ఓం గణే శాయ నమః
----------------------------------------------------------------------------------------
పెద్ద కొడుకు
రచన : వారణాసి భాను మూర్తి రావు
---------------------------------------------------------------------------------------
అది తిరుపతి రైల్వే స్టేషన్ .
ఎప్పటిలాగే ప్రయాణీకులతో రద్దీగా ఉంది . ఇసుక వేస్తె రాలనంత జనం హడావుడిగా పరుగెత్తుతున్నారు . కొండకు వచ్చే భక్తులతో రైల్వే స్టేషన్ కిట కిట లాడుతూ ఉంది . రైలు ఇంజన్ల కూతలతో , మైకుల ద్వారా అనౌన్సర్ల ఇచ్చే సందేశాలతో , లగేజీ లు మోసుకొని ' జరుగు , జరుగు ' అని తోసుకొని పోయే పోర్టర్లుతో , వెంకన్నకు తలనీలాలు సమర్పించి బోడి గుండులతో కన బడే భక్తులతో , ముసలి ముతకలతో , పిల్లా జెల్లలతో చాలా కోలా హలంగా ఉంది .నేను గత ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా - తిరుపతి రైల్వే స్టేషన్ . అప్పుడూ అదే సందడి - ఇప్పుడూ అదే సందడి .
నేను బి కామ్ , ఎం కామ్ చదివింది తిరుపతి లోనే ఇరవై ఏళ్ల క్రితం . తిరుపతి రైల్వే స్టేషన్ అంటే నాకు వల్ల మాలిన అభిమానం . నేను చదువు కొనే రోజుల్లో చాలా సార్లు అలా స్టేషన్ లో వచ్చి కూర్చొని వచ్చే పొయ్యే వాళ్ళను చూస్తూ టైం పాస్ చేస్తూ ఉండే వాడిని . వచ్చే పొయ్యే రైళ్ళను చూస్తుంటే దైవ దర్శనానికి తీసుకెళ్ళే సర్ప రాజుల్లా ఉంటాయి . కొండకి వద్దంటే లక్షల్లో జనాలు తిరుపతికి వస్తారు . దేశ విదేశాల నుండి గూడా వచ్చి నిరంతరం ఆయన దర్శించు కొంటూనే ఉంటారు. తిరుపతి వెంకన్న గొప్పతనం అలాంటిది .
ఉద్యోగ రీత్యా హైదరాబాదు లో స్థిర నివాసమున్నా , జన్మతః రాయల సీమ వాసిని . తిరుపతి దగ్గర ఒక పల్లెటూర్లో పుట్టాను . చదువుకొనే రోజుల్లో నెల కోక్కసారి కాలినడకన అలిపిరి గుండా కొండకు వెళ్ళే వాళ్ళం . పరీక్షల్లో పాస్ అయితే తప్పని సరిగా తలనీలాలు సమర్పించు కొనే వాణ్ని . దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ గుండు చేయించు కొన్నాను . కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించిన తర్వాత ఎంతో ఆత్మ సంతృప్తి కలిగింది నాకు . నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రావడానికి ఇంకా ఒక గంట టైం ఉంది . శ్రీమతి నా ప్రక్కనే కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుతొంది. థర్డ్ ఎ సి బోగీ ఎదురుగా కూర్చొన్నాము.
వాచీలో టైం ఐదు గంటలు అవుతోంది .
అంతలో ఒకాయన పిగిలిపోయి , మాసి పోయిన తెల్ల పంచె , చిరుగులు పడిన తెల్ల చొక్కా వేసుకొని నా వైపే తదేకంగా చూస్తున్నాడు . ఎవరో బిక్ష గాడనుకోన్నాను . ఆయన ముఖం లొట్టలు పోయి , కళా విహీనంగా ఉంది . పెదాలు ఎండి పోయి , చీలి పోయి నిర్జీవంగా ఉన్నాయి . క్షుర కర్మ గూడా చేసుకొన్నట్లు లేదు . తల స్నానం లేక తల వెంట్రుకలు దుమ్ము పట్టినట్లుంది . సుమారు అరవై ఏళ్ళ వాడిలా ఉన్నాడు . కాళ్ళకు చెప్పులు లేవు . ఏదో బాధలో ఉన్నట్లు ఉన్నాడు . నన్ను చూస్తూ అలా ఇలా పచార్లు చేస్తున్నాడు . నేను అతని వైపే చూస్తున్నాను . అతన్ని ఎక్కడో చూసి నట్లు అన్పిస్తోంది .
'' టైం ఎంత సార్ ? '' అన్నాడు అతను .
'' ఐదు అయింది '' అన్నాను నేను నా ఐదు చేతి వేళ్ళను చూపిస్తూ
''హైదరాబాదు వెళతా ఉండారా ?''
''అవును ''
''నీ పేరు ... నీ పేరు మూర్తి గదూ ? మీ ఊరు రాస పల్లి గదూ ? ''సంశయంగా అడిగాడు అతను .
''అవును .. నీ కెట్లా తెలుసు ?'' అన్నాను నేను ఆశ్చ్యరంగా .
''మీరు కరణాలు .... సాములు గదూ ? మీ నాయన పేరు కిట్ట మూర్తి గదూ ?'' అన్నాడు అతను . అతని ముఖం లో నవ్వు కన బడింది నాకు .
నేను చాలా ఆశ్చర్యంగా '' అవును .. అవును '' అన్నాను .
''నేను ... నేను .. గోవింద రెడ్డిని .. సామీ .. గుర్తు పట్టలేదా ? ఇందాకట్ని నిన్ను సూస్తానే ఉండాను . ఓరి నీ ఫాసుంగులా ! గుర్తు బట్ట లేక బోతా ఉండాను. తమ్ముళ్ళు , సెల్లెల్లు అంతా బాగా ఉండారా సామీ !''అన్నాడు ఆప్యాయంగా ఆ ఆసామీ .
నా దగ్గర కొచ్చి నా రెండు చేతులూ పట్టు కొన్నాడు పట్టలేని సంతోషంతో
''నువ్వు ... గోవింద రెడ్డివా ..ఇక్కడ ఏం చేస్తున్నావు ?'' అన్నాను నేను లేచి నిలబడి .
''నేనా ...నేను .. ఈ టేషన్ లో అడుక్కొని బతుకు తుండాను సామీ !'' అన్నాడు అతను వచ్చే దుఃఖాన్ని ఆపుకోంటూ .
''ఎమిటి ... యాభై ఎకరాల భూస్వామి అడుక్కొని తింటున్నావా ?నీ కెందుకీ అగత్యం పట్టింది ?'' అన్నాను నేను చాలా ఆశ్చర్యంగా .
అతని కళ్ళల్లో కన్నీళ్ళు సర్రున క్రిందకు జారాయి .
''సామీ ! మీరంతా సదువు కొనేటప్పుడే మనూరు బాగుండే ! మీ తాత కరణం పని సేసేటప్పుడే మనూరు సల్లగా ఉండేది .ఎవరికి అన్నాయం సేసే వోడు గాదు మీ తాత . కరణాల పని మీ దగ్గర నుండి పీకేసి నప్పటి నుండి మన ఊరికి దరిద్రం సుట్టుకోనింది . ఇప్పుడుండే కరణానికి లెక్కలు రావు . గొలుసు పట్టుకోని సర్వే సేసే దానికి రాదు . ఏ భూమి ఏ సర్వే నంబర్ లో ఉండేది అసలు తెలీదు . మళ్ళి కరణం సాముల్నే పిలిపించు కోవల్ల . మన పబుత్వం చాలా తప్పు పని చేసింది కరణాలను ఊడబెరికి .'' అన్నాడు గోవింద రెడ్డి ఆవేశంగా .
అవును , అప్పటి ప్రభుత్వం మండలాలుగా విభజించి , అధికార వికేంద్రీ కరణ చేసింది కొన్ని నూతన సంస్కరణలు చేబట్టింది . ఆ దశలో కరణీకాల్ని , మునసబుల్ని రద్దు చేసి చాలా కాల మయింది . ఇప్పుడు కరణాలుగా ఎవ్వరూ లేరు . ఉన్న కరణీ కాలను పోగొట్టుకొని చాలా మంది అగర్భ దరిద్రంతో మరణించారు . కొంత మంది కొత్తగా నియమింప బడ్డ ఆఫీసర్ల దగ్గర జీతానికి పని చేస్తున్నారు .అదంతా పాతికేళ్ళ ముందు మాట . మా తాత గారు గూడా కరణీకం పోయిందనే దిగులతో మరణించారు . అదృష్టం గొద్ది మా నాన్న చదివించాడు గాబట్టి , నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను
''సరే... .గతం గతః .. గోవిందరెడ్డి .. నువ్వు బాగా బతికిన రైతువు గదా .. ఎందుకిలా ఈ రైల్వే స్టేషన్ లో అడుక్కొంటున్నావు ?''అన్నాను నేను .
గోవింద రెడ్డి ఈ సారి రెండు చేతులు ముఖానికి కప్పుకొని ఏడ్సేశాడు .
'' నీకు తెలుసు గదా సామీ ... నాకు ముగ్గురు కొడుకులు , ఇద్దరు కూతుళ్ళు . అందర్నీ నా సక్తి కాడికి బాగా సదివించా . కూతుళ్లకి లచ్చల్లొ కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు సేసినా ! పెద్దోడు అమెరికా పోవల్లని పది ఎకరాలు అమ్మేసి ఎల్లిపాయే . రెండవ కొడుకు పది ఎకరాలు అమ్మేసి దుబాయి లో యాపారం సెయ్యల్లని ఎల్లిపాయే . ఇగ మూడవ వాడు పెళ్ళాం మాటలు ఇని పది ఎకరాలు రాయించ్కొని మదన పల్లి లో వేరే కాపురం పెట్టినాడు . ఇగ ఉండే ఇరవై ఎకరాలు దస్తావేజులు బాంకులో పెట్టి ఐదు లక్షలు అప్పు చేసి కూతుళ్ళ పెళ్లి సేసినాను . ఆ అప్పు తీర్చే స్తోమత లేక బాంకొల్లు వేలం ఏసి భూముల్ని అమ్మేస్తా మంటా ఉండారు సామీ ! ఆ దిగులతో నా బార్య సచ్చెపాయ . కొడుకు లెవ్వరూ ఒక రోజు పిలిసిన పాపాన పోలేదు . ఒక రోజు అయినా పిలిచి అన్నం పెట్టలేదు . ఈ వయసులో ఇంత బతుకూ బతికి అడుక్కొనే స్తితికి దిగజార్సినారు సామీ నా కొడుకులు... దొంగ నా కొడుకులు .. థూ .. వాళ్ళది ఒక బతుకేనా ?'' అన్నాడు గోవింద రెడ్డి చాలా బాధగా .
''బాంకులో తీసుకొన్న పైకం ఏమైనా తిరిగి చెల్లించావా ?'' అడిగాను నేను .
''నాకు ఆదాయం ఎక్కడిది సామీ ? ఏసిన పంటలు అట్లనే ఎండిపోతాయి . వానలు లేవు . పంటలు లేవు . రాయల సీమ లో రైతులు చాలా కట్టాల్లో ఉండారు . సేనిక్కాయల పంట సరిగా జూసి పదేళ్ళు అయితా ఉండాది . మళ్ళు సుద్దామంటే నీళ్ళు ఉంటే గదా పండే దానికి . బాంకోళ్ళు అసలు , వడ్డీ కట్టక పొతే భూముల్ని జప్తు చేసి , అరెస్ట్ గూడా సేస్తామంటున్నారు . ఎకరా భూమి అమ్ముదామంటే కొనే నాథుడే లేడు . ఊరికే ఇస్తే గూడా తీసు కోనే వోళ్ళు లేరు సామీ '' అన్నాడు గోవింద రెడ్డి .
అవును . గోవింద రెడ్డి చెప్పింది అక్షరాలా నిజం . వర్షాలు పడక , భూమిలో నీళ్ళు లేక భూములన్నీ బీడు బట్టి ఎడారుల్లాగా మారి పోయినాయి . గిట్టుబాటు లేక రైతులు సేద్యం చెయ్యడం మానేశారు .పిల్లలు కాస్తో కూస్తో చదువుకొని ఊరొదిలి వెళ్ళి పొయ్యారు . ఇప్పడు ముసలి ముతక తప్ప పల్లెల్లో ఎవరూ ఉండడం లేదు . పల్లెలన్నీ స్మశానాల్ని తలపించే విధంగా ఉంటాయి రాయల సీమ లో .
'' బాధ పడితే మనం చెయ్యగలిగింది ఏమి లేదు గోవింద రెడ్డి '' అంటూ మా శ్రీమతికి గోవింద రెడ్డి ని పరిచయం చేశాను .
''బాగున్నారా ?'' అంది మా శ్రీమతి .
''ఏమి బాగో ఏమో అమ్మా ... సామికి తెలుసు మా బాగు ..పిల్లొల్లంతా బాగుండారు గదా అమ్మా ?''
గోవింద రెడ్డి కథ విన్న తర్వాత ఆయన దైన్య స్థితికి నా మనస్సు అల్ల కల్లోలం అయింది . అలజడి తో నా కళ్ళళ్ళొ నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి . పైకి ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకొనే ప్రయత్నం చేస్తున్నాను .
గోవింద రెడ్డి నన్ను చిన్నపుడు వీపు మీద ఎక్కించుకొని ఆట లాడించే వాడు . నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం .
మహల్ కో , కలకడ కో వెళ్ళితే నా కోసం స్వీటో , ఫలమో తీసుకోని ఇచ్చే వాడు . మా నాయన క్లాస్ మేట్ గోవింద రెడ్డి .
అందుకే నేనంటే అంత ఇష్టం ఉండేది . వాళ్లింట్లో కారాలు , సుట్టలు , పప్పు బిళ్ళలు , పాగం పప్పు లాంటి అప్పచ్చులు చేసినా నా కిచ్చే వాడు . కనుమ పండుగ రాజయితే దోసెలు , సేనిగ్గింజల ఊరిమిండి వేసి ఆప్యాయంగా తిని పించే వాడు .
భగవంతుడు ఎంత పక్ష పాతి ? రెక్కలు ముక్కలు చేసుకొని ప్రతి క్షణం కన్న బిడ్డల కోసం ఆరాటపడి , వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే తల్లి తండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారే కడుపున పుట్టిన పిల్లలు. పసివాళ్ళుగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక తల్లి తండ్రులకే పగ వాళ్ళుగా ఎందుకు మారుతారో ?
చదువు ఉన్నదనే ఆహంకారమా ?డబ్బున్నదనే అహంభావమా ?తల్లి తండ్రి నిరక్ష రాస్యులే కావచ్చు . భూమిని నమ్ముకొన్న రైతు బిడ్డలే కావచ్చు . మొరటు వాళ్ళే గావచ్చు . కాని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే ఈసడించు కొంటే వారి గతి ఏమి కావాలి ? ప్రతి రక్తపు బొట్టు వారి శ్రేయస్సు కే ధారపోసిన తల్లి తండ్రులకా ఈ దురవస్థ ? నడి రోడ్డులో అనామకుడిగా , నా అనే వారు లేక , దిక్కు మొక్కు లేక యాచకుడిగా మారిన గోవింద రెడ్డి లాంటి వారి పరిస్థితి ఏమిటి ? జన సంబంధాలన్నీ ధన సంబంధాలేనా ??
నా గుండె వేగంగా కొట్టు కొంటుంది . నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి . గోవింద రెడ్డి ని పిలుచుకొని పోయి పళ్ళు , బిస్కేట్లు , నీళ్ళ బాటల్ కొనిచ్చాను . పర్సు లోంచి తీసి ఒక ఐదు వందల రూపాయల నోటు చేతిలో ఉంచాను . మొహమాటంగా అతను వద్దన్నా జోబిలో నోటును కుక్కినాను .
'' గోవింద రెడ్డి ! నువ్వేమీ భయ పడ వద్దు . బాంక్ వాళ్ళతో మాట్లాడి , నీ భూమిని విడిపించే మార్గం ఆలోచిస్తాను .
హైదరాబాద్ కెళ్ళి డబ్బు విషయం చూస్తాను . నిన్ను మళ్లి పాత గోవింద రెడ్డి గా చేస్తాను '' అన్నాను నేను .
''సామీ .. నా పెద్ద కొడుకు గూడా ఇంత దైర్నం చెప్పలేదు నాకు ''అని నా రెండు చేతులు పట్టుకొని ఏడ్చినాడు గోవింద రెడ్డి .
******************
ఆంధ్రా బాంక్ హెడాఫీసు లో నా ఫ్రెండ్ ఒకడు జిఎమ్ హోదా లో పని చేస్తున్నాడు . వాడితో మాట్లాడి కలకడ బ్రాంచి కి ఫోన్ చేయించి నాను . గోవింద రెడ్డి కట్ట వలసిన అప్పు వడ్డీతో సహా అన్ని మినహాయింపులు పోను రూ . 268311/- అన్నారు. నేను నా అక్కౌంట్ నుండి డ్రా చేసి డిమాండు డ్రాఫ్టు ద్వారా కలకడ బ్రాంచ్ కి పంపించాను . గోవింద రెడ్డి అప్పు క్లియర్ అయింది .
ఇరవై రోజుల తర్వాత గోవింద రెడ్డిని కలకడ కి రమ్మని చెప్పి , నేను బస్సులో కలకడలో దిగినాను . గోవింద రెడ్డి కి సంబంధించిన తనఖా పత్రాలన్నింటిలో సంతకాలు చేయించి , భూమికి సంబంధించిన దస్తా వేజులన్నింపంటలు టిని విడిపించి ఇప్పించి నాను . గోవింద రెడ్డి సంతోషానికి అవధులు లేక పోయింది . ఇరవై ఎకరాల భూమి అతని స్వంతమయింది .
'' గోవింద రెడ్డి .. నువ్ ఇక తలెత్తు కొని ఊర్లో తిరగాలి . మునపటి లాగా పెద్ద రాయుడి లా బతకాలి . నేను వ్యవసాయాధి కారులతో మాట్లాడి నీకు విత్తనాలు వగైరా సబ్సిడీ తో ఇప్పిస్తాను . అలాగే స్ప్రిం క్లర్ ఇరిగేషన్ తో నువ్వు సేద్యం
చేద్దువు గానీ !'' అన్నాను నేను .
''నువ్వు వెయ్యేళ్ళు బతకాలి మహారాజా '' అని దీవించాడు గోవింద రెడ్డి
*****************
అనుకోన్నట్లుగానే గోవిందరెడ్డి తన పొలంలో టమోటా ,వంకాయ , బెండ కాయ , గుమ్మడి లాంటి కూరగాయలు , తమల పాకులు , అరటి తోటలు పెంచ సాగాదు. బోర్ వేసిన వేళా విశేషమో ఏమో గాని , నీళ్ళు బాగానే పడ్డాయి . సూక్ష్మ సేంద్రియ విధానంతో మంచి వాణిజ్య పంటలు పండించ సాగాడు . ఊర్లో మళ్ళి గోవింద రెడ్డి పరపతి బాగా పెరిగింది . పది మంది కూలీలు వద్దంటే పలుకు తున్నారు . అంతా డబ్బు మహిమ . నేను అప్పుడప్పుడు వ్యవసాయ అధికారులతో మాట్లాడి సాగు లోని మెలుకువ లన్ని తెలుసుకొని , తగిన జాగ్రత్తలు అన్ని చెప్పి, మంచి దిగుబడి వంగడాలను చెపుతూ గోవింద రెడ్డిని ఒక ఆదర్శ రైతు గా తీర్చి దిద్దినాను ఒక్క సంవత్సరంలో . మదన పల్లి, తిరుపతి ,బెంగుళూరు మార్కెట్ లలో వచ్చిన దిగుబడి నంతా అమ్మ వలసిందిగా , దానికి కావాల్సిన వనరులన్నీ సరి చేసి పెట్టాను . ఒక చిన్న ఆటో ట్రాలీ కొనుక్కోవడానికి పాతిక వేలు పంపించాను .
****************
ఒక్క సంవత్సరం తర్వాత
ఆ రోజు శని వారం . ఉదయం ఏడు గంటలు
హాల్లో కూర్చొని , పేపర్ తిర గేస్తూ , కాఫీ తాగుతున్నాను .
ఇంతలో కాలింగ్ బెల్లు మ్రోగింది . తలుపు తెరచి చూశాను .
చక్కని నాణ్యమైన గ్లాక్సో పంచె , కద్దరు చొక్కా , మీద ఒక కండువా , కొత్త చెప్పులు వేసుకొని ఆకర్షణీయంగా పరిశుభ్రమైన శరీరంతో వాకిట్లో ప్రత్యక్ష మయ్యాడు గోవింద రెడ్డి .
గోవింద రెడ్డి ని చూసి ఆశ్చర్య పొయ్యాను నేను . అనుకోకుండా వచ్చిన అతిధి ని చూసి లోపలికి రమ్మన్నాను .
'' సామీ .. బాగుండారా !'' అన్నాడు .పెద్ద సిమెంట్ గోనె సంచి నిండుకు కూరగాయలు , అరటి గెల , పూలు , పళ్ళు , స్వీట్లు బాక్స్ తో ప్రత్యక్ష మయ్యాడు గోవింద రెడ్డి .
'' ఇవన్నీ మన తోటలో పండినవే !'' నవ్వుతూ అన్నాడు గోవింద రెడ్డి .
శ్రీమతి ఆశ్చర్యంతో గోవింద రెడ్డి వంకే తదేకంగా చూస్తూ ఉండి పోయింది .
'' నీ దయ వల్ల మళ్ళి నేను నిల దొక్కు కొన్నాను సామీ !''
'' సరే .. ఇలా సడెన్ గా వచ్చేసావేమి ? '' అని అడిగాను .
''నిన్ను సూడల్లా అని అన్పించింది .వచ్చేశాను . '' అన్నాడు గోవింద రెడ్డి .
ఇంతలో గోవింద రెడ్డికి కాఫీ తెచ్చి ఇచ్చింది శ్రీమతి .
గోవింద రెడ్డి వెంటనే ఇంకొక మూట విప్పి , అందులోని కాగితాల సొరుగులో దాగిన నోట్ల కట్టల్ని బయటకి తీసి టీ పాయి మీద ఉంచాడు .
'' ఏమిటది గోవింద రెడ్డి ?'' అన్నాను నేను .
''ఈ సారి అరటి కాయల పలసాయం బాగా కలిసొచ్చింది . రేటు గుడా బాగా పలికింది . బెంగుళూరు లో అరటి లోడ్లు అమ్మేసి వస్తా ఉండాను . నాలుగు లక్షలు వచ్చింది . నీకు ఇవ్వాల్సిన పైకం వడ్డీ తో సహా ఈ నాలుగు లక్షలు తీసుకోండి.''
అన్నాడు కృతజ్ఞతా భావంతో గోవింద రెడ్డి .
నా ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది . భూమి తల్లిని నమ్ము కొన్న వాడు ఎన్నటికీ చెడిపోడని పెద్ద వాళ్ళు ఊరికే అనలేదు .
'' నువ్వు నా కివ్వ వలసిన పైకం 268311/- రూపాయలు మాత్రమే . వడ్డీ నేను తీసుకొను '' అని అన్నాను నేను .
అతనిచ్చిన డబ్బు నంత వరకే లెక్క బెట్టి , మిగిలిన దంతా జాగ్రత్తగా కాగితాల్లో చుట్టి పెట్టి గోవింద రెడ్డి కి వాపసు చేసినాను .
గోవింద రెడ్డి ఏమనుకోన్నాడో , ఏమో గానీ నా పాదాలకు నమస్కరించ బోయ్యాడు .
'' నా తండ్రి లాంటి వాడవు , నా కేల నమస్కారం చేస్తావు ?'' అన్నాను నేను అతన్ని వారిస్తూ .
'' ఈ రోజు నుండి నువ్వే నా పెద్ద కొడుకువి సామీ !' అన్నాడు
.
ఆయన గొంతులో మాటలు పెగలడం లేదు . రుమాలుతో కళ్ళను ఒత్తుకోంటూ బయలు దేరాడు గోవింద రెడ్డి .
--------------------------------------- The End ---------------------------------------------------------------------
pratilipi bhavagiti kathala poti-- got a special prize. 6000 readers and 100 comments stood highly regarded by readers as the best social story.