Monday, November 28, 2022

నా " మట్టి వేదం " పుస్తకం‌ పై సమీక్ష

 నా  " మట్టి వేదం " పుస్తకం‌ పై సమీక్ష 

----------------------------------------------



మిత్రులకు ఈ సోమవారం మరో పుస్తక పరిచయం మీకోసం....💐


ఒక్కోసారి మట్టి పచ్చని జీవన గీతాన్ని....

ఒక్కోసారి అదే మట్టి కన్నీటితో తప్త గీతాన్ని పాడుతుంటుంది... 


పల్లె ఎప్పుడూ పచ్చదనాన్ని కలగంటుంది.... వాన మబ్బులు కరిగి కరిగి ఏకధాటిగా వాన పాట పాడాలని, చెరువులు, గుంటలు నీటి వాగులై పొంగిపొర్లాలని, రైతు వేసిన పంటలన్నీ ఏపుగా పెరిగి పచ్చని పట్టుచీర కట్టిన ఆడపడుచులా కంటినిండా కనిపించాలని పల్లె ఎప్పుడూ కలగంటూనే ఉంటుంది.  


రైతు వ్యథలను అక్షరాలు గా మార్చి కవితలుగా ఒంపి దానికి "మట్టి వేదం" అని అందమైన పేరు పెట్టి మన మధ్యకు తీసుకుని వచ్చిన కవి "వారణాసి భానుమూర్తి" గారు.


వీరు చిత్తూరు జిల్లా వాసి ప్రస్తుతం హైదరాబాద్ నివాసం. వీరు సాగర మథనం, సముద్ర ఘోష, మట్టి వేదం(కవితా సంపుటాలు), సంస్కార సమేత రెడ్డి నాయుడు(నవల) మొదలైన పుస్తకాలు ముద్రించారు.


ఈ "మట్టి వేదం" లో 70 కవితలు ఉన్నాయి. ఇందులో అన్నీ సామాజిక అంశాలే...ఎక్కువగా రైతు గురించి, పల్లెల గురించి రాశారు.


//తొలకరి జల్లులు కురిసే వేళ

మట్టి సుగంధాన్ని దోసిళ్ళతో ఒడిసి పడుతూ 

వ్రాసుకొంటున్న మట్టి కవిత్వం నాది//... 'మట్టి వేదం' కవితలో


మొదటి కవితలోని కవి మనకు మట్టి పరిమళాలను చూపించారు. మట్టితో తనకున్న గాఢమైన అనుబంధం ప్రతి పదంలోను మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


//నాగేటి సాళ్ళు నవ్వితే నాకేంటి?

ముత్యాల విత్తనాలు జారితే నాకేంటి?

తల్లి వానమ్మ కనికరం సూపిత్తే

పండదా బంగారం నా నట్టింటి లోన!//...'నాగేటి సాళ్ళు' కవితలో


వాన కోసం రైతు ఎంత ఆశగా ఎదురు చూస్తాడో తెలియజేసే కవిత ఇది....


//ఎల్లలు లేని మా పల్లె ప్రపంచాన్ని చూడాలని ఉంది

ఆకాశం సాక్షిగా ఎగిరే పక్షులతో తీరాలకు చేరాలని ఉంది

అలల సాక్షిగా చలాకీ చేపలతో ఏట్లో ఈదాలని ఉంది//...'నా పల్లె ప్రపంచం' కవితలో...

కవికి పల్లెతో ఉన్న బాంధవ్యం గురించి, మళ్ళీ మళ్ళీ ఆ చోటుకి వెళ్ళి చూడాలనే తపన గురించి ఆర్తి గా చెబుతారు.

పల్లె నా అంతరంగం, పల్లె నా అంతరాత్మ అంటూ కొనసాగిన ఈ కవిత చదువుతుంటే మనక్కూడా మన సొంత ఊరు చూడాలని ఆశ కలుగుతుంది.


//మనిషితో మనిషి మాట్లాడని వాడు

అసలు మనిషెట్టా అవుతాడు// 'పుష్పించని మనిషి' కవితలో....

కొందరు ఎవరితోనూ పలుకక ఏకాకిగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకు ఈ కవిత బాగా వర్తిస్తుంది. అలాంటి వాళ్ళను బ్రహ్మ జెముడు చెట్లతోనూ, తుమ్మ చెట్లతోనూ పోలుస్తూ...సమాజంలో జీవించే ఎవరైనా తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలని హాయిగా నవ్వుతూ మాట్లాడాలని అంటారు. 


ఇలా ప్రతి ఒక్క కవిత ఒక్కో జ్ఞాపకంలా కవి రాసుకున్నట్లు అనిపించడమే కాకుండా మన జ్ఞాపకాలను కూడా తడిమేలా చేస్తుంది ఈ "మట్టి వేదం" కవితా సంపుటి.


చక్కటి పుస్తకాన్ని పాఠకులకు అందజేసిన "వారణాసి భానుమూర్తి" గారికి హృదయ పూర్వక అభినందనలు.


ఈ పుస్తకంకు మన అందరికీ సుపరిచితులైన "శ్రీ కెరె జగదీష్" గారి ముందు మాటలు మరింత వన్నె తెచ్చాయి.


ఈ "మట్టి వేదం" పుస్తకం కావలసిన వారు 9989073105 నెంబర్ కు సంప్రదించ గలరు.


పుస్తక పరిచయం

శాంతి కృష్ణ ✍️

28.11.22

No comments:

Post a Comment