రాసపల్లి కథలు ( 5) - నాగిరెడ్డన్న !
మా రాసపల్లి లో మా రైతులకు ఆరుగాలం శ్రమించినా ఫలితం అంతంత మాటే ! వర్షాలు బాగా పడితే సేనిక్కాయల పంట సేతి కొస్తే ఏదో కొన్ని దుడ్లు సేతి కొస్తాయి. లేదంటే ఆ సంవత్సరము దరిద్రమే !
జూన్ , జులై నెలల్లో తొలకరి జల్లులు కురిస్తే దుక్కి దున్ని మెల్లగా గింజల్ని నాటితే , నవంబర్ డిశంబర్ నెలలో పంట సేతి కొస్తుంది అని మా నాయన అనే వాడు. ఆ ఇంగ్లీసు నెలలు నా కర్దమయ్యేది గాదు . తెలుగు నెలలు అయ్యవార్లు నేర్పించినా ఒక రాగాన అర్థం అయ్యేది గాదు .
అర్థం కాలేదంటే ' మొద్దు ముండా కొడకా ' అని మా సారు తిట్టేవాడు .
సైత్రము , వైశాకము , జేట్టము , ఆసాఢము , శ్రావణము, బాత్రపదము , ఆస్వయుజము , కాత్తికము , మార్గశిరము, పుస్యము , మాగము, పాల్గున ము అని తప్పులు సెప్పేవాణ్ణి.
' క్రమం తప్పకుండా సెప్పినావు గాని సామీ , తప్పులు సెబుతున్నావు' అనే వాడు మా సార్.
ఎన్ని సార్లు మా సార్ నేర్పించినా నా నోరు తిరిగితే గదా ? . 'పెద్ద క్లాసులకు పొతే సరిగా సెబుతావులే ' అనే వాడు మా సారు.
మా నాయన్ని నేర్పించమని అడిగినా ఒక్క రోజు. ఆయన కొస్తే గదా నాకు నేర్పించే దానికి. అయన నోరు ఇప్పితే అన్ని బూతులే ! . ఆయప్ప సదివింది ఐదవ తరగతే ! .
'పెద్ద బాల సిక్ష అంతా గట్టం కొట్టినా , పదహార్లు సార్లు తిరగేసి చదివినా !' అని బొంకాలు పోతాడు మా నాయన.
అర్థం కాలేదంటే ' మొద్దు ముండా కొడకా ' అని మా సారు తిట్టేవాడు .
సైత్రము , వైశాకము , జేట్టము , ఆసాఢము , శ్రావణము, బాత్రపదము , ఆస్వయుజము , కాత్తికము , మార్గశిరము, పుస్యము , మాగము, పాల్గున ము అని తప్పులు సెప్పేవాణ్ణి.
' క్రమం తప్పకుండా సెప్పినావు గాని సామీ , తప్పులు సెబుతున్నావు' అనే వాడు మా సార్.
ఎన్ని సార్లు మా సార్ నేర్పించినా నా నోరు తిరిగితే గదా ? . 'పెద్ద క్లాసులకు పొతే సరిగా సెబుతావులే ' అనే వాడు మా సారు.
మా నాయన్ని నేర్పించమని అడిగినా ఒక్క రోజు. ఆయన కొస్తే గదా నాకు నేర్పించే దానికి. అయన నోరు ఇప్పితే అన్ని బూతులే ! . ఆయప్ప సదివింది ఐదవ తరగతే ! .
'పెద్ద బాల సిక్ష అంతా గట్టం కొట్టినా , పదహార్లు సార్లు తిరగేసి చదివినా !' అని బొంకాలు పోతాడు మా నాయన.
మా పల్లిలో జనవరి సంకురాత్రి పండగ రోజు నుండి మళ్ళీ వానలు పడే దాకా ఏమి పనులుండవు జనాలకి. ఊరకే రచ్చ బండ కాడ కూర్చొని , బీడీలు తాగుతూ లోకాభి రామాయాణం మాట్లాడు కొంటా ఉంటారు. పొద్దు పోక కొందరు పేకాట ఆడతా ఉంటారు . అదేందో ఇడిసిపెట్టే ఆకుల ఆట అనే వాళ్ళు. పొద్దు పోలేదని ఆ ఆట వ్యసనం కింద అయిపోయి , స్యానా మంది దుడ్లు పోగొట్టుకున్నారు. ఆస్తులు గూడా అమ్మేసుకోని పిలేటికి, తిరపతికి పోయి , పేకాట ఆడే వాళ్ళు. ఇంట్లో ఆడోల్లు ఒక్కటే ఏడుపు.
మా అమ్మ మా నాయనకు ముందు గానే స్ట్రాంగ్ వార్ణింగు ఇచ్చింది. పిల్లోడు బతుకు నాశనం సెయ్యొద్దు అని. పేకాట , తాగుడు సెయ్యనని నా మీద పెమానం సేయించుకోనింది మా యమ్మ. మా నాయన్నీ ఎట్లనో ఒకట్ల పేకాట ఆడించాలని స్యానా మంది పిలిసే వారు. కానీ మా యమ్మ కిచ్చిన పెమానానికి భయపడే వాడు మా నాయన.
నేను ఆ అట ఎట్లా ఆడతారో అని అక్కడకు బోయి తొంగి తొంగి చూసే వాడ్ని. ' రేయ్ సామి , రారా ఆడదాము .. మీ నాయన్ని పి లుసు కొని రా !' అనే వాళ్ళు .
నాకు బయ మెత్తుకొని ఒక్కటే పరుగు .
నాకు బయ మెత్తుకొని ఒక్కటే పరుగు .
నేను కొంచెం పెద్దయినాక తిరుపతి ఎంకన్న మీద పేమణికమో ఏమో , నాకు ఆ ఆట ఆడేదానికి రానే లేదు . మా ఆస్తులన్నీ తగల బెట్టనే లేదు.
ఒక్క రోజు నేను , మా నాయన ఇంట్లో కూసోని ఉంటే నాగిరెడ్డన్న రొప్పుకొంటూ వచ్చినాడు. ఆయప్ప ఒక్కటే గస పోతా ఉన్నాడు.
''ఏమయ్యిది నాగిరెడ్డి ? ఎందుకలా గస పోసు కొంటా ఉండావు ? ఇందా .. నీళ్లు తాగు?'' అని కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చి నాడు మా నాయన.
'' ఏమి లేదన్న .. మా అమ్మికి బొత్తిగా ఒళ్ళు బాగా లేదు . ఒక్కటే జ్వరము. బేదులు , వాంతులు .మహల్లో సర్దార్ ఖాన్ ఆసుపత్రి కి తీసుకోని పోవల్ల. లేకుంటే అమ్మి నాకు దక్కదన్నా '' అని మా నాయన చేతులు పట్టుకొని ఏడ్సినాడు నాగిరెడ్డి .
'' నేనేమి సేయాల నాగిరెడ్డి . బండి ఎద్దులు రడీ గా ఉండాయి. నేను తోడు వస్తాను .పదా మాలుకి ' అన్న్యాడు మా నాయన.
''నా ఎద్దల బండి ఉందన్నా ! నాకు అర్జెంటు గా ముప్పై రూపాయలు గావాల ! అమ్మిని ఆసుపత్రికి తీసుకోని బోవల్ల. ఇంట్లో దుడ్లు లేవు. దుడ్లు నీకు రేపు బుధవారం సంతలో కూరగాయలు అమ్మి నీకు ఇచ్చేస్తా ! ఈ సహాయం సెయ్యన్నా !. నీ కాళ్ళు పట్టుకొంటాను . అమ్మి పరిస్థితి స్యానా గోరంగా ఉంది. '' అన్న్యాడు నాగిరెడ్డన్న ఏడుస్తూ .
మా నాయనకి దుక్కం ఆగింది గాదు . ఎంటనే ఇంట్లోకి పోయి ట్రంకు పెట్టలో ఉన్న ముప్పై రూపాయలు తెచ్చి ఇచ్చినాడు .
నాగిరెడ్డన్న దుడ్లు తీసుకొని ఒక్కటే పరుగు .
'' పాపం .. ఆ అమ్మికి ఎట్లా ఉండాదో ఏమో ! '' అని మా నాయన గుడ్ల నీరు తుడుసు కొన్నాడు.
ఈ కథంతా జరిగినప్పుడు మా యమ్మ ఇంట్లో లేదు. అప్పుడే సేన్లోకి బోయి పశువుల మేత కోసం పచ్చిగడ్డి మోపు నెత్తిన బెట్టుకొని వచ్చింది .
నేను జరిగిన కథంతా మా యమ్మకు పూస గ్రుచ్చినట్లు సెప్పినా .
మా యమ్మ గంగమ్మ తల్లి పూనకం వచ్చినట్లు ఒక్క ఎగురు ఎగిరింది.
' ఏమయ్యా .. నువ్వు తెలిసి తెలిసి నాగిరెడ్డికి అప్పు ఇచ్చినావు. అతను ఎలాంటి వాడో నీకు తెలీదా ?'' అని ముక్కు సీ మిడి కొంగుతో తీసుకోని ఏడ్చేదానికి రెడీ అయింది.
' పాపం నాగిరెడ్డన్న వాళ్ల అమ్మికి బాగాలేదు. సహాయం సేస్తే తప్పేమి? రేపు మహాల సంతలో అప్పు తిరిగి ఇచ్చేస్తా నన్యాడు ' అన్న్యాడు మా నాయన.
''నాగిరెడ్డన్న కథ నీకు తెలియంది గాదు . తిరుగు బోతు . తాగు బోతు . పేకాటలో ఆస్తులన్నీ తగల బెడుతున్నాడంట '' అన్నింది మాయమ్మ .
'' అదంతా యేమి లేదు గాని.. బుధ వారం సంతలో ఇస్తా డ్లే ! అన్యాడు మా నాయన.
ఆ రాత్రంతా మా నాయనకు, మా అమ్మకు నిద్ర పట్టనే లేదు.
-------------------------------------------------------------------------------------------------------------------
బుధ వారం మహల్ సంతలో నాగిరెడ్డన్న కోసం ఎంత వెతికినా కనబడనే లేదు .
ఒక నెల , రెండు నెలలు అన్న జాడే లేదు. మా నాయనకు కనబడకుండా తప్పించు కొని తిరుగతా ఉండాడు.
మా నాయన కాళ్లకు బలపం కట్టుకొని తిరగతా ఉండాడు.
''మహాల్ క్రాస్ రోడ్ లు ఇసిపెట్టే ఆకులు ఆడతా ఉండాడన్న . అక్కడకి బోతే మీకు దొరుకు తాడు '' అన్న్యాడు మా సాకలి ఎంకట్రాముడు .
''మహాల్ క్రాస్ రోడ్ లు ఇసిపెట్టే ఆకులు ఆడతా ఉండాడన్న . అక్కడకి బోతే మీకు దొరుకు తాడు '' అన్న్యాడు మా సాకలి ఎంకట్రాముడు .
పరుగెత్తుకొని మా నాయనా , నేను ఎల్లినాము.
అక్కడ నాగిరెడ్డన్న పేకాట ఆడతా ఉండాడు .
''ఏమయ్యా ..పెద్ద మనిషి .. అప్పు తీసుకోని ఎగ్గొడతావా ? అమ్మి పేరు సెప్పి పేకాట ఆడతా ఉండావా? నా దుడ్డు నాకిస్తావా ? లేకుంటే ఊర్లో పంచాయితీ పెట్టించ మంటావా ? '' మా నాయన కోపంగా అరచినాడు నాగిరెడ్డన్నను.
'' అన్న .. కోపం చేసుకోకు ... రేపు సాయంకాలం నీ అప్పు తీర్చేస్తా .. ఇక్కడ గలాటా సెయ్యకు .నా మానం బోతుంది. నీ అప్పు ఎగ్గొట్టను లే అన్నా ''
అని మా నాయన రెండు సేతులు పట్టుకొన్యాడు నాగిరెడ్డన్న .
---------------------------------------------------------------------------------------------------------------
పది రోజులయినా నాగిరెడ్డి పత్తా లేడు
ఒక రోజు సాయంకాలం వాళ్ళ మడిలోని బావి కాడ కపిలతో నీళ్లు చేదు తున్న నాగిరెడ్డన్న ను కలిసినాడు మా నాయన.
ఏమి గలాటా అయ్యిందో ఇద్దరు రక్తం వచ్చేటట్లు కొట్టుకున్నారు అంట మా నాయన , నాగిరెడ్డన్న .
ఇంటికి వచ్చిన మా నాయన్ను చూసే సరికి మా యమ్మ , నేను ఒక్కటే ఏడుపు. రక్తం కారే సేతులు , ఎర్రగా వాసిన సెంపలు. ఇద్దరూ బాగా కొట్టుకొన్నట్లు ఉండారు. .
అమ్మ ఎదో ఆకు పసర్లు , పసుపు తెచ్చి రుద్దుతోంది.
అమ్మ ఒక్కటే శాపనార్థాలు.
''వద్దంటే ఇస్తివే. మనకే ఎందుకీ అవస్థ బగమంతుడా '' అని పాట పాడుతున్నట్లుగా ఏడుస్తోంది .
----------------------------------------------------------------------------------------------------------------------
తెలవారుతూనే ఒక భయంకర వార్త ఇనాల్సి వచ్చింది మాకు.
'' ఏందంటే నాగిరెడ్డన్న వాళ్ళ బాయిలో దూకి సచ్చి పోయినాడంట . ఎవరో రాళ్లతో కొట్టి సంపేసినారంట ''
పల్లిలో ఎక్కడ సూసినా జనాలు ఇదే మాట్లడుకొంటా ఉండారు.
'' నీ మొగుడే సంపేసి నాడంటనే ఎంకట లక్ష్మి .. పల్లిలో అందరు అనుకొంటా ఉండారు '' అంది పక్కింటి అత్తమ్మ .
అమ్మకు, నాయనకు ఒళ్ళంతా కంపరం మెత్తింది . గడ గడ మని వణికి పోతున్నారు. వాళ్లను చూసి నాకు ఒక్కటే గుక్కిళ్లు తిప్పుకోకుండా ఏడుపు.
'' మా ఆయనకు ఏమీ తెలీదత్తా .. నిన్న కొట్టు కొన్నారు అంట ఆ బావి కాడా '' అంది మా యమ్మ ఏడుస్తా.
'' ఏమో నమ్మ .. ముప్పయి రూపాయలు బాకీ ఉండా డని నీ మొగుడు నాగిరెడ్డిని సంపేశాడని అందరు అనుకొంటా ఉండారు . కలకడ నుండి పోలీసోళ్ళు వచ్చేదాకా ఏమి తెలీదంటా ' అంది అత్తమ్మ .
పోలీసోళ్ళు అనగానే మా నాయన తెలివి తప్పి కింద పడి పాయ. మా యమ్మ ఏడ్సుకొంటా ముగాన నీళ్లు సల్లే.
నేను ఏడ్సుకొంటా '' నాయనా లెయ్యి.. మనకేమి కాదులే '' అన్యాను.
మా నాయన నన్ను హత్తుకొంటూ సిన్న పిల్లోడిలా ఏడ్సినాడు .
---------------------------------------------------------------------------------------------------------------------
నాలుగైదు రోజులయినా మేము ఇల్లే ఇడిసి బయటకు రాలా.
పోలీసోళ్ళు వచ్చి మమ్మల్ని కలకడ పోలీసు టేషన్ కి తీసుకెళ్తారేమో అని బయ్యం.
సాకలి ఎంకట్రాముడు ఏట్లోగుడ్డలు ఉతకడానికి ఇంటికి వచ్చాడు .
'' గుడ్డలున్నాయా అమ్మా ? '' అని కింద కూసోని అన్న్యాడు . అమ్మ పెద్ద మాసి పోయిన గుడ్డల మూట ముందర తెచ్చి పెట్టింది.
'' ఒక్కటి .. రెండు .. మూడు .. '' సాకలి ఎంకట్రాముడు లెక్క ఏసుకొంటున్నాడు గుడ్డల్ని .
'' గుడ్డలున్నాయా అమ్మా ? '' అని కింద కూసోని అన్న్యాడు . అమ్మ పెద్ద మాసి పోయిన గుడ్డల మూట ముందర తెచ్చి పెట్టింది.
'' ఒక్కటి .. రెండు .. మూడు .. '' సాకలి ఎంకట్రాముడు లెక్క ఏసుకొంటున్నాడు గుడ్డల్ని .
అమ్మ ఉండ బట్ట లేక నాగిరెడ్డన్న ఇసయం అడిగింది.
ఎంకట్రాముడు నవ్వేసి '' నాగిరెడ్డన్న సావా లేదు ..గీవా లేదమ్మా ! అప్పులు ఎక్కువ చేసి అట్లా పుకారు పుట్టిచ్చాడంటా .. ఎక్కడో మదన పల్లి తాగి తందానా లాడతా ఉండాడంట ''
అమ్మయ్య.. అని ఊపిరి పిల్సుకోని సచ్చినాము మేము .
అంతే .. నాగిరెడ్డన్న ఊర్లోకి వచ్చినా మేము అప్పు అడగానే లేదు.
నాగిరెడ్డన్న అప్పు బాకీ ఇస్తానని సెప్పలేదు. దర్జాగా సిల్కు జుబ్బా ఏసుకొని తిరుగుతున్నాడు నాగిరెడ్డన్న .
మా ముప్పై రూపాయలు మావి కావు అని అనుకొన్న్యాము .. అంతే !
-------------------------------------------------------------------------------------------------------------
(ఈ కథ కేవలం యాదృచ్చికమైనా , ఇందులోని సంఘటనలు, పేర్లు , పాత్రలు ఎవ్వరిని ఉద్దేశించి రాసినది గాదు . ఎవ్వరినీ నొప్పించ డానికి రాసినది గాదు . నా జీవితంలో జరిగిన ఒక్క చిన్న సంఘటన ఆధారంగా రాసిన కథ మాత్రమే !)