కలం ఊరకే ఉండదు
----------------------------------------
కలం ఊరకే ఉండదు
పరుగెత్తుతుంది అగాధాల్లోకి ... అడవుల్లోకి
జలపాతాల్లోకి .... జన వాసాల్లోకి
కలం అక్షరాల సేద్యం చేస్తూ
కవిత్వాన్ని పండిస్తూనే ఉంటుంది
కలం ఊరకే ఉండదు
పచ్చిక బయళ్ళ పచ్చదనంతో మురిసి పోయి
తడి ఆరని ఆకుపచ్చ గీతాల్ని రాస్తుంది
కలం ఊరకే ఉండదు
నడిసంద్రపు సుడిగాలికి
ఆటుపోట్ల కెరటాలకు
కలం గాలం వేస్తుంది
కలం ఊరకే ఉండదు
కులాల గజ్జిని
మతాల మౌడ్యాన్ని
కలం ఉతికి ఆరేస్తుంది
కలం ఊరకే ఉండదు
కుళ్ళు పోతు వ్యవస్థని
మూఢ నమ్మకాల్ని
కలం కరవాలమై ఖండిస్తుంది
''కవి కలం '' కత్తి కన్నా గొప్పది .
రచన : వారణాసి భానుమూర్తి రావు
18 ఏప్రిల్ 2017.