Monday, July 3, 2017

ఊరవతల సమాధి

ఊరవతల సమాధి 
------------------------------

కట్టెల పొయ్యిలో ముఖం దూర్చి 
అన్నం కుండను ఉడికించిన అమ్మ 
పొగ పీల్చిన గుండెతో 
అస్థి పంజర మైన అమ్మ 
అర్థాకలితో తాను అలమటిస్తూ 
మా కడుపులు నింపిన అమ్మ 
గడ్డి దుప్పటి కప్పుకొన్న చూరిల్లు పైకి 
ఎగ బాకుతున్న పొయ్యి పొగ సాక్షిగా 
అమ్మ నవ్వడమే మాకు తెలుసు 
కన్నులొత్తుకొంటున్న ఆమె చీర కొంగు పిండితే 
ఒక్క బతుకుని నింపిన కన్నీటి కాలువలు 
అడవికి పోయి ఏరుకొన్న ఎండు పుల్లలు 
ఆమె ముఖం మీద నెత్తుటి చారికలై గీకుతున్నా
అమ్మ ముఖం లో నవ్వుల పూలు పూచేవి 
బురద మడిలో కలుపు మొక్కలు పీకిన అమ్మ
వంగిపోయిన నడుము సాక్షిగా 
మా బతుకుల్లో అమ్మ ఎన్నెల్లు నింపింది 
ఆమె కళ్ళు దుఃఖపు సాగరాలు 
అవి మాకు అంతు చిక్కని రహస్యాలు 
ఆమె ముడతలు పడిన చర్మం 
కష్టాల కొలిమిని ఊదే తోలు తిత్తి 
ఆమె పాదాల పగుళ్లు 
దరిద్రాన్ని పగల గొట్టే నాప రాళ్లు 
తల్లి ప్రేమ మాకర్థ మయ్యే లోపల 
ఆమె ఊరవతల సమాధి అయింది 
అప్పుడు అర్థమయ్యింది మాకు 
ప్రతి కాయలు కాచే చెట్టుకూ 
ఒక తల్లి వేరు ఉంటుందని !!

రచన : వారణాసి భానుమూర్తి రావు 

( 02. 07 . 2017 నాడు ప్రజా శక్తి  పత్రిక లో  ప్రచురితము )

No comments:

Post a Comment