Saturday, April 2, 2016

చెట్టు - పక్షులు

చెట్టు - పక్షులు
----------------------
ఆ  చెట్టు మీద 
వేలాది  పక్షులు 
సాయంత్రం కాగానే  
చిరు చిరు నక్షత్రాలయి
 కొమ్మల రెమ్మల మీద దాక్కొంటాయి

పగలంతా ఎక్కడో  తిరిగి తిరిగి
మళ్లి  ఆ చెట్టు  గూటికే చేరి
కబుర్లను  కడుపు నిండా పంచుకొంటాయి

రెక్కల్ని   రెప రెప లాడిస్తూ
కొమ్మల  చిగురు టాకుల  పరుపుల మీద
రాత్రి నిద్రకు సిద్ద మవుతాయి

ఒక్కొక్క సారి  చల్లని గాలి
స్పృశించిన  పక్షులు
కొత్త  రాగాలు పాడు కొని
మురిసి పోతుంటాయి

కొన్ని అమ్మ పక్షులు
బిడ్డల కోసం  కట్టుకొన్న
పొదరిల్లులో దూరి
పిల్లల నోటిలో
గోరు ముద్దల్ని తినిపిస్తాయి

చిరు జల్లులు  కురిస్తే
రెక్కల్ని విదిలిస్తూ
 ఆనంద నృత్యాల్ని  చేస్తాయి

ఆ చెట్టు మీద  వేలాది పక్షులు
సుప్రభాత గీతాల్ని పాడుతాయి
ప్రభాత వేళలో
గుంపులు గుంపులు గా
ఆకాశంలో  ఎగిరి  నాట్యాలు  చేస్తాయి

ఇన్ని వేలాది పక్షుల్ని మోస్తున్న
ఆ చెట్టు  నాకు ఒక గొప్ప మాతృదేవతే !

అన్నం కోసం  ఆరాట పడినా
ఒకరి కడుపు కొట్టి  బ్రతికే స్వార్థం లేక
సహ  జీవనం చేస్తూ
మానవత్వాని చాటుతాయి పక్షి జాతులు

ఒక కాకి మరణిస్తే
వేలాది కాకులు ఆకాశం లో తిరిగి  చింతిస్తాయి

గాలి పటం మాంజా లో చిక్కుకొని
ప్రాణాల్ని పోగోట్టు కొంటున్న కాకిని చూసి
వేలాది కాకులు ఆకాశంలొ గోల పెడుతున్నాయి

బాల్కొనీ లో కూర్చొని   'చెట్టు పక్షుల' కవిత రాసుకొంటున్న నాకు
మా  పదేళ్ల అమ్మాయి చెప్పే వరకు
ఆ  కాకి  పడుతున్న అవస్థ గుర్తుకు రాలేదు

పొడుగాటి కర్ర తో మా బాల్కనీ గోడ ఎక్కి
మాంజా  దారాన్ని లాగి రెక్క లెగరక
విల విల లాడుతున్న  కాకిని  కాపాడాను

మా అమ్మాయి కళ్ళల్లో  ఆనంద బాష్పాలు
నన్ను మళ్ళి మనిషిని  చేశాయి !


భాను వారణాసి / 02. 04. 2016
 

No comments:

Post a Comment