Tuesday, June 28, 2016

ఆమె ఒక సంచలనం !

ఆమె ఒక సంచలనం !
---------------------------------

ఎన్ని సంచలనాలో!ఎన్ని పరివర్తనాలో!!
కాస్సేపట్లో  సూర్యుడు  దుకాణాన్ని మూసేస్తాడని
చీకట్లో  అలిగిన  రాత్రి  ఆమె కౌగిట్లో  కరిగి పోయింది
ఆమె నవ్వుల కాంతిలో  వసంతం వాడి పోయింది
ఆమె కురుల నుండి  విరుస్తున్న  సుగంధికా  వీచికలు
మలయ మారుతాల లయ మార్చి వాకిట వెను  తిరిగాయి
ఆమె  కుచ ద్వయం  పూర్ణ కుంభాన్ని వెనక్కు నెట్టింది
ఆమె తనువు  సంచలనాల హరి విల్లు
ఆమె  చుట్టూ పరిభ్రమిస్తున్న వినీల కాంతులు  చంద్ర కాంతిని కరిగించాయి 
ఆమె  ముగ్ధ  , మధ్య , ప్రౌఢ 
ఆమె  ధీర , లలిత , ఉదాత్త , నిభృత 
ఆమె  స్వాధీన పతిక , వాసవ సజ్జిక , విరహోత్కంఠిక, విప్రలబ్ద , ఖండిత 
కలహాంతరిత , ప్రోషిత భర్తృక , అభిసారిక 
ఆమె శృంగార  రసాలంభన  విద్యుల్లత ! 










Monday, June 6, 2016

డెత్ మాట్రిక్స్

డెత్ మాట్రిక్స్
-----------------------------------------

నాకు తెలియక  నన్ను నేను
ఒక  సూర్యాస్తమయం   ఆపాలని
సముద్ర కెరటమై  ఎగురుతున్నా
గుల్లలై      గవ్వలై
ఆ మెడిటేరియన్  మహా సముద్రం బీచ్ లో
నా ఆశల్ని  ఆసాంతం  ఏరుకొంటున్నా
బిందువు లా  ముందుకు వస్తున్న
ఆ నావ    ఎన్ని జీవితాల్ని  మోసుకోస్తుందో
ఒక జాతి  వేదన  తుప్పు  పట్టిన  ఓడ లా
దేశపు  హద్దుల్ని దాటి
పరాయి దేశపు  గడ్డ వైపు  కాళ రాత్రిలో ప్రయాణిస్తూ
సముద్రమే  భీకర జీవన సమరమై
అంతు లేని  బాధా సర్ప  ద్రస్టులై
ఒక్క సారి  పడి  లేచిన  కెరటం ఆ  నావను లాక్కొని
సాగర గర్భాన్ని  చేర్చిన వేళ
విగత  జీవులై  చిన్నారుల  ఆక్రందనలు
చెల్లా చెదురైన  శవాలు
కకా  వికలమైన  జీవితాలు
తీరానికి  చేరలేని  నిస్సహాయ  నిర్భాగ్యులు
కలల సౌధాలు ఒక్కసారిగా కూలిపోతే
ఇది ఏ దేశం చేసుకొన్న కర్మ ?
ఇది  ఏ దేశం  రాసుకొన్న  మరణ వాజ్ఞులమ్ ?
ఇది  ఏ దేశం  రచించిన  ద్వంస కాండ ?
హింస రచన లో  బలి  అయిన  అమాయకులకు
ఏ తీరం  జవాబివ్వగలదు ?
తీరానికి  కొట్టుకొచ్చిన  పసి పిల్లాడి శవాలకు
ఏ మతం జవాబివ్వగలదు ??

06.06. 2016