" చినుకు తాకిన నేల " - శాంతి కృష్ణ గారు రచించిన కవితా సంపుటి మీద నా సమీక్ష .
---------------------------------------
Poetry is the spontaneous out flow of powerful feelings. It takes its origin from emotions recollected in tranquillity . " William Wordsworth .
ఆధునిక సాహిత్య కవులు ఎంతో మంది మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు. కొన్ని కవిత్వాలు ఇంకా మన మస్థిష్కంలో ఎక్కడో ఒక చోట నిక్షిప్తమై వుంటాయి. శ్రీ శ్రీ గారు గానీ , రాయ ప్రోలు గారు గానీ , తిలక్ గారు గానీ , దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు గానీ తమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకొని కోట్లాది మంది సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకొన్నారు.
వీరు ఎన్నుకొన్న ప్రక్రియ ఏదైనా అందులో వారు నిష్ణాతులయ్యారు. శ్రీ శ్రీ గారు సామ్య వాదం లేదా సోషలిజం లేదా మార్కిజం వాదాలతో ముడి పడిన కవిత్వాన్ని అందించారు. అలాగే దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వాన్ని అందించారు.దీనినే కాల్పనిక వాద (Romanticism ) కవిత్వం అంటారు. ఈ ప్రక్రియలో కవి తన అనుభూతుల్నీ , ఆత్మీయతల్నీ, వాంఛల్నీ వ్యక్త పరుస్తాడు.విలియం వర్డ్స్ వర్త్ , షెల్లీ , కీట్స్ వంటి పాశ్చ్యాత్య కవులు ఈ కాల్పనిక వాద కవిత్వంలో నిష్ణాతులు అయ్యారు.
ఈ కాల్పనిక వాద కవిత్వంలో మనకు ప్రేమ తత్వం , ప్రకృతి తత్వం , అలౌకికాను భూతి , మార్మికత లాంటివి దర్శన మిస్తాయి.
' తెలుగు సాహితీ వనం ' అనే సమూహాన్ని ముఖ పుస్తకం లో స్థాపించి , ఐదు సంవత్సరాలుగా తన అకుంఠిత దీక్షతో , నిరంతర శ్రమతో అచిర కాలంలోనే 23000 మంది కవుల్ని ఒక చోట చేర్చి సాహిత్య సేవ చేస్తున్న ఆ తోట మాలి ఎవరో గాదు , శ్రీమతి శాంతి కృష్ణ గారు. ఆమెకు కవిత్వం మీదున్న ప్రేమ , తెలుగు భాష మీదున్న అంకిత భావం వలనే ఈ సాహిత్య వనం మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.
ఇటీవల రవీంద్ర భారతిలో 02.07.2022 వ తేదీన ఆరు పుస్తకాలు ఒకే రోజు అవిష్కరించడం వెనుక శాంతి కృష్ణ గారితో పాటు మిగిలిన నిర్వాహకుల శ్రమ గుర్తింప తగ్గది.
శాంతి కృష్ణ గారు వ్రాసిన ఈ ' చినుకు తాకిన నేల ' అనే 70 కవితల పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.ఈ కవితలన్నీ చదివాక , నేను ఇంతకు ముందు ఉటకించినట్లు , ఆమె కాల్పనిక వాద (Romanticism ) కవిత్వాన్ని బాగా పండించారని చెప్పక తప్పదు. మదిలో మెదిలే భావాల్ని అక్షర రూపంలోకి తెచ్చే క్రమంలో చాలా భావావేశానికి లోనయి ఈ కవిత్వాన్ని పుస్తక రూపంలో మన ముందుకు తెచ్చారు.
" ఎక్కువగా ప్రకృతిని ఇష్ట పడే నేను ఏ సుందర దృశ్యం చూసినా వెంటనే అక్షర రూపం ఇవ్వడం అలవాటు . భావ కవిత్వ మంటే మక్కువ ఎక్కువ. అడవులన్నా , సముద్రమన్నా చాలా ఇష్టం " అని వ్రాసుకొన్నారు ఈ కవియిత్రి తన మనసు పలికిన మాటల్లో.."
" Poetry is an art. It is a form of writing that uses words to create a picture, sound or feeling. Poetry has its own sound , form , image and rythm ." అన్నారు పాశ్చ్యాత్య కవులు.
శాంతికృష్ణ గారి కవితలు చదువు తున్నప్పుడు ఈ అలౌకిక. అనుభూతి , ఈ రిథం, ఈ ఇమేజరీ , కొన్ని భావ చిత్రాలు మనకు అగుపడతాయి .
ప్రతి కవితా ఆమె అన్నట్లు మనల్ని అలౌకిక తత్వానికి , ప్రకృతి తత్వానికి తీసుకు వెడుతుంది.
" దోసిళ్ళ కొద్దీ వెన్నెల క్షణాలు
నన్నిప్పుడు ప్రేమగా అల్లుకు పోతున్నాయి "
అన్న ' వన మాలి ' భావ గీతం చదువుతూంటే మనల్ని ఏదో లోకం లోకి తీసుకు వెడుతుంది.
మొదటి కవిత " గురువంటే నాన్నే! " లో
" నాన్నెప్పుడూ శిలా సదృశ్యమే
వణికించే చలి లోనూ నిర్దాక్షిణ్యంగా నిద్ర లేపి
పుస్తకాల ఒళ్ళో నన్ను పడేస్తూ " అంటూ
" నాన్నంటే మలయ పవనమే!
నాన్నంటే ఆది గురువే! " అని నాన్న మీద తమ ప్రేమను కురిపిస్తారు.
కవిత్వ నిర్మాణ పద్ధతులు , వాక్య నిర్మాణ పద్దతులు, ఎత్తు గడ, సాంద్రత , ముగింపు , బాగా తెలిస్తే గానీ కవిత్వం పండదు. శాంతి కృష్ణ గారు ఇవి ఔపాసన పట్టి నట్లున్నారు.
" ఆకలి చేసే పేగుల చప్పుళ్ళు
వాన చప్పుళ్ళతో కలిసి పోతున్నాయి " అని శబ్ధాలంకార ప్రయోగం చేశారు 'సంద్రం పిలుపు ' అనే కవితలో.
గంగ పుత్రుల అభాగ్య జీవితాల్ని స్పృశిస్తూ ,
" సూరీని కబురు లేక
సంద్రం పిలుపు లేక
బెస్త పల్లె ముడుచుకొన్న
గువ్వలా ఉంది నేడు
దిగుల గుప్పెట్లో ఒదిగి పోతూ ! "
అనడంతో మనకు మనసంతా దిగులుతో నిండి పోతుంది.
ఆమె ఆశావాది కాబట్టి ,ఆమె కవితల్లో నిరాశా వాదం కనబడదు .
" అవినీతి అణు మాత్రం కనిపించని సరి కొత్త బంగారు లోకాన్ని చూడాలని ఉంది " అని అంటారు ఒక కవితలో.
' మృగాడు ' అనే కవితలో అని ఆమె అపర కాళిలా గర్జిస్తుంది.
" ఉరి కొయ్య కూడా మరణిస్తుందేమో
వాడి దేహాన్ని మోసిన పాపానికి "
ఈ పుస్తకానికి పేరు ' చిగురు తాకిన నేల ' అనే ఒక కవితా శీర్షిక . ఆ కవితలో
" నీ మనసును ఏదైనా తడి స్పర్శిస్తే
చినుకు తాకిన నేలలా పరిమళించు ''
అనడం చాలా చాలా బాగుంది.
అలాగే 'వెన్నెల వాగులో ' తన మానవత్వాన్ని చాటు కొన్నారు.
" చిరు సాయపు చెమరింతలకు
పులకరించే ఆ పసి మనసుల్లో తప్పకుండా
మనమో వెన్నెల వాగవుదాం "
అనడం వారి కవిత్వ ప్రతిభను గూడా తెలియ చేశారు.
" పువ్వును కత్తరించి
అవనికి వైధవ్యాన్ని
ఆపాదించకండి "
అంటారు ప్రకృతి తో మమేక మయ్యే అడవి బిడ్డల కోసం ' వైధవ్యం ' అనే కవితలో.
ఇలాంటి కవితలతో తెలుగు సాహిత్య వనం పులకరించిందనే చెప్పాలి.శాంతి కృష్ణ గారు మున్ముందు ఇంకా మంచి కవిత్వాన్ని వ్రాసి సాహితీ లోకాన్ని మురిపించాలని ఆశిస్తున్నాను.
సమీక్షకులు :
వారణాసి భానుమూర్తి రావు
కవి , రచయిత
సహస్ర కవి రత్న , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ , సాహితీ భూషణ
హైదరాబాదు
9989073105
21.07.2022
( ఈ సమీక్ష కేవలం తెలుగు సాహితీ వనం వారి ' అక్షర సవ్వడి ' సమీక్షల పోటీల్లో బహుమతి పొందిన సమీక్ష .)
( ఈ సమీక్ష నా స్వంత మనియూ, ఇది అనువాదం గాదనియూ , అనుసరణ గాదనియూ మీకు హామీ ఇస్తున్నాను. ఇది ఏ పత్రికకూ పంప లేదనియూ మీకు హామీ ఇస్తున్నాను.)
Show quoted text
No comments:
Post a Comment