని చెప్పడంతో తొమ్మిదో తరగతి పరీక్షలకు సమ్మతించాడు జయ రామ నాయుడు గారు.
కానీ రాయచోటి నుండి ఐదారు పహిల్వానులను నియమించుకొన్నాడు రమకి తోడుగా.
ఈ అంగ రక్షకులు పరీక్ష లన్నాళ్ళూ రమను తీసుకెళ్ళి పరీక్షలు రాయించి మళ్ళీ ఇంట్లో సురక్షితంగా దింపాలి.
ఆ పహిల్వాన్లను చూసిన జనాలు భయ పడి తలుపులు వేసు కొన్నారు.
" యాందప్పా..ఇది యాడా సూడలా..మనుషుల మీద ఇంత నమ్మకం లేక పోతే ఇక బతుకు ఎందుకు?..ఇంత బతుకు బతికి ఏమి లాబం ? " అని కొందరు జనాలు నొచ్చు కొన్నారు.
పరీక్షలు ఇద్దరూ బాగా వ్రాస్తున్నారు. కానీ చుట్టూ అంగ రక్షకులు ఉండడం వల్ల ఇద్దరూ కలుసు కోవడానికి వీలు లేక పోయింది రమ ..అశోక్ కి..
ఎలాగైనా అశోక్ ని కలిసి మాట్లాడాలని ఉంది రమకు. గుండెల నిండా నిండిన వ్యధను చెప్పు కోవాలని ఉంది. తను బంగారు పంజరంలో చిక్కుకొన్న చిలకలా బాధ పడుతోంది.తన వల్ల అశోక్ ఎన్ని దెబ్బలు తిన్నాడో పాపం..అని క్షమాపణలు అడగాలని
అనిపిస్తోంది..కానీ తనకు అసలు కుదరడం లేదు.
అశోక్‌కి గూడా పరీక్షలు అయ్యే లోపల ఒక్కసారి రమను చూడాలని పించింది.పాపం ..రమ తన వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తోందో అని అశోక్ అనుకొన్నాడు.
రమ ఒక్క ఉత్తరం రాసి సుమతి చేత పంపించింది అశోక్ కి ఇవ్వమని. పరీక్ష అయిన తరువాత అశోక్ హాల్ నుండి బయటకు వస్తూనే రమ రాసిన ఉత్తరాన్ని అశోక్ కి అందించి ..రమ ఇవ్వ మనింది అని రహస్యంగా చెప్పి వెళ్ళి పోయింది.
కంగారుగా అశోక్ నలు వైపులా చూశాడు.అక్కడ ఎవ్వరూ లేరు . బయట పెట్టిన పుస్తకాల సంచీని ఎత్తుకొని ఎక్కడో ఒక పుస్తకానికి ఉన్న అట్ట లోపల ఆ ఉత్తరాన్ని దాచేశాడు.
అంతే...బయట ఉన్న అంగరక్షకులు పాలేర్లు పది మంది.." రా బాబూ..ఇంటికి పోదాం..నాయన కాచుకోని ఉంటాడు" అని అశోక్ ని లాక్కొని వెళ్ళిపొయ్యారు.
ఇక్కడ రమని గూడా ఒక్క క్షణం గూడా వృధా చెయ్య కుండా రమకు నియోగించిన అంగ రక్షకులు లాక్కొని వెళ్ళిపొయ్యారు.
అభం శుభం తెలియని చిన్నారులు పెద్ద వారి వైషమ్యాల వల్ల, అపార్థాల వల్ల వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి.
**********************************************
ఇంటికి చేరుకొన్న అశోక్ హడావుడిగా ఏదో రెండు మెతుకులు తిని, పరీక్షకు చదువు కోవాలనే నెపంతో తన గదికి వెళ్ళి గొళ్ళెం వేసుకొని రమ రాసిన ఉత్తరం బయటకి తీసి చదవ సాగాడు.
" అశోక్..
నన్ను క్షమిస్తావు గదూ? నా కోసం నువ్వు మా అన్న గార్ల దగ్గర ఎన్ని దెబ్బలు తిన్నావో..ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో నాకు తెలుసు. అందుకే క్షమించమని అడగ డానికి గూడా నాకు అర్హత లేదు.
ఇంతకీ పరీక్షలు ఎలా రాసావు? నేను బాగా రాస్తున్నాను. మనం ఎంచక్కా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాము.నువ్వు దానికి దిగులు పడవద్దు..
మా నాన్న తరపున నేను క్షమాపణలు అడుగు తున్నాను. మీ నాయన గారిని శాంతంగా ఉండమని చెప్పు. ఆరోగ్యం బాగుంటుంది.
పోతే నీ కొక్క ముఖ్య విషయం చెప్పాలి. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈరెండు పల్లెలు సుఖంగా బ్రతకాలంటే మన రెండు కుటుంబాలు బాగుండాలి. కొట్లాటలు ..గొడవలు వల్ల అసలు శాంతం లేదు మన పల్లెల్లో. మనం ఇద్దరమే ఈ కుటుంబాల్ని
కలపాలి.
నువ్వు ఒక్క సారి నన్ను కలవ గలవా? వచ్చే పున్నమి రోజు నేను ధైర్యం చేసి మా గుడి కాడికి పూజకు వస్తాను. నువ్వు రాగలవా? ఎవ్వరూ గుర్తు పట్టకుండా మారు వేషం లో అయినా రాగలవు..నీతో చాలా విషయాలు మాట్లాడాలి. సాయంకాలం ఐదు గంటలకు నేను పూజకు వస్తాను. మా గుడిలో కలుద్దాం.ఎట్లాగూ ఊరి కవతలే గదా గుడి ఉండేది..తప్పని సరిగా రావాలి....
ఇట్లు
నీ కోసం ఎదురు చూస్తూ
రమ "
అని ఉత్తరం రాసింది. అశొక్ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.ఎలాగైనా రమను కలవాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు అశోక్.
********************************************
తరువాత ఏమయ్యిందో రేపు పదమూడవ
భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీరైట్స్..రచయితవి
Copy Rights with Author.
No comments:
Post a Comment