Saturday, April 18, 2015

నిర్యాణం

 నిర్యాణం
----------------------------------------------------------------------------

మండే  ఎండలో  మనిషి పక్కన   ఖాళీ  గిన్నెలు  పైసల  కోసం అడుక్కొంటున్నాయి
పంజగుట్ట  రోడ్డు  దివైడేర్ కాస్తా  జాలిగా  తన మీద నిద్ర పొమ్మంది  ఆ  మనిషిని
ఆ మనిషి  గుబురు గడ్డంలో    సహవాసం చేస్తూ
ఉన్న రక్తాన్ని  గూడా పీలుస్తున్నందుకు  దోమలు
కృతజ్ఞతగా  రెక్కల సంగీతాన్ని  వినిపిస్తున్నాయి
ముసురు కొంటున్న ఈగలు మడత ముఖంలో  జాగా వెతుక్కొంటున్నాయి ... ఈ  రాత్రికి
అక్కడే   గడిపెయ్యాలని ...
కాగితాలు , చెత్త చెదారం ఏరుకొని  బతికే వాడికి
అంతకంటే  సహారా  ఏమి  దొరుకుతుందని  మున్సిపల్ వాళ్ళు గుడా
చూసి  చూడనట్లు   తమ పనిలో  నిమగ్న మైనారు
సెల్లు  ఫోనులో  సొల్లు  కబుర్లు  చెప్పుకొంటూ  నడిచే  పాదచారులు
ఒక్క లుక్కేసి  ,  చిల్లరలేని  పర్సును  ' అయ్యో  పాపం ' అంటూ  జోబిల్లో  కుక్కు కొంటూ
'ఈ  దేశం  బాగుపడదు ' అని  ఒక  డైలాగ్  వదులుకొంటూ  పారిపోతున్నారు
తిండి  లేని  దేహం అస్థి పంజరం  మధ్య  చిక్కుకొని  ప్రతిరోజూ ఆత్మతో
కొట్లాడుతూనే  ఉంది '  నన్నెపుడు  వదలి వేళ తావని?'
లేచి  నిలబడే శక్తి  లేక , మల మూత్రాదులు  గూడా అక్కడే  విసర్జించి
ఆ  రోచ్చులోనే  బ్రతుకు పోరాటాన్ని  చేసే ఆ  అభాగ్యుణ్ణి  చూసి
అక్కడున్న  ఫ్లైఓవర్ , ట్రాఫిక్  సిగ్నళ్ళు , కరెంట్  స్థంబాలు , ఇనుప  సామాన్లు , సిమెంట్ దిమ్మెలు
ఇనుప పంజరాల్లో  బందీలయిన  ఎండిన మొక్కలు నివ్వెరపోతున్నాయి ...

జీవ  మున్న శవాన్ని  చూసి
నిర్జీవ  మైన  పదార్థాలన్నీ  ఇలా  అనుకోన్నాయి ....
'అసలు  వీళ్ళు  మనుషులేనా  అని.....  ?'

అక్కడున్న కాకులు , గద్దలు , పిల్లులు ,కుక్కలు
ఇలా  అనుకోన్నాయి ...

'ఏ  శాస్త్రజ్ఞుడైనా  దయ  తలచి ఒక  మందు గానీ  గోలి గానీ    కనిబెడితే బాగుణ్ణేమో.....
దయ , కరుణ  ఈ  రాతి  గుండె  మనుషులకు  కలగ డానికి  !!'

ఆ మనిషి  నిర్యాణం  కోసం  నిర్మాణం  జరుగుతోంది !!


 వారణాసి భాను మూర్తి రావు
18. 04. 2015

 

No comments:

Post a Comment