Wednesday, March 25, 2020

శార్వరీ ఉగాదీ!

శార్వరీ ఉగాదీ!
----------------------------
శార్వరీ ఉగాదీ!
ఏముందని వచ్చావమ్మా?
మా ఇళ్ళు బోసి పోయినాయి
మా వాకిళ్ళు  మాసి పోయినాయి
మామిడాకుల తోరణాలు లేవు
వేపాకు పూతల సందడి లేదు
 షడృచుల ఉగాది పచ్చడికి నోచు కోలేదు

శార్వరీ ఉగాది తల్లీ?
ఎక్కడివమ్మా  నాటి గత చరిత్రలు?
ఎక్కడివమ్మా పిల్లల పెద్దల ఆటపాటలు?
ఏమై పొయ్యాయమ్మా ఆ కవి సమ్మేళనాలు?

ఏ కొయిలమ్మా పాట పాడడం‌ లేదు
ఏ మామిడి కొమ్మా పూత పూయనే లేదు
చైత్ర మాసపు తళుకు బెళుకులు కనబడం లేదు
పంచాంగపు శ్రవణాలు  వినబడడం లేదు

నేటి దుస్థితికి ఏ గ్రహాలు కారణం?
ఈ పరిస్థితికి  ఏ రాక్షస శక్తులు కారణం?

శార్వరీ ఉగాది మాతా?
*కరోనా* మహమ్మారి జన జీవితాల్ని
అతలా కుతలం చేసింది
స్వీయ నిర్బంధం లో ఇల్లే 
కారాగారం అయ్యింది
పిల్లల ఆట పాటలు  కరోనా సంకెళ్ళకు
కట్టడి అయి పొయ్యాయి
ఆదాయం కన్నా...వ్యయం మిన్నా
కరోనా గ్రహ కూటమితో
 జన జీవన స్రవంతికి   వెంటిలేటర్లు
బ్రతుకులు జనతా కర్ఫ్యూ లో
పగిలి పోతున్న  చిమ్నీ లాంతర్లు

ఉగాది పచ్చడికి
విందు భోజనాలకు
పూర్ణం బూరెలకు
బొబ్బట్లు అరిసెలకు
పులిహోరకు పాయసాలకు
కొబ్బరి నీళ్ళకు చెరకు గడలకు
వడియాలకు , వూర బెట్టిన మిరపలకు
దూరం చేసిందమ్మా ఈ కరోనా పిశాచి

వచ్చినట్లే వచ్చి
ఆగమాగం చేస్తున్న కరోనాను
ఈ ఉగాది రోజు నుండే తరిమి వేస్తాం!
కరోనాను ఖతం చేసి
నూతన ఉగాదిని జరుపు కొంటాం
ఒక నూతన యుగానికి
ఆరంభం పలుకు తాం!

వారణాసి భానుమూర్తి రావు
25.03.2020
శార్వరి నామ సంవత్సర ఉగాది
బుధ వారం , చైత్ర మాసం

No comments:

Post a Comment