సంస్కార సమేత రెడ్డి నాయుడు
తొమ్మిదవ వ భాగం(9)
---------------------------------------------------------
ఒక్క రోజు సాయంకాలం స్కూలు వదలగానే పిల్లలందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి పొయ్యారు. ఆకాశం మేఘావృత్తంగా ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. బయట పల్లెలకు వెళ్ళే పిల్లలు హడావుడిగా వెళ్ళి పొయ్యారు.
బస్సు లో వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న ఒక్క బస్సు నాలుగైదు ఊర్లు తిరుక్కొని మహాల్ మీదుగా కలకడకు , ఆ తరువాత ఈ పల్లెల మీదుగా పీలేరు ..తిరుపతికి వెడుతుంది. ఇంకో బస్సు సలామత్ బస్ అనేది ఉండేది..అది ఎప్పుడు వస్తుందో దానికే తెలియదు.. ఎప్పుడూ టైరు పంచరయ్యిందని సాకులు చెబతా ఉంటాడు డ్రైవరు.. బస్సులో వెళ్ళినా మళ్ళీ ఒక్క మైలు పైననే పడుతుంది పల్లెకు చేరాలంటే...అందుకే అందరూ నడక మార్గంలో పల్లెకు చేరు కొంటారు.
పిల్లలందరూ పరుగులు లంఘించు కొన్నారు వర్షం పడుతుందేమో నని.
రమ కు తోడుగా అశోక్ ఒక్కడే మిగిలాడు.
అన్నలిద్దరూ ఎప్పుడో వెళ్ళి పోయినట్లుంది.
మహాల్ నుండి రెడ్డి వారి పల్లెకు , నాయుడు గారి పల్లెకు వెళ్ళాలంటే బాహుదా ఏరు దాటాల్సిందే..
ఏట్లో నీళ్ళు అంత లేవు గానీ ఒక్క రెండు మూడు ఫర్లాంగులు ఏట్లో నడవాలి.
రమ , అశోక్ వడివడిగా అడుగులు వేసు కోంటు నడుస్తున్నారు. బాహుదా నది కాడికి వచ్చే సరికి ఉరుములు , మెరుపులతో వర్షం ..ఒక్క సారిగా మొదలయ్యింది. ఒక్కటే ఈదురు గాలులు, మెరుపులు , ఉరుములు , నల్లటి మేఘాల తో చీకటి అయి పోయింది.
రమ భయంతో వణికి పోయింది.
పుస్తకాలన్నీ తడచి పొయ్యాయి. అశోక్ , రమ తప్ప మనుషులు ఎవ్వరూ కనబడడం లేదు.
ఏట్లోకి ఇద్దరూ ధైర్యం చేసి ముందుకు నడుస్తున్నారు.
ఎగువున వర్షం బాగా పడిందేమో నీటి వృద్దితి బాగా పెరుగుతోంది. మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేశాయి.
నీటి వృద్ధితి తట్టు కోలేక , పాదాల క్రింద ఇసుక మేటలు జారి పోతూంటే ...ఒక్క సారిగా ఒక గుంత లోకి అడుగు పెట్టింది రమ.
అంతే..అశోక్ అని గట్టిగా అరుస్తూ ఏడ్వ సాగింది.
అశోక్ ఒక్క సారిగా రమను వాటేసుకొని గట్టిగా పట్టు కొన్నాడు.
" రమా..భయ పడకు...నేనున్నాను గదా...నాకు ఈత వచ్చు. కొట్టుకు పోములే..." అని గట్టిగా హత్తు కొన్నాడు.
అయినా రమ లేడి పిల్లలా భయ పడుతోంది.
ఇంక చేసే దేమీ లేక , అశోక్ ఒక్క సారిగా రమను ధాన్యం బస్తా వీపు మీద వేసుకొన్నట్ల వేసుకొని ఆమె రెండు చేతుల్ని తన మెడ చుట్టూ తన రెండు చేతులతో బిగించి ముందుకు నడిచాడు.
ఏట్లో ఇసుక దిబ్బలు నీటితో కరిగి పోతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువవుతుంది గానీ తగ్గడం లేదు.
" అశోక్ ..మనం సచ్చి పోతామేమో .." అని ఏడుస్తూ అంది రమ.
" అహా..ఏమిటా మాటలు..నేనున్నాను గదా..నీకేమి భయం లేదు" అన్నాడు అశోక్ .
అలాగే మెల్లగా అడుగులో అడుగు వేసు కొంటూ ఇంకొక వైపు నున్న ఏటి గట్టుకు చేరు కొన్నారు.
మెల్లగా అలాగే వర్షంలో తడుచు కొంటూ పల్లె పొలిమేరలకు చేరారు.
అంతలో సుధాకర్ , దివాకర్ పాలేరు గాళ్ళతో టార్చి లైట్లు వేసుకొని, గోనె సంచులు నెత్తిన కప్పుకొని, గొడుగులు వేసుకొని వచ్చారు.
రమను ఆ విధంగా అశోక్ తో చూసే సరికి అన్నల కిద్దరికీ కోపం కట్టలు త్రెంచుకొని ప్రవహించింది.
అశోక్ కాలర్ పట్టుకొని ఇద్దరూ గద్దించారు.
" ఎక్కడికి పొయ్యావురా నాయాలా? ఇంత రాత్రి పూట మా సెల్లలితో నీకేం పని? గుడ్డలన్నీ తడిసి పోయినయి. వర్షం పడొచ్చు అని సార్లు ముందే సెప్పినారు గదా? ఏందీ తిరుగుళ్ళు? " అని అశోక్ ను సాచి ఒక దెబ్బ చెంప మీద వేశాడు సుధాకర్.
ఆ దెబ్బకు కళ్ళు తిరిగి కింద పడి పొయ్యాడు అశోక్.
ఈ సారి దివాకర్ , సుధాకర్ బలంగా అశోక్ వీపు మీద పిడి గుద్దులు గుద్దారు.
ఆ దెబ్బలకు అశోక్ ముక్కులోంచి రక్తం బాగా కారింది.
" అన్నా ..కొట్టొద్దు..అశోక్ సచ్చి పోతాడు.అశోక్ తప్పేమీ లేదు. నన్ను కాపాడి, నా పానాల్ని రక్షించాడు. ఏట్లో మునిగి పోకుండా నన్ను గట్టుకు సేర్చినాడు.." అంది రమ బిగ్గరగా ఏడుస్తూ.
" పద అమ్మీ..నాయనకు సెబుతా..నీ ఓగిళ్ళ వలనే మాకు స్కూల్లో, పల్లెలో సెడ్డ పేరు వస్తా ఉండాది.ఈ నా కొడుకుతో ఈ సారి తిరిగి నావో ఇద్దరి ఎముకలు ఏరేస్తా" అన్నాడు దివాకర్.
అంతలో టార్చి లైట్ల వెలుతురు కన బడింది. ఇంకో గుంపు పరుగెత్తు కొంటూ రొప్పుతూ వస్తా వుండాది.
రాజ శేఖర రెడ్డి మనుషులు పదిమంది అక్కడకు చేరు కొన్నారు.
" ఏమయ్యిందప్పా..అశోక అప్పా "
కింద పడి ముహమంతా రక్తంతో నిండిన అశొక్ రెడ్డిని చూసే సరికి వారికి చాలా కోపం వచ్చింది.
" రేయ్ ఏమయ్యింది? " అని గద్దించాడు రెడ్డి గారి గుంపులో ఒక్కడు.
" ఏమయిందో..మీ వోణ్ణే అడుగు..ఆడపిల్ల జోలికి వస్తే తలకాయ తీస్తాడు మా నాయుడు గారు" అన్నాడు నాయుడు గారి గుంపులో ఒక్కడు.
" ఏమయ్యింది దివాకరన్నా.." అని ఇంకొక్కడు అడిగాడు
" మా దివాకరన్న బాగా కొట్టినాడు మీ అశోకన్నని" అన్నాడు ఇంకొక్కడు.
మాటా మాటా పెరిగి రెండు గుంపులు ఏది కనబడితే దాంతో కొట్టుకొన్నారు.
రాళ్ళతో..కట్టెలతో దాడి చేసుకొన్నారు.
ఒక్క తట్టు వర్షం జోరుగా పడుతున్నా అందరి పౌరుషం తగ్గలేదు.ప్రాణాలు పోయినా పరవా లేదు అన్నట్లుగా కొట్టు కొంటున్నారు.
అక్కడొక పెద్ద యుద్ధ వాతావరణం నెల కొంది.
రెడ్డి గారి మనుషులు కొందరు పొడుగాటి కట్టెతో సుధాకర్ ను, దివాకర్ ను చావ బాదారు.
ఆ దెబ్బలు తట్టుకోలేక పరుగు పలాయనం లంఘించు కొన్నారు అందరూ తలకు ఒక దిక్కున.
రమ అశోక్ మెల్ల మెల్లగా అక్కడ నుండి జారుకొని ఎవ్వరెవ్వరి ఇళ్ళు వారు చేరుకొన్నారు.
***********************************************
ఈ వార్త ఆ నోటా ఈ నోటా పల్లెలో అందరికి ఆ రాత్రే తెలిసి పోయింది.
ఎవ్వరింట్లో విన్నా..ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ఈ కొట్లాట విషయాన్ని మాట్లాడు కొన్నారు.
సుధాకర్.. దివాకర్ ఇంటికి చేరగానే అగ్గి మీద గుగ్గిలం లా అయిపొయ్యారు.
" ఏమయ్యిందిరా? యాల గస పోసుకొంటున్నారు ? ఎందుకు కోపం? " అన్నాడు నాయుడు గారు.
" నాయనా..మేమన్నా ఉండాల్నా..అమ్మి అన్నా ఉండాల్నా... ఇంట్లో తేల్చుకో..పరిస్థితి చేయి దాటి పోతా వుండాది. అమ్మి బతుకు బజారున పడతా ఉండాది. చేతులు కాలినాక ఆకులు పట్టుకోని లాభం లేదు! " అని జరిగిన కథ అంతా చెప్పినారు కొడుకు లిద్దరూ వాళ్ళ నాయనతో.
అశొక్ రెడ్డి..రమ వానలో ఇద్దరే రావడం..అశోక్ ని కొట్టడం..రెడ్డి మనుషులు వచ్చి తమను చితక బాదడం అంతా చెప్పారు.
జయ రామ నాయుడు తోక త్రొక్కిన పాములా కస్సు మన్నాడు.
" రమా..ఈడికి రా అమ్మీ " అని గర్జించాడు.
రమ గజ గజ మని వణుకుతూ తండ్రి , అన్నల ముందు వచ్చి నిలబడింది. భయంతో కాళ్ళు వణుకు తున్నాయి.
" రాత్రి పూట ఏమా తిరుగుళ్ళు? యాలమ్మీ ఇట్లా మారిపోయినావు? " అని గట్టిగా చెంప మీద ఒక దెబ్బ వేశాడు.
" అమ్మా " అంటూ భయంగా అరుస్తూ పడి పోయింది రమ.
వెంటనే వంట ఇంట్లోంచి పరుగెత్తుకొంటూ వచ్చారు నిర్మలమ్మ..మణెమ్మ.
మణెమ్మ ఆ ఇంటిలో నలభై ఏళ్ళ నుండీ వాళ్ళ ఇంటిలో ఒక మనిషిగా మెలుగుతూ నిర్మలమ్మకు చేదోడు వాదోడుగా ఉంది.
" పెద్దమ్మా..పెద్దమ్మా " అని పిలుస్తారు పిల్లలందరూ.
" తీ...అప్పా..యాల కొడ్తావు " అంది మణెమ్మ రమను పైకెత్తి తన కేసి హత్తుకొంటూ.
నిర్మలమ్మ కళ్ళళ్ళొ నీళ్ళు తిరిగాయి.
" అమ్మి చూడు. ఎలా బయ పడి పోతా వుండాదో " అని తల నిమురుతూ తన దగ్గరికి తీసుకొంది కూతుర్ని.
అమ్మా..నేను తప్పేమీ చెయ్యలేదు. ఏట్లోకి వచ్చేసరికి నీళ్ళు బాగా వచ్చినాయి. వాన తగ్గుతుందేమో నని చెట్టు క్రింద చాలా సేపు నిలబడినాము నేను , అశోక్.. వాన తగ్గలా..అలానే తడుసు కొంటూ వస్తూవుంటే అన్నలు మన జీత గాళ్ళతో కలిసి బాగా కొట్టినారు. అశోక్ ఒళ్ళంతా రక్తమే..ఎట్లా ఉండాడో ఏమో? " అని మళ్ళీ ఏడ్చింది.
" అమ్మీ ..నీకిదే చివరి గా వార్నింగ్ ఇస్తా ఉండా..ఆడితో కలిసి మెలిసి తిరిగా వంటే నీకు స్కూలు మాని పిస్తా...ఇంట్లో కూర్చోని బోకులు కడుగు" అన్నాడు నాయుడు గారు.
" సరే నాయనా.." అని తన గది లోకి వెళ్ళి పోయింది ఏడ్చు కొంటూ..
***********************************************
అశోక్ గాయాల తోనే ఇల్లు చేరినాడు.
జరిగిన కథ అంతా జీత గాళ్ళ ద్వారా విన్న రాజ శేఖర్ రెడ్డి కి కోపం కట్టలు త్రెంచు కొని వచ్చింది.
" ఎంత ధైర్యమురా ఆ నా కొడుకులకు..నా బిడ్డను గొడ్డు బాది నట్లు బాది నారు. ఆ ముక్కులో రక్తం..గుడ్డల మీద రక్తం.."
అని పిడికిలి బిగించి పళ్ళు పట పట మని కొరికి నాడు.
" ఆడపిల్లను నీళ్ళల్లో మునిగి పోకుండా కాపాడిన దానికి మా వాడ్ని రక్తం వచ్చేట్లు కొడతారా? రానీ రేపు ఆ నాయుడు గాడికే చెబతా! తులవ నా కొడుకుల్ని కొంచెం సరిగ్గా పెంచమని. " అని కోపంతో వూగి పొయ్యాడు.
" రేపు వ్యవహారం తేల్చేస్తా..తాడో పేడో తేల్చేస్తా! " అని అరుస్తూ ఉంటే అన్న పూర్నమ్మ..ఇంకా అక్కడున్న జీత గాళ్ళకు వెన్నులో వణుకు పుట్టింది.
ఇక ఏమేమి అనర్థాలు జరుగు తాయో నని భయ పడి పొయ్యారు అక్కడున్న వారందరూ..
భయంతో వణుకుతూ అన్న పూర్ణమ్మ దేవుడి గది లోకి వెళ్ళి " ఏమి అసుభాలు కలగ కుండా సూడు సామీ !" అని ప్రార్థించింది.
అశోక్ కి మిగిలిన వారంతా సపర్యలు చేస్తున్నారు.
ఆ రాత్రి అలా భయంకరంగానే గడచింది రెండు కుటుంబాల వారికి.
" ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? అనే లవకుశ లోని పాట పంచాయతి రేడియో లో పల్లెంతా విన బడుతోంది.
**********************************************తరువాత ఏమయ్యిందో రేపు పదవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీరైట్స్..రచయితవి
copy Rights @ author.
No comments:
Post a Comment