Saturday, November 10, 2018

రాస పల్లి కథలు ( 4) - మా ఇంట్లో దీపావళి

రాస పల్లి  కథలు ( 4)   - మా ఇంట్లో దీపావళి 
--------------------------------------------------------------------------------------------------


మా ఇంట్లో దీపావళి 

------------------------------

నేను ఐదవ తరగతి మహాల్లో ప్రాధమిక పాఠశాల లో సదువుకొనే రోజుల్లో నాకు సుదర్శనం అనే స్నే హితుడుండే వాడు.అప్పుడు నాకు తొమ్మిదేళ్లు . మేమిద్దరం అన్ని ఇసయాల్లో ఒకటే మాట , ఒకటే పాట . మా అయ్యగార్లు గూడా మమ్మల్ని చూసి అన్నదమ్ములు రామలక్సమణుల్లా ఉండార్రా అనేవాళ్ళు . మా జట్టును జూసి అందరికి ఒకటే కుల్లు . మమ్మల్ని వాళ్ళతో ఒకసారి గూడా ఆడించుకొనే వాళ్ళు కాదు. ఏడ్పించే వాళ్ళు. కొట్టే వాళ్ళు . అయినా మేము అన్నీ సయించి మా స్నేహానికి దూరం కాలేదు . 

ఒక్క సారి మా సుదర్శనం స్కూలుకి రాలేదు . మా పిళ్ళె సారు వాల్లింటికి పోయి బడికి ఈడ్సుకోని వచ్చినాడు . మా రోజుల్లో బడికి రాలేదంటే సిచ్చలు బాగా ఉండేవి . సింత బర్రెలు తీసుకోని కొట్టే వాళ్ళు . లేదంటే ఒక వేప సెట్టు దూలం ఉండేది . ఆ దూలానికి కట్టేసే వాళ్ళు . సింత మాను దుంగకు ఇనుప చైన్ తో మా కాళ్ళు కట్టేసి ఏడ్పించే వాళ్ళు. లేదంటే గోడ కుర్సీ , తొడ మీద గిచ్చే వాళ్ళు. ఇన్ని శిక్షలుకు మా పసి మనసులు ఏమి సేయాలో తెలియక ఏడ్సుకొ నే వాళ్ళం . సుదర్శనం ఆ రోజు బడికి రాలేదని గోడ కుర్సీ ఏపించి నాడు మా పిళ్ళై సారు . నాకు స్యానా కోపం వచ్చి అయన చేతిని రక్తం కారేటట్లు కొరికి నాను . దానికి పిళ్ళై సారుకు స్యానా కోపం వచ్చి మా హెడ్డు మాస్టర్ సారుకు బోయి సెప్పినాడు . ఆయప్ప గూడా నన్ను బాగా తిట్టినాడు . ఆ రోజంతా మాకు తిట్లు , సింత బర్ర దెబ్బలు. అలా సాగింది మా ఇసుకూలు జీవితం. 

దీపావళి పండగ అంటే నాకు , మా స్నేహితుడు సుదర్శనం కి చాలా ఇష్టం . పండగ కంటే రంగు రంగుల టపాకాయలు కాల్చాలంటే చాలా సంతోషంగా ఉండేది. మా పిల్లోళ్లకి అందరికి ఈ పండగంటే స్యానా ఇష్టం. మా నాయన పండగ రెండు రోజులకు ముందు మహల్లో కొమిటోళ్ల అంగడికి ఎల్లి పటాకులు తెస్తాడు . ఐదు రూపాయలకు ఒక తిత్తి నిండుకు వచ్చేవి . అప్పుడు గూడా మాకు శివకాశి టపాకాయలు ఏ మదన పల్లి నుండో , తిరుపతి నుండో కొమిటోళ్లు తెచ్చి చుట్టుపక్కాల రైతులకు అప్పుకు అమ్మేవారు. సంక్రాంతి పండక్కి వచ్చే సెనిక్కాయలు అమ్మేస్తే వచ్చే దుడ్డుకు లెక్క కట్టి జమ యేసే వాళ్ళు . ఆ లెక్క లన్ని మాకు సిన్న పిల్లోళ్లకు తెలిసేది కాదు. ఎప్పుడు మా నాయన ముఖం టెన్షన్ గా ఉండి , నవ్వే వాడు గూడా గాదు . ఎమన్నా అంటే బర్రెను కొట్టినట్టు కొట్టేస్తాడు . మా సిన్నప్పుడు మాకు ఎప్పుడు దెబ్బలు , తిట్లు , శాపనార్థాలు తప్ప ఇంకోటి ఉండేది గాదు. ఏమి సెయ్యాల .. దుడ్లు ఉండేవి  గాదు. పంటలు సరిగా పండేవి గాదు . రాయల సీమ అంటే ఒకప్పుడు రతనాల సీమ అనే వాళ్ళంట . కానీ నేను మా ఊర్లో ఎవరి ముకాల్లో సూడనే లేదు నవ్వు . ఎప్పుడు బాధ పడతానే ఉంటారు . వాన బాగా కురిస్తే సేనిక్కాయల పంట బాగా వస్తుంది . నిమ్మన పల్లి డాంలోకి నీళ్లు వస్తేనే ఏదో మడ్లో పంటలు, తిండి గింజలు సంమత్సరానికి బాగా పండుతాయి .

ఇదంతా సెప్పి మిమ్మల్ను బాధ పెట్టాలని గాదు గానీ , మా సిమోళ్ళ కతలు , కట్టాలు ఎలా ఉంటాయనే సెపుతున్నా .

అది సరే గాని మా సుదర్శనం వాళ్ళు కోమిటోళ్లు. వాళ్లకు దుడ్లు , యాపారాలు స్యానా ఉండేవి. వాళ్ళ తాత వడ్లు బియ్య ఆడించే మెషిన్ ఫ్యాక్టరీ కట్టించాడని సెప్పే వాడు నాకు. అబ్బా ఎంత సావుకార్లో అని అనుకొనే వాడ్ని . వాళ్లకు పెద్ద కిరాణా షాపు ఉండేది. మా సుదర్సనం రోజు నాకు పప్పిరమెంట్లు , పప్పులు , బఠాణీలు తెచ్చి ఇచ్చే వాడు. లేదంటే వాళ్ళింట్లో చేసిన అప్పచ్చులు , మురుకులు ,పాగం పప్పు తెచ్చి ఇచ్చే వాడు.

నేను మా ఇంట్లో ఏమైన సేస్తే కజ్జి కాయలు , ఉడక బెట్టిన సేనిక్కాయలు , అలసందలు, కారం బెట్టిన అనప కాయ గింజలు, సేనిక్కాయ ఉండలు, జొన్న బొరుగులు తెచ్చి ఇచ్చే వాడ్ని. బాగా నవ్వు కొంటూ తినే వాళ్ళము . 

ఒక దీపావళి పండక్కి మా నాయన ' టపాకాయలు కొన లేనర్రా!'   అన్నాడు. మా అన్న దమ్ములకు బాగా ఏడుపు వచ్చింది .

' యాల  కొనలేవు నాయనా ? ' అని అడిగినాము.

' దుడ్లు లేవు. మాల్లో ఆ కొమిటోళ్లు అప్పు ఇవ్వం అన్నారు. ఇప్పుడే చేసిన బాకీ ఎక్కువుంది . అది తీరిస్తే గాని కొత్త అప్పు ఇచ్చేది లేదని సెప్పినాడు రెడ్డప్ప గుప్త ' అన్యాడు మా నాయన.

మమ్మల్ని నలుగురు అన్నదమ్ములని దగ్గరకు తీసుకోని ఆయన గుండెకు గట్టిగా హత్తుకొని ఏడ్చేసినాడు మా నాయన. 

మా యమ్మ , మా అన్నలు అందరు గూడాఏడ్సినాము . నేనే మా ఇంట్లో సిన్నోన్ని . 

'ఏడవద్దు సిన్నోడా .. నీకు నేను తెచ్చి ఇస్తా .. చెప్పు నీకేమి టపాకాయలు కావాల్నో ! ' అన్న్యాడు మా నాయన నా కళ్ళు తుడుస్తూ .

అంత ఏడుపు లోనూ నేను ' నాయనా ..నాకు ఈ సారి లక్ష్మి బాంబులు గావాలా .. తుపాకీ కావాలా .. అందులో రిబ్బను పటాసాలు పెట్టి కాలుస్తాను ' అన్నాను. 

అంతే మా ఇంట్లో అందరూ నవ్వుకున్నాము ఆ రోజు.

--------------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు స్కూలు కెళ్ళి నాక నిన్న మా ఇంట్లో జరిగిన కథంతా మా స్నేహితుడు సుదర్శనానికి సెప్పినాను . సెప్పుతూ ఉంటే నాకు తెలీకుండానే కళ్ళలో నీళ్లు , ఏడుపు ఆగలేదు . 

సుదర్శనం నా చేతులు గట్టిగా పట్టుకొని ' మా ఇంట్లో అంగడి ఉంది గదా! మా అయ్యను అడిగి నీకు దండిగా తీసుకొస్తాను . నువ్వు ఏడవద్దు సామి ' అన్నాడు .

నాకు స్యానా సంతోషం ఏసింది .

'దీపావళి పండుగ రెండు రోజుల ముందే టపా కాయలు ఇస్తాను . మా అంగడికి రా రా! ' అన్న్యాడు సుదర్శనం .

అనుకొన్న రోజు వాళ్ళ అంగడి దగ్గరికి ఎల్లి ఓ మూల దాక్కొన్నాను .

ఒక తిత్తిలో బురుజులు , భూ చక్రాలు , కాకర ఒత్తులు, చిచ్చు బుడ్లు ,లక్ష్మి బాంబులు ఏసుకొని సుదర్శనం నేనున్న చోటికి వచ్చి తెచ్చి ఇచ్చినాడు . సంతోషంగా తీసుకోని ఇంటికి పోయినాను. అప్పటికే మా నాయన గూడా దండిగా టపాకాయలు తీసుకోని వచ్చినాడు . మా ఇంటిలో అందరూ హాయిగా నవ్వుకొని అన్ని పంచుకొని ఎవరి టపాకాయలు వారివి ఎండలో పెట్టడానికి తయారు అయినాము. నా స్నేహితుడు ఇచ్చిన టపా కాయలు ఎవ్వరికి కనబడకుండా దాచేసి నాను. అవి చూపిస్తే అవి గూడా భాగం పెట్టమని అడుగుతారు మా యన్నలు.

--------------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు సుదర్శనం మా ఇంటికి ఏడుస్తూ వచ్చినాడు. వాడ్ని చూసి నాకు ఏడుపు వచ్చింది . జుట్టంతా చింపిరి చింపిరి. మాసి పోయిన గుడ్డలు . కళ్ళు ఉబ్బి పోయినాయి. చేతులు ఎర్రగా కంది పోయినాయి .

'ఏమైంది రా ' అన్నాను వాడి బుగ్గలు నిమురుతూ .

' మా నాయన నన్ను దున్నపోతును కొట్టినట్లు కొట్టినాడ్రా ...బెల్టు తో ' అంటూ వాడు ఏడ్చి నాడు .

' ఎందుకు? '

'మా నాయన్ని అడగకుండా నీకు నిన్న టపాకాయల్ని తెచ్చి ఇచ్చినాను గదా ? ఇంటిలో దొంగ తనం చేస్తావా ?? ' అని కొట్టినాడు .

నాకు భయం ఏసి వెంటనే ఇంటిలోకి పరుగెత్తి వాడిచ్చిన టపాకాయల సంచి తెచ్చి ఇచ్చేసి నాను. 

వాడు పరుగెత్తు కొంటూ సంచితో ఎల్లి పొయ్యాడు . నేనూ వాడి ఎనకాల వాళ్ళ అంగడికి పరిగెత్తి నాను .

సుదర్శనం వాళ్ళ నాన్నకు నేనిచ్చిన సంచి తిరిగి ఇచ్చేసాడు. వాళ్ల నాన్న టపా కాయల్ని చూసుకొన్నాడు.

' ఒరేయ్ సామీ ..నీకోసం మా వోడు దెబ్బలు తిన్యాడ్రా ' అని నాకేసి ఉరిమి చేసినాడు రెడ్డప్ప గుప్త. 

నాకు భయం ఏసింది. నన్ను గూడా గొడ్డును బాది నట్లు బాదు తాడేమో అని అనుకొన్నాను . 

'ఒరేయ్ వాడ్ని కొట్టింది నీకు పటాకులు ఇచ్చినాడని గాదు . నాకు తెలీకుండా అంగట్లో దొంగలించినాడని' అన్న్యాడు వాళ్ళ నాయన. 

ఆ సంచిని నా చేతి కిచ్చి , ' ఒరేయ్ సామి.. ఇవన్నీ తీసుకోని రేపు పండక్కి కాల్చు కోపోరా ' అన్నాడు ఆయప్ప.

నాకు చాలా సంతోషం ఏసింది . 

' నాయనా .. సుదర్శనం .. నీకు కావాల్సిన టపాకాయల్ని ఇంటిలో పెట్టినాను . కొత్త బట్టలు ఏసుకొని పండగ చెస్కో ' అని సుదర్శనాన్ని దగ్గరకు తీసుకోని ముద్దులు పెట్టినాడు వాళ్ళ నాయన.

సంచి తీసుకోని సర్రున ఇంటికి సేరినాను .

మా నాయన తెచ్చిన టపాకాయలు, నా స్నేహితుడు ఇచ్చిన టపా కాయల తో పాటు ఒక్క వారం రోజులు కాలుస్తానే ఉండాము . కానీ ఎక్కడో ఇప్పటికి నా స్నేహితుడు నాకోసం దెబ్బలు తిన్యాడని అనుకొంటే మనస్సు కాలిలో గాజు గ్రుచ్చుకొన్నట్లుగా బాధ పడుతుంది .

'మా సుదర్శనం యాడున్నా సల్లగా ఉండాలి స్వామీ ' అని ఎప్పుడూ మొక్కు కొంటానే ఉంటాను నేను.


-----------------------------------------------------అయి పోయింది ---------------------



(ఈ కథ కేవలం  యాదృచ్చికమైనా , ఇందులోని  సంఘటనలు, పేర్లు , పాత్రలు   ఎవ్వరిని ఉద్దేశించి  రాసినది గాదు . ఎవ్వరినీ  నొప్పించ  డానికి రాసినది  గాదు . నా జీవితంలో  జరిగిన ఒక్క చిన్న సంఘటన  ఆధారంగా  రాసిన కథ  మాత్రమే !)



No comments:

Post a Comment