ఆదివారం అగచాట్లు ( హాస్య కథ)
రచన : వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
15.11.2020
**********************************************
బ్రహ్మానందం రెండు పాల పాకెట్లు కొని 100 రూపాయలు ఇచ్చాడు. పాలు అమ్మే వ్యాపారి 50 రూపాయలు పట్టుకొని పరధ్యానంలో 150 రూపాయలు ఎక్కువ ఇచ్చేశాడు.
అది తెలిసి గూడా ఆ నోట్లను జోబీలో కుక్కుకొన్నాడు బ్రహ్మానందం. వెంటనే పూలు కొనుక్కోవడానికి వంద రూపాయల నోటు ఇచ్చాడు. పరధ్యానంలో పూల అమ్మాయి ఇచ్చిన చినిగి పోయిన 50 రూపాయల నోటు తీసుకొని జోబీలో పెట్టుకొని తరువాత చూసి బాధపడ్డాడు.
ఆ చినిగి పోయిన నోటును ఎలాగైనా ఎవరికైనా అంట గట్టాలని నిమ్మ పళ్ళు కొన్నాడు. వాడు పరధ్యానంలో ఆ చినిగి పోయిన 50 రూపాయల నోటును తీసుకొని పది నిమ్మపళ్ళకు ఇరవై పట్టుకొని 30 రూ.లు వాపస్ ఇచ్చాడు.
బ్రహ్మానందం అక్కడున్న దానిమ్మ పళ్ళను చూసి మూడు దానిమ్మ పళ్ళను కొన్నాడు. సంతోషంగా తన తెలివికి మురిసి పొయ్యాడు బ్రహ్మానందం. ఈ రోజు నక్కను తొక్కి వచ్చాడనుకొని సంతోష పడి పొయ్యాడు.
ఇంటికి వచ్చిన తను దానిమ్మ పళ్ళను కట్ చేస్తే అన్నీ పుచ్చులే..పనికి రానివి తగల గట్టాడు వాడు. అవన్నీ డస్ట్ బిన్ లో పడేశాడు.
" ఏమండీ పాలు విరిగి పొయ్యాయి..ఎప్పటి పాలో ఏమో ! ఫ్రెష్ పాలు తీసుకు రండి " అని శ్రీమతి వంటింట్లోంచి అరుపు.
పాంట్ జోబీలో పెట్టుకొన్న 500 రూపాయల కోసం వెతికాడు.. గుండె వేగంగా కొట్టుకొనింది.
" కనబడ లేదు..సుశీ ..నా జోబీలో 500 రూపాయల నోటు చూశావా? " అని గట్టిగా అరచాడు..."
లేదండీ ..నేను చూడ లేదు..మీ పరధ్యానం పాడు గానూ..ఆ రైతు బజార్ లో పోగొట్టు కొన్నారేమో! పోయి వెతకండి..లేదంటే ఏ పిక్ పాకెట్ గాడు కొట్టేశాడేమో " అంది శ్రీమతి బ్రహ్మానందం వైపు కొర కొర చూస్తూ..
" వెళ్ళి వెతికి వస్తా..ఎక్కడైనా పడి పోయిందేమో నని..ఈ రోజు లేచిన వేళా విశేషం బాగా లేదు. అన్నట్టు..పాలు కావాలన్నావు కదా? "
బ్రహ్మానందం మళ్ళీ బయటకు వెళ్ళి పొయ్యాడు.
ఒక అర్థ గంట తరువాత రొప్పుతూ ఆయాసంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి భయ పడింది సుశీల.
" ఏమైయ్యిందండీ" అంది పాల పాకెట్లు ఉన్న సంచీని తీసుకొంటూ..
గ్లాసు మంచి నీళ్ళు తీసి భర్తకు అందించింది.
" 500 రూపాయల నోటు కోసం వెతక డానికి స్కూటర్లో వెళ్ళానా? ఈ రోజు ఎవరి ముహం చూశానో ఏమో..అన్నీ కష్టాలే...రైతు బజారు కెళ్ళాక స్కూటర్ పంచరయి చచ్చింది.ఈ రోజు ఆదివారం గదా! పంచర్ వేసే వాడు ఎవ్వడూ కనబడ లేదు..అలాగే రొప్పుతూ తోసుకొని వచ్చే సరికి నా ప్రాణం పోయింది" అని గ్లాసు లోని నీళ్ళు గడ గడ మని త్రాగేశాడు.
" పోతే పోయింది పాడు 500 రూపాయలు.. ఈ మధ్య మీకు మతి మరుపు ఎక్కువయ్యింది" అంది సుశీల.
" మతి మరుపా ..నా బొందా.. పొద్దున్నే పాల వాడ్ని మోసం చేశాను..తెలిసి గూడా వాడిచ్చిన డబ్బును నా జోబీలో తెలీనట్లు కుక్కు కొన్నాను. వున్నదీ పోయే..వుంచుకొన్నదీ పోయె " అన్నట్లు అయింది నా బ్రతుకు ఈ రోజు
" అంతే ..150 రూపాయలు కు కక్కుర్తి పడితే వేయి రూపాయలు బొక్క పడింది.ఇక నైనా నిజాయితీగా ఉండండి..బీదా బిక్కీ..చిరు చిరు వ్యాపారస్థులకు మోసం చెయ్యకండి" అంది సుశీల.
" ఉండండి..కాఫీ ఇస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళి పోయింది సుశీల.
" అలాగే" అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో కేసి చూస్తూ లెంప లేసుకొన్నాడు బ్రహ్మానందం.
*********************************************