Wednesday, July 10, 2013

సమస్యా పూరణం

సమస్యల
రహస్యాలేంటో
ఇంతవరకూ
నా కర్థం కావడం లేదు
జీవిత మంతా
సమస్యల వలయమే
ఒక్కొక్క సమస్యా
జారుడు మెట్లలా
... వదల గొడుతుంటే
పిల్లాడొదుల్తున్న గాలి బుడగల్లా
మళ్ళీ పుట్టుకొస్తున్నాయి
దూది పింజల్లా
గాలిలోకి సర్రున ఎగురుతున్నాయి
ఆశల మిణుగుఱు పురుగులు
ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు
ఆ కటిక చీకట్లలో
అక్కడక్కడా వెలుతురు చుక్కలు
కనపడుతున్నాయి
ప్రతి సమస్యా
ఒక సీస పద్యమై
ఛందస్సు రాక
సమస్యా పూరణం చేత గాక
అసంతృప్తి పురాణాన్ని
వ్రాస్తూనే ఉన్నాను.

( నా సంకలనం 'సాగర మథనం' (2000 మార్చ్)' నుండి

No comments:

Post a Comment