Saturday, October 17, 2020


 సంస్కార సమేత రెడ్డి నాయుడు (11)
(పద కొండవ  భాగం)
---------------------------------------------------------


ఇదే అదను అనుకొని రెండు వర్గాలు తయారయ్యాయి రెండు గ్రామాల్లోనూ..నాయుడు గారి వర్గం..రెడ్డి గారి వర్గం. కొందరు నాయుడు గారి పిల్లలు చేసింది తప్పు అంటే, ఇంకొందరు రెడ్డి గారి కొడుకు చేసింది తప్పు అన్నారు.


ఇంత వరకు రెండు గ్రామాల ప్రజలు ఎలాంటి వైషమ్యాలు లేకుండా బ్రతికారు. ఒక్కరంటే ఒక్కరికి మక్కువ. రాజ శేఖర రెడ్డి తండ్రి గారు వీర కేశవ రెడ్డి గారు , జయరామ నాయుడు గారి తండ్రి రెడ్డప్ప నాయుడు   గారి కాలం నుండి పొరపొచ్చాలు లేకుండా రెండు పల్లెల్ల్లో జీవించి నారు.


పెద్దోళ్ళు  కథల్లా చెబుతా ఉంటారు వారి జీవిత విశేషాల గురించి .ఇప్పుడు గూడా వారి సమాధులు అలాగే ఉన్నాయి చెక్కు చెదర కుండా..పండగలకు..పెద్దోళ్ళ పండక్కి..జాతరలకు..బోనాలకు ఇప్పుడు గూడా జనాలు వెళ్ళి టెంకాయలు కొట్టి వారికి పూజలు చేస్తారు.


అలాంటి పల్లెల్లో అనుకోని ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది.


మధ్యలో చిచ్చులు రేపే వాళ్ళు , అబద్దాలు చెప్పి పబ్బం గడుపు కొనే వాళ్ళు ఎక్కువ అయ్యారు.


రెడ్డి గారి వర్గం వాళ్ళు ఏమి మాట్లాడు కొంటున్నారో కొందరు నాయుడు గారికి చేర వేస్తున్నారు. అలాగే నాయుడు గారి వర్గం ఏమి మాట్లాడు కొంటున్నారో , రెడ్డి గారికి చేర వేస్తున్నారు.


వారిరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది ఆ వాతావరణం. ఎక్కడి కెళ్ళినా రెడ్డి..నాయుడ్ల కొట్లాటలు..పోరాటం గురించే మాట్లాడు కొంటున్నారు పది మంది గుంపు చేరితే..

*****************************************************


ఆ రాత్రి దండోరా వేశారు.

రేపటి నుండి కాలువ పనులు ఉంటాయాహో..వాళ్ళ వాళ్ళ పొలాలకు నీళ్ళు పట్టుకోవడానికి రావాలహో..అని తోలు పలకలు కొట్టుకొంటూ దండోరా అతను వెళ్ళిపొయ్యాడు.


తెల్ల వారి అందరూ కాలువ దగ్గరికి వచ్చారు.

మొన్న రెండు మూడు రోజులు  పడిన వానకు నీరు బాగా పారుతోంది.


ఈ సారి నాయుడు గారు..రెడ్డి గారు రాలేదు..వాళ్ళ మనుషులు వచ్చారు. ఇంకా కొన్ని  కొత్త ముహాలు నాయుడు గారి బృందంలో  కనబడినాయి.


" ఎవరయ్యా మీరు? మిమ్మల్ని మా పల్లెల్లో చూడలేదే? " అని అడిగారు కొందరు రైతులు.


" కొత్తగా జీతానికి కుదిరినాములే "అన్నారు నాయుడు గారి తరపున వచ్చిన కొత్త జీత గాళ్ళు.


ఈ లోపల మడికి దుక్కి దున్నే దానికి వంతుల వారీ నీరు పట్టుకోవాలి. మాకు ముందు అంటే మాకు ముందు నీరు పట్టాలి అని గొడవ పెట్టుకొన్నారు ఇరు వర్గాల వాళ్ళు.


" మీ మడులకు  ఎన్ని నీళ్ళు పట్టుకొంటారయ్యా? మేము బతకాల్నా వద్దా? " 


అని ఘర్షణ పడుతూ..తిట్టుకొంటూ..ఒక్కరి కొక్కరు కొట్టుకొనే దాకా వచ్చారు.


అందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. గునపాలు, పారలు, ఇనుప జల్లెళ్ళు, వెదురు కట్టెలు ఉన్నాయి.


ఎవ్వరయినా కోపం లో ఏది విసిరినా తల కాయలు పగిలి పోతాయి.


కొట్లాట చిలికి చిలికి గాలి వానగా మారింది.


బూతులు..తిట్లు ..మా రెడ్డి గారు గొప్ప అంటే, మా నాయుడు గారు గొప్ప అనుకొంటూ ఒకరి మీద ఒకరు పడి కొట్టు కొన్నారు.


ఇంతలో నాయుడు గారి బృందం లోని ఒక్కడు పెద్ద గునపాన్ని తీసుకొని రెడ్డి గారి గుంపులోకి విసిరి వేశాడు.


ఆ గునపం నేరుగా వచ్చి రెడ్డి గారి పాలేరు తలకు వచ్చి తగిలింది.


ఆ దెబ్బకు అమ్మా అంటూ పడి పొయ్యాడు పాలేరు.

అతని తలంతా రక్తమే..ముఖం మీదకు బొట్లు బొట్లుగా జారిపోతూ కాలువ నీళ్ళంతా రక్తంతో నిండి ఎర్రగా మారింది.


ఈ దృశ్యాన్ని చూసిన నాయుడు గారి మనుషులు పరుగో పరుగు. వాళ్ళని వెంబడించి పట్టుకొందామని వేగంగా పరుగెత్తిన రెడ్డి గారి మనుషులకు వాళ్ళు దొరక లేదు.


అంతలో గునపం తలలో దిగిన మనిషికి తెలివి తప్పింది. కళ్ళు తేల వేశాడు. నోట్లోంచి తెల్లని బురగ వస్తోంది.


అందులో ఒక్క పెద్దాయన చెయ్యి నాడిని పట్టి చూశాడు.


' అయ్యో..ముండా కొడక..దొంగ నా కొడకా..ఎంత పని చేశాడు..నీ నోట్లో మన్ను పొయ్యా..ఈడ్ని చంపేశాడ్రోయ్..." అని గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టాడు.


పాలేరు నిర్జీవంగా పడి ఉన్నాడు.


ఆతని  ముఖం మీద తెల్ల తువ్వాలు కప్పి ..నలుగురైదుగురు ఆ శవాన్ని ఎత్తుకొని రెడ్డి వారి పల్లె వైపు నడక మొదలు పెట్టినారు.


" అన్నకు ఏమని జవాబు సెప్పల్నో? ఈ సావు ఇంకెంత మంది శవాల్ని చూస్తుందో దేవుడా" అంటూ నెత్తీ నోరూ బాదుకొంటూ , రొమ్ములు కొట్టుకొంటూ ముందుకు నడిచారు.


అక్కడక్కడా మూగిన జనం " ఏమయ్యిందప్పా..ఏట్లా దెబ్బలు తగిలినాయి  సిన్నాయనా..ఎట్లా సచ్చినాడు మామా" అంటూ వాళ్ళ వెనకాలే  పరుగులు తీస్తున్నారు భయంతో..

***************************************************

తరువాత ఏమయ్యిందో రేపు  పండ్రెండవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి

Copy Rights with Author.

No comments:

Post a Comment