-----------------------------------------------------------------------------------
వాన దేముడా !
రచన : వారణాసి భానుమూర్తి రావు
------------------------------------------------------------------------------------------
'' ఈ సని ముకం యాడ సచ్చి నాడో ! యామో !''
తిడతానే ఉంది రంగమ్మ .
''కల్లు కన బడ్ల ... ఈడనే ఉండా? '' ఆవు దూడ మొగుతాడు పట్టుకొని దూడ గంగడోలు దువ్వతా ఉండాడు ఈరన్న ''
'' సెప్పవెంది మరి - ఈడనే ఉండా వని- పొద్దు గూకి పోతా ఉండాది . సట్లోకి బియ్యం గింజల్లేవు . సావుకారి మాదిరి కుసోనుంటే కూడెట్లా దొరుకుతుంది ? తూ.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.'' రంగమ్మ కోపంతో ఊగి పోతా ఉండాది.
ఈరన్న పది రూపాయలు తీసుకోని నూకలు కొనుక్కోవడానికి వూర్లో ఉండే రామన్న అంగడికి బయలు దేరినాడు.
ఈరన్న తెచ్చిన నూకల్తో రాగి సంగటి , పచ్చి పులుసు చేసి వండింది రంగమ్మ ఆ రాత్రి.
ఆ రాత్రి పడుకొన్నాదన్న మాటే గాని రంగమ్మ కి నిద్ర పట్టడం లేదు
ఈ బతుకంటే రోత పుడతా ఉండాది . ముందు జనమలో ఏమి పాపం చేసుకొన్నామో ఏమో ! ఈ జనమ లో ఈ రాత రాసి పెట్టినాడు ఆ బగ మంతుడు '' అని నొష్టు కొట్టుకొనింది రంగమ్మ .
ఎకరం భూమి ఉండాది గదా అని మామ కొడుకు ఈరన్న మనువాడింది రంగమ్మ . కుశాలుగా పెల్లి అయిన సమ్మచ్చరమంతా తిరునాళ్ళు, తీర్థాలు , సంతలు ఆడా ఈడా తిరిగినారు. ఈరన్న నాయన ఉన్న పెద్ద దిక్కు ఉండడంతో వంటికి కట్టం తెలీలా ! అయ్యప్ప అన్ని సుసు కొనే వాడు. సమ్మచ్చరం తిరక్క ముందే ఆయప్ప ఠక్కుమని సచ్చినాడు . సలిజ్వరం వచ్చినా కల్లు తాగతనే ఉండాడు , అది తిరగ బట్టి పెద్దాయన పానాలు ఇడిసినాడు. ఈరన్న తల్లి అంతకు ముందే సచ్చి పాయె .
నడ్డి మీద పెద్ద బండ రాయి పడినట్లు అయిండాది ఈరన్నకు . కట్టం సేసే పెద్ద దిక్కు కుటుంబరంలో కాలం సేసి నాక , బరువు బాదరా లేని గాలిపటం లాగా ఎగిరే ఈరన్నకు బతుకు తెరువు కోసం ఎంపర్లాడే పని అయింది.
'''యాందే రంగి ... ఉలుకు పలుకు లేకుండా , గంగెద్దు లాగా కునుకు తిత్తా ఉండావు '' ఈరన్న ఈసడింపుతో రంగమ్మ అలోసనలన్నీ ఎగిరిపోయినాయి .
''ఎట్టా నువ్వు బతుకు తావో ఏమో అని బెంగ మామా '' అంది రంగమ్మ గుడ్డి లాంతరు ఎలుతురులో ఈరన్న ముకము సూస్తూ .
'' నా గురించి యాల నీకు బెంగ? కండ లున్నాయి.. కట్టం జేస్త.. కడుపుకు కూడు దొరకదా ఏంటి? అన్నాడు మీసాల పైకి సెయ్యి ఎగదోస్తూ ఆటిని వంకర్లు తిప్పుతూ.
''జేస్తాడు పాపం. . మొనగాడు .. వళ్ళోంచి ఏనాడైనా కట్టము జేసినావా ? అనింది రంగమ్మ ముది గారం ఒలక బోస్తూ .
రంగమ్మను అక్కున జేర్చుకొని ముద్దులు పెట్టినాడు ఈరన్న .
''పెల్లయిన కాడ్నుంచి నువ్వు గూడా కట్టం ఎరుగవు గదా ... నేను నిన్ను పువ్వుల్లో పెట్టి సాకుతా '' అన్నాడు ఈరన్న తన ఎదరొమ్ము కేసి బలంగా హత్తుకొంటూ .
రంగమ్మ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారి మెరుస్తా ఉండాయి. ఈరన్న అలా ముద్దులు పెడతా ఉంటే ఎక్కడెక్కడో యామేమో అయి పోతా ఉండాది . ఈరన్న మాటలకి రంగమ్మ కల్లల్లో నీల్లు తిరగతా ఉంటే బలంగా ఈరన్నను హత్తుకొని పోయింది .
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైశాఖం నెలలో ముంగేటి వానలు పడితే సంబరాలు ఎక్కువవుతాయి రాయలసీమ రైతన్నలకు .
సమ్మచ్చరంలో నాలుగైదు నెలలు బాగా పని ఉంటుంది . తొలకరి వానలు పడే టప్పటికి దుక్కి దున్ని సేనిక్కాయ విత్తనాలు జల్లడానికి రెడీ గా ఉంటారు రైతన్నలు. పంటలు బాగా పండితే ఎకరానికి ఇరవై , ముప్పై మూటలు ఎక్కడికి పోవు. ఒక్కసారి పక్కన ఉన్న కంసలా చారి అన్న సేన్లో ఎకరానికి నలభై మూటలు పండినాయి .వాన దేముడు సల్లగా సూస్తే పంట బాగా సేతి కొస్తుంది . లేదంటే అంతే గతి. సెట్లు ఎండి పోయి ఏసిన ఇత్తనాలు గూడా సేతికి రావు. అప్పులే మిగల్తాయి .
సెని క్కాయల పంట బాగా రావాలని , ఫలం బాగా దక్కాలని , దేవుడికి మొక్కుకొని సేన్లు దుక్కి దున్నుతారు. దున్ని దున్నగానే మల్లి ఒక్కదఫా వానలు పడితే సాళ్లు తీసి ,ఆ సాళ్ళలో సక్కగా గింజల్ని నాగలి గొర్రుతో పోస్తారు ఆడోల్లు పాటలు పాడుకొంటూ. ఆరేడు వరసల శనిగ సాళ్ళకు ఒక వరస కందులు, పెసలు, అలసందలు వేస్తారు. ఒక్కొక్క సాలుకు ఒక్కో రకం పోసుకొంటా పోతారు. రెండు పున్నాలు దాటి సూడల్లా, చేన్లు ఎంత అందంగా ఉంటాయో, మొక్కలు వగలు పోతా ఉంటాయి.
అద్ద రాతిరి దాటినా ఈరన్న కి నిద్ర రాలేదు. గుడిసె బయట వాన చినుకులు పడతా ఉండాయి. వాన బలంగా కురుస్తా ఉండాది. గుడిసె మీద కప్పిన రెల్లు గడ్డి పైనుండి వాన నీళ్లు కురుస్తా ఉండాయి. రంగమ్మ అతని ఎదురొమ్ము మీద సెయ్యి ఏసుకొని నిద్ర పోతా ఉండాది. ఈరన్నకు కుసాలుగా ఉండాది. రేపు సేన్లో టెంకాయ కొట్టి దుక్కి దున్నాల. దూరంగా ఎక్కడో గొండ్ర కప్పలు అరుస్తా ఉండాయి. వాన పడితే కప్పలు బాగా అరుస్తా ఉంటాయి. ఈ సమ్మచ్చర మయినా వానదేముడు సల్లగా చూస్తే సెనగి పంట ఫలసాయం బాగా వస్తుంది. ఎకరానికి ఇరవై మూట్లు వస్తే గానీ కొంచెం దుడ్డు అన్నా చేతికి వస్తుంది. పాపం రంగమ్మ ఎండి కడియాలు, ఎండి గాజులు కావల్ల అనింది . ' బంగారు కొనే దానికి మన తాహతు గాదంటే ఎండి అయినా కొనియ్యి మామ ' అంది. ఈ సారి సేనిక్కాయల పంట సేతి కొస్తే తప్పనిసరిగా పీలేటికి ఎల్లి ఎండి నగలు కొన్యాల. ఏదో సినిమాల్లో చూసిందంట , నల్లపూసల దండ , అది గావల్ల అని ఒక్కటే ఏడ్పు. అందుకే ఈ సారి ఇంకో రెండు ఎకరాలు రెడ్లది కౌలుకు తీసికొని సేస్తావుండాడు సేద్యం. మూడు ఎకరాల్లో పంట బాగా వచ్చిందంటే అదురుష్టమే !
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అదేమి దురదృష్టమో , భగమంతుడు కన్ను తెరవలా !. పడినట్టే పడి వాన సుక్క కరువయింది . ఆకాసం ఎండి పోయి కారు మబ్బులు లేక కాలు తెగి పోయిన కోడి పుంజు లాగా గిల గిల తన్ను కొన్నట్లా ఉండాది . పల్లెల్లోని పెజలు పానాలు కళ్లల్లో పెట్టుకోని ఆకాసం పైకి సూస్తా ఉండారు . వానలు బాగా పడితే పంట దిగుబడి బాగా ఉంటాదని , కొన్ని దుడ్లన్నా కళ్ళ చూడొచ్చు అని ఆస పడితే , దేముడు కళ్ళల్లో కారొప్పొడి కొట్టినాడు . ' వాన దేముడా ! వాన దేముడా !' అని గిన్నెల్లో వడ్ల గింజల్ని , రెండు కప్పల్ని పెట్టుకొని ఇంటింటా తిరిగి గింజలు అడుక్కొన్నారు దాసరోళ్ళు . పిడికెడు బియ్యము , లోటా నీళ్లు కప్ప దేవుళ్ళకు పోస్తే వాన దేవుడు కరుణిస్తాడంట . ఊరవతల ఉన్న గంగమ్మోరికి మొక్కు కొన్నారు. పొట్టేళ్లను బలి ఇస్తామని. చల్ది చేస్తామని. మంచి మూర్తం చూసుకొని , అమ్మోరికి కుండల్లో నీళ్లు తెచ్చి , కడిగి, తానం చేపించి ,వేపాకులు కట్టి, పసుపు కుంకుమ పూస్తారు ఆరోజు. ఊర్లో వుండే ఒకాయప్పకు గంగమ్మ ఒంట్లోకి పూనకం వస్తుంది ఆ రోజు. అయ్యప్పకు నూటొక్క కడవలతో నీళ్ల్లు పోస్తారు ఊర్లో ఉండే పెళ్లయిన ఆడోళ్ళు.పసుపు రాసి రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఏపాకు మండలు కట్టి ఆయప్పకు పూజలు సేస్తే , అమ్మోరు తల్లి ఆమెకు పూనకం బట్టి వానలు ఎప్పుడు పడతాయో సెప్పుతుంది. ఇది ఆ పల్లిలో ఎప్పటి నుండో వస్తున్న ఆచారం.
అదేమి గహచారమో ఏమో ఆరు నెలల నుండి ఒక్క సుక్క యినా వాన కురవలా. ఏసిన పంటలు ఎసినట్లే ఎండిపోయినాయి .ఎవరి ముకాల్లోనూ నవ్వు లేదు. ఎవరి కొంపలో జూసినా దరిద్రమే ! నూకలు కొనే దానికి గూడా డబ్బుల్లేవు. కూలి పని సేస్తామంటే ఒకరు గూడా పిలవడం లేదు. గవర్నమెంటోళ్లు కరువు పనులకు కోట్లు కోట్లు దుడ్లు ఇచ్చినారని పేపర్లో రాసినారంట. గాని మన కాడికి వస్తే గదా ఆ పనులు.
''ఆ కరువు పనులు మన గాడికి రావల్లంటే ఎన్ని రోజులు పడుతుంది మామా ?'' అడిగాడు ఈరన్న ఊర్లో ఉన్న ఒక వార్తా పత్రిక చదువుతున్న పెద్దాయన్ని.
'' అంతా దొంగ నా కొడుకుల్రా రంగన్నా! సర్కారోళ్ల కరువు పనులు మన కాడికి వస్తాయా? మద్యలో ఎంతో మంది నక్క నాకొడుకులు మింగేస్తారు దొంగ బిల్లులు పెట్టి. పదోపరకో పనులు మన కాడికి వచ్చేసరికి ఎన్ని సంవచ్చరాలు పడుతుందో! అప్పటికి మన పిల్ల జల్లా ఆకలి సావులతో సచ్చి, ఏ కాకులకో, గద్దలకో యిందు బోజనాలవుతాము . ఈరన్న.. మన బతుకులింతేరా ! మన బత్కుల్లో ఎన్నెల రాదురా! '' పెద్దాయన కోపంగా యామేమో మాట్లాడతా ఉండాడు.
ఆ మాటలు విన్న ఈరన్న కు వల్లంతా మండ్ర గబ్బలు పాకి నట్లయింది. ఈ కుల్లు బోతు మనుషుల్ని , దగా పెపంచికాన్ని బూడిద జెయ్యాలని పిస్తా ఉండాది . గానీ తాను చేతకాని దద్దమ్మ . సదువు లేదు . దుడ్లు లేవు . సాహుకారి గాదు . భూముల్లేవు . గోచి గుడ్డ గూడా కొనేందుకు దుడ్లు లేవు. తూ .. ఎం బతుకో .. బిత్తల బతుకు .
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పొద్దు పొడిసినాక పల్లిలో దండోరా ఏయించి నాడు ఊరి పెద్దాయన . పొద్దు గూకే నప్పటికీ ' అందరు రచ్చబండ కాడికి రావల్లోచ్' అని ఆ దండోరా సారాంశం.
పొద్దు గూకింది.
ఒకరొక్కరు రచ్చబండకు వచ్చినారు. పల్లిలో యాభై ఇళ్లు ఉంటాయేమో ! మూడు నూర్ల మంది జనాలుంటారు పిల్ల పెద్ద ముసలి ముతక అందరూ కలిపి.
''యామి పెద్దాయన ? యామి ఎవహారం ? దండోరా ఎయిచ్చి నావంట ..'' అన్నారు జనాలు.
అంతలో పెద్దాయన రచ్చ బండ మీదకు ఎళ్లినాడు.
'' అందరూ వచ్చేసినారా ? '' అన్నాడు .
వచ్చినారు పెద్దాయన. . కొన్ని కొత్త ముఖాలు గూడా కనబడి నాయి ఈరన్నకి . పక్క పల్లిలోని వాల్లు గూడా వచ్చినారేమో అనుకొన్నాడు.
''ఇప్పుడు సెప్పబొయ్యే ఇసయం జాగరత్తగా ఇనుకోవల్ల. సమాచారం నుండి వానల్లేక కరువు బూతము మనల్ని పీక్కు తిని సంపతా ఉండాది. తాగ డానికి గంజి నీళ్లు గూడా కరువై పోతా ఉండాయి. మన పసులకు గడ్డి పోస గూడా దొరకల .ఇంక మనం ఆకలి సావుల్తో సావాల్సిందేనా ? మన బిడ్డలు అమ్మా అన్నం అని మొత్తుకొని ఏడవలసిందేనా ? అని సెప్పడం ఆపినాడు పెద్దాయన .
అందరి ముకాల్లో దైన్యం కనబడతా ఉండాది. బతుకంటే నరకంగా అనిపిస్తా ఉండాది.
''ఎం సేయాలో సెప్పు పెద్దాయన ?'' అన్నారు అందరూ ముక్తకంఠంతో .
''ఏమి లేదు .. మీరంతా ఒప్పుకొంటే ఓ ఇసయం సెబుతా .. మీరు కోప్పడ గూడదు. ''
అందరు సరే అన్యాక , ఉన్న ఇసయం సెప్పినాడు పెద్దాయన.
చాలా మంది కోపం వచ్చింది అయప్ప ఆ ఇసయం సెప్పినాక. కొంత మంది పెద్దాయనను కొట్టడానికి పైకి లేచి నారు.
''ఏమప్పో ! పెద్దాయనవు గదా అని ఊరకే వదిలేస్తా ఉండా ! వేరే వాడు అయింటే మెట్టితో కొట్టే వాడ్ని '' అన్నాడు ఒకాయన .
ఆ మాటలకు పెద్దాయన నొచ్చుకొన్నాడు .'' నాకు తెలుసురా .. నీకు కోపం వస్తాదని. కర్ణాటక లోని ఒక ఊర్లో ఈ సంప్రదాయం ఉండాది. అది మనం చేస్తే ఎట్లాగంటాది అని సెప్పినా ..'' అన్నాడు పెద్దాయన. ఎట్టికేలకు మగాళ్లంతా ఒప్పుకొన్నారు . ''మీ ఆడోళ్లను ఒప్పించుకోని రండి .. మల్ల కలుస్తాము '' అన్నాడు పెద్దాయన.
ఈరన్న ఇంటికి చేరె సరికి అద్ద రాతిరి దాటింది . రంగమ్మ ఇంకా అన్న తినకుండా కాసుకోని ఉండాది. అన్నలు తిన్నాక జరిగిన ఇసయమంతా సెప్పినాడు ఈరన్న . ఇసయం ఇన్నాక రంగమ్మ కి శానా కోపం వచ్చింది.
''ఎంది .. పున్నమి రోజున ఆడోళ్ళంతా బావి కాడ తడి బట్టలతో తానాలు చేసి , గంగమ్మ గుడి కాడ అద్ద రాత్రి గుడ్డలు లేకుండా బిత్తలతో గుడి సుట్టు ఏడు సుట్లు తిరగల్నా ? అసలు నేను ఒప్పుకోను మావా ? '' అంది రంగమ్మ.
ఎలాగో బుజ్జగించు నాడు ఈరన్న .
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పున్నమి రోజు రానే వచ్చింది.
ఆడోళ్ళంతా ఒక చోట సేరినారు. బావి కాడ కట్టు బట్టల్తో తానాలు చేసినారు.
అద్దరాత్రి అవతా ఉండాది. అందరు గుడి కాడ సేరి నారు. మగోళ్ళు ఎవ్వరు లేరు , రంగమ్మ కి భయం వేస్తాఉండాది. అమ్మోరికి పూజలు సేసినారు ఆడోళ్ళంతా . సాంబ్రాణి, అగరొత్తులు, వేప కొమ్మలు , వండిన అన్నం , గుమ్మడికాయలు అమ్మోరికి పెట్టినారు.
'' వాన దేముడా! వాన దేముడా! సల్లంగ కురయాలి. సెరువులన్ని నిండాలి. సేన్లన్నీ పండాలి. మా పిల్ల పాపలు, గొడ్లు గోద బాగా ఉండాలి'' అని సుట్టు సేరి పాటలు పాడతా ఉండారు అమ్మ లక్కలు.
ఆడోళ్ళంతా ఏసుకొన్న గుడ్డలు తీసేసే దానికి గుడి మూలకు ఉరికి నారు.
అంతలో రంగమ్మ గట్టిగా అరసింది. '' అమ్మల్లారా .. అక్కా .. సెల్లి ..గుడ్డలు ఇప్పద్దు . ఇది మన మాన , మర్యాద కు సమ్మందించిన ఇసయం. తడి గుడ్డలతోనే అమ్మోరిని పూజ సేస్తాము రాత్రంతా .. ''అంది గట్టిగ .
అందరూ రంగమ్మ సెప్పినట్లే అద్దరాత్రి దాకా పూజలు సేసి , అందరు ఇళ్ళకి ఎల్లి బారి నారు.
తెల్లవారినా రంగమ్మ ఇంటికి రాలేదు . ఈరన్నకి భయం వేసి రంగీ .. రంగమ్మా అంటూ వెదికినాడు . ఎక్కడా రంగమ్మ జాడే లేదు.
ఊరి చివర దిగుడు బావిలో చూసినాడు. అక్కడ రంగమ్మ శవం కన బడింది. వంటి మీద నూలు పోగు గూడా లేదు. ఎవరో ఆమెను బలవంతంగా సెరిసి నట్లు వొళ్ళంతా గాట్లు , రక్తం ఉండాది . తన లుంగీ రంగమ్మ ఒంటికి చుట్టుకొని ఇంటికే తీసుకెళ్లినాడు ఈరన్న.
చిన్న పిల్లోడిలా గుక్కిళ్లు పెట్టి ఏడ్చి నాడు ఈరన్న.
పల్లెల జనాలంతా ఈరన్న గుడిసే ముందు చేరినారు.
' పాపం.. బిత్తలతో ఊరు తిరిగిందని అవమానంతో బాయిలో దూకింది రంగమ్మ'' అని తలా ఒక మాట అనుకొన్నారు జనాలు.
పిల్లా జిల్లా , ముసలి ముతకా రంగమ్మ శవాన్ని జూసి ఏడుస్తా ఉండారు.
రంగమ్మను పాడే మీద ఎక్కించి , పూలు జల్లుకొంటూ , ఊరవతల పూడ్చి పెట్టినారు అందరు కలిసి.
ఆ రాత్రి అంతా ఉరుములు మెరుపులతో వాన ఎడతెరిపి లేకుండా కురిసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1985 లో రాసిన కథ.
GOTELUGU .COM LO 17.11.2017 PUBLISHED.
http://www.gotelugu.com/issue241/6033/telugu-stories/vaanademudaa/
No comments:
Post a Comment