Saturday, November 18, 2017

అమరావతి - మన కలల కాణాచి


అమరావతి  - మన కలల  కాణాచి
-------------------------------------------

నాడు   విశ్వ కర్మ  సృష్టించాడు  'ఇంద్రుడి'  కోసం 
ఒక అమరావతి  ఇంద్ర లోకపు  రాజ దానిగా !
నేడు  ఈ  'చంద్రుడు '  సృష్టించాడు ఆంధ్రుల కోసం
ఒక అమరావతి   నవ్య  ఆంధ్ర  రాష్ట్రానికి  రాజధానిగా !

దక్షిణ  కాశిగా అమరావతి  - అమరలింగేశ్వర స్వామి  అధిపతి
శాతవాహనుల  శౌర్య  క్షేత్రం - బుద్ధుడు  నడయాడిన  పుణ్య క్షేత్రం
పంచారామాలలో  అమరా  రామం - అమరేశ్వరాలయం
ప్రపంచ దేశాలలో  అమరావతి  - అజరామరం


ఆంధ్రులుగా  పుట్టడమే  మన అదృష్టము
అమరావతి రాజధానిగా మన కంటూ  ఒక రాష్ట్రము
దిశ దశలా  వ్యాపించును  తెలుగు వారి  ఔన్యత్యము
నలుదిశలా ప్రభవించును  తెలుగు వారి నైపుణ్యము

అమరావతి  పేరు  వింటే  పులకరించును  మది
దేవతలు  తిరుగాడే  దివ్యమైన  భూమి ఇది
ధరణి  కోట  వెలిసింది  పౌరుషాల  గడ్డగా !
శాతకర్ణి  పాలించిన  తెలుగు నేల  సాక్షిగా !

కృష్ణమ్మ గల గలల తో  - ప్రకృతి  పచ్చని  సోయగాలతో
సిరుల పంటలు  దొర్లినవి - మన   ఆంధ్ర నేలలో !
భాగ్య సిరులు  కురిసినవి  - ప్రతి తెలుగు ఇంటిలో !
కృషితో  నాస్థి  దుర్భిక్షం -  అమరావతి  అచంద్ర తారార్కం !







నాన్న !

నాన్న !
-----------

నాన్న అభయ హస్తాలు నా ఉన్నతికి  సోపానాలు 
నాన్న భుజాలు నన్ను మోసిన పవిత్ర సిలువలు      

నాలో తొలగని భయాలకు ఆనకట్ట మా నాన్న
తెలియని రేపటికి   తొలి ఉషస్సు  మా  నాన్న  

నా బ్రతుక్కి పూచిన వెలుగులు నాన్న కరుణ నేత్రాలు
అవి  నాకు కనబడని  అశ్రు ధారల జల పాతాలు 

దారి కానరాని బాటసారికి నాన్న నడిపించే దేవుడు
ఆశల మొగ్గలకు  కొమ్మలు   నాన్న అనుభవాలు

మాటే మౌనమైనా  కురిపిస్తాయి మమతాను రాగాలు
గుండె  అంచులు దాటి   ఉబకని  ప్రేమ తరంగాలు 

అక్షరాలకు కన్నీళ్లు  పెట్టించే  నాన్న  త్యాగం 
తడిసి  ముద్దవుతుంది  నాన్నకోసం రాసిన కావ్యం 

నాన్నల త్యాగాలు వృధా కావు 
చిన్న మొక్కలే  వృక్షాలై  ఫలాల్ని అందిస్తాయి !

వారణాశి భానుమూర్తి రావు
01. 10 . 2017
హైదరాబాదు
9989073105
( ఈ  నా కవిత స్వంత మనియు , ఇది ఎక్కడా ప్రచురణకు నోచుకోలేదనియు , ఇది ఎలాంటి  అనుసరణీయము, అనువాదము  గాదనియు  , ఈ  కవితను  మీ కవితా సంకలనమునకు వాడుకోవడానికి  ఎలాంటి  అభ్యంతరము  లేదనియు  మీకు తెలియ చేయు చున్నాను.  )