Saturday, October 17, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (10)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు 

పదవ భాగం (10)


మరుసటి రోజు సాయంకాలం రెండు పల్లెల మధ్యలో ఉన్న మైదానానికి వచ్చారు‌ . దానినే మిట్ట అని గూడా అంటారు. మిట్ట కాడ కొన్ని  రాళ్ళతో  కట్టి వాటి మీద బండలు పెట్టి  నాలుగైదు బేంచీలు లాగా   వేశారు. అక్కడ రెండు గ్రామాల మనుషులు కొంత సేపు కూర్చోని మాటా మంతీ మాట్లాడతారు.


రాజశేఖర్ రెడ్డి తోటి పాలేర్లలతో ..ఓ పది మంది  గుంపుతో మిట్ట కాడికి చేరు కొన్నారు. 


అంతకు ముందు పొద్దున్నే వూర్లోని మనిషిని నాయుడు గారింటికి పంపి..సాయంత్రం రెడ్డి గారు మాట్లాడల్లంట , మిట్ట కాడికి రావల్లంట అని కబురు అంపి నాడు. 


నాయుడు గారు మిట్ట కాడికి తన కాడ పని చేసే వాళ్ళు..వూర్లో ఉన్న పెద్ద మనుషుల్ని కొందర్ని తోడు తెచ్చు  కొని వచ్చినాడు.


చాలా సేపటికి వరకు ఒకరి ముఖాల్లోకి ఒక్కరు చూడలేక పోయ్యారు. మాటలు పెగలడం లేదు. రాజ శేఖర రెడ్డి కోపాన్ని దిగ  మింగు కొంటున్నాడు.


" ఏమయ్యా? మీ కొడుకులు చేసిన పని? అన్నెం పున్నెం ఎరగనోడ్ని చితక బాదినారు? ఇది ఎంత వరకు న్యాయం అని నేను అడుగు తున్నా...? " 


" అదే నేనూ అడుగు తున్నా.. నీ కొడుకును అదుపులో పెట్టుకో రెడ్డీ..ఆడపిల్లతో ఆ కుప్పి గంతులు ఏంటి? మా కుటుంబ పరువు ఏం గావల్ల? పల్లెలో  అందరూ కోడి కూసినట్లు కూస్తున్నారు. మేము తలెత్తు కోని తిరగల్నా లేదా? " అని కస్సు మన్నాడు నాయుడు గారు.


" నాయుడు.. నిజాలు తెలుసు కొని మాట్లాడు నువ్వు. నిన్న మీ అమ్మి ప్రానాలు రక్షించి నాడు మా వోడు.నీళ్ళళ్ళో మునిగి పొయ్యే  నీ కూతుర్ని గట్టుకు చేర్చి క్షేమంగా ఇల్లు చేర్చి నాడు. దీనికేమి ప్రతిఫలం ఇచ్చి నారు నీ కొడుకులు.. గొడ్డును కొట్టి నట్టు కొట్టి పంపినారు. నీ కొడుకులు ఇద్దరూ తులవోళ్ళు  అయిపొయ్యారు.కొంచెం అదుపులో పెట్టుకో" అన్నాడు రాజ శేఖర్ రెడ్డి.


కొడుకుల్ని అందరి ముందరా చులకన చేసి మాట్లాడే సరికి నాయుడు గారికి చాలా కోపం వచ్చింది. చేతిలో ఉన్న గొడుగును వించి పడేశాడు.


" ఏమను కొన్నావయ్యా నువ్వు? నా కొడుకుల్ని అందరి ముందరా చులకన చేస్తావా? " అని రెడ్డి గారి ముందుకు పోయి ముఖంలో ముఖం పెట్టి గర్జించాడు.


రెడ్డి గారికి కోపం కట్టలు త్రెంచుకొని పారింది.


ఒక్క ఉదుటున కూర్చొన్న వాడల్లా లేచి..బలంగా నాయుడు గారి చెంప మీద ఒక్క దెబ్బ వేశాడు.


ఆ దెబ్బకు నాయుడి గారి చెంపలు ఎర్రగా కంది‌ పొయ్యాయి.


కోపంలో.. అవేశంలో ఇద్దరూ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. విచక్షణా రహితంగా ఇద్దరూ ఒకరి మీద ఒకరు కలియ బడి‌ పిడి గుద్దులు గుద్దు కొన్నారు.


"ఇన్ని రోజులూ  నీ కొడుకులు ఎన్ని తప్పులు చేసినా నీ‌ ముహం చూసి ఊరుకొన్నా నాయుడూ! ఇక ఊరుకొనేది లేదు. తాడో పేడో తేల్చు కొంటా! "


అని  మళ్ళీ నాయుడు మీద  పులి లాగా కలయ బడ్డాడు రెడ్డి గారు. నాయుడు గారు గూడా సింహం లాగా మీద పడి ఇద్దరూ  కొట్టుకొన్నారు. 


అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. మాటలు లేని బొమ్మల్లా చూస్తున్న వారికి ఏదో పెద్ద అనర్థం జరుగు తుందని తెలిసి ఇద్దర్నీ బలంగా వెనక్కి నెట్టినారు.


మధ్యలో కొందరు నిలబడి.." యాంది రెడ్డి అన్నా..నువ్వు గూడా  ఇట్లా ...గమ్ముండు సామీ....నాయుడప్పా..ఆపుకో ..కోపం ఆపుకో..ఇద్దరూ శాంతంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది" అని రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టినారు.


" మన వూర్లకు మీరు ఇద్దరూ రెండు కళ్ళు లాంటి వారు ..అలాంటోళ్లు కొట్టుకొంటే ఏమయితాయప్పా మా బతుకులు? " అని ఒక పాలేరు ఏడ్చి దండం పెట్టినాడు.


మిగతా అక్కడి కొచ్చిన వాళ్ళు గూడా తువ్వాలుతో కళ్ళ నీరు తుడుచు కొంటూ ఆ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.


" నా జీవితంలో ఇలాంటి  పరిచ్చితి వస్తుందని అనుకోలేదు నేను. ఇలాంటిది సూడల్ల అనా నేను బతికుండేది. మన పల్లెలకు ఏదో శాపం తగిలింది. లేదా నర దిష్టి తగిలిందేమో..అయ్యా..అప్పా. మీకంటే వయసులో పెద్దోడ్ని .అయినా మీ కాళ్ళు పట్టుకొంటాను. కొట్లాట ఆపండి.  వయసులో ఉన్న పిల్లోళ్ళు . వాళ్ళది ఉడుకు రక్తం. పిల్లోళ్ళ కోసం మీరు కొట్లాడు కోవడం ఏమీ బాగా లేదు" అని ఒక ముసలాయన వరసకి రెడ్డి గారికి చిన్నాయన బలరామ రెడ్డి  అన్నాడు ఏడుస్తూ.


లేచి ఇద్దరి కాళ్ళకు మొక్కడానికి ముందుకు వంగినాడు.


" సిన్నాయనా..చ .నీకేం ఖర్మ? మా కాళ్ళు పట్టు కోవడానికి..అయ్యేదేదో అవుతుంది. ఇంటిని సక్క బరచు కొనే దానికి రాదు గానీ..ఊరంతా సక్క బెడతాడంట ఈయప్ప " అన్నాడు రెడ్డి గారు నాయుడు గారి వైపు కొర కొర మని చూస్తూ. 



నాయుడు గారికి కోపం కట్టలు త్రెంచుకొంది మళ్ళీ.


" మాటలు జాగరత్త గా రానియ్యి రెడ్డీ " అన్నాడు నాయుడు గారు.


ఇంకా అక్కడే ఉంటే రామ రావణ యుద్దం అయి పోతుందని అక్కడున్న వారంతా ఇద్దర్ని విడదీసి లాక్కొని ఎవరి ఇంటికి వారు వెళ్ళి పొయ్యారు.


కొందరి జీవితాలు ఎలా ఎక్కడ మొదలవుతాయో , ఎక్కడ ముగిస్తాయో తెలియదు.  అనుకోకుండా వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించు కోవాలో తెలియదు. నిన్న మొన్నటిదాకా ఎంతో ఆప్యాయంగా మెలిగిన రెండు కుటుంబాల మధ్య రేగిన  ఈ చిచ్చు ఎంత వరకు పోతుందో ఆ కాలమే నిర్ణయించాలి. 

***********************************************

తరువాత ఏమయ్యిందో రేపు  పదకొండవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి

Copy Rights with Author.


No comments:

Post a Comment