Sunday, November 13, 2022

మా తిరపతి‌ పయానం‌ ( రాచ పల్లి కథలు - 6)

 

 మా  తిరపతి  పయానం  ( రాచ పల్లి కథలు - 6)

మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వుండేది.‌ పుట్టినెంట్రుకలు తీయించే దానికి కొందరు గుర్రం కొండ కాడుండే  రెడ్డమ్మ కొండకు , కొందరు చౌడేపల్లి కాడుండే చౌడమ్మ గుడికి పోతారు. మా నాయన అప్పో సప్పో చేసి తిరపతికి పోతా వుండె. తిరపతికి పోవల్లంటే కర్చు చ్యానా అవుతుంది. మా కుటుంబం పోవల్లంటే నూరు రూపాయలయినా గావల్ల. అంత దుడ్డు మా కాడ ఉండేది గాదు.

మా నాయన నాకు  ఆరేడేళ్ళు వచ్చినా పుట్టినెంటుకలు తీయించలా నాకు . 

"  పాపం‌  మగ పిల్లోడు... యాందీ దరిద్రము? ఆడ పిల్ల మాదిరి జుట్టు పెంచుకొని జడ ఏస్తావుంటే నాకు ఏడుపు వస్తా వుండాది.  నాకు కోపమొస్తే మంగలోళ్ళ రామన్న పిలిపించి ఇంట్లోనే గుండు కొట్టిస్తా!  " అని గట్టిగా మా నాయన్ను తిడ్తా వుండేది మా యమ్మ.

మా నాయన నన్ను తీసుకొని ముద్దు చేసే వాడు.  " సూడు నా కొడుకు ! ఎంత అందంగా ఉండాడో ! జుట్టు పెద్దదయినా గిరజాలు వేసుకొని, రిబ్బన్లు ఏసుకొని ,  చిన్ని కిట్టయ్య మాదిరి వుండాడు.  " అని నన్ను దగ్గరకు తీసుకొని ముద్దులు కురిపించే వాడు మా నాయన.

" నాయనా! నాకు మగ పిల్లోళ్ళ మాదిరి క్రాపు  చేయించు. నన్ను చూసి నా స్నేహితులంతా గేలి చేస్తా వుండారు. ఆడోడా ...అడోడా  అని పిలుస్తా నవ్వతా వుండారు. నాకు బిరీన గుండు కొట్టిస్తావా ? లేదా?  "  అని నేను చానా కోపంగా అడిగినా.

" తిరపతికి  పోదాము నాయనా ! ఈ సారి కూరగాయలు ఏసినాము  గదా  మన మడ్లో!  వారం వారం అమ్మతా వుణ్డాము గదా మాలు సంతలో..కలకడ సంతలో గూడా అమ్మతా వుండాము.‌ఈ సారి మన ఆవులు ఈని నాయి గదా? పాలు గూడా బాగా యిస్తా వుండాయి.  కవ్వం పెట్టి అమ్మ సిలికితే మస్తుగా వెన్న పడతా వుండాది. ఆ ఎన్న వుట్టి మీద ముంతలో పెట్టి వారానికి ఒక సారి మరగ పెడితే  నెయ్యి వస్తా వుండాది. నెయ్యి గూడా సొలిగె పావలా  లెక్కన అమ్మతా వుండాము. రూపాయికి నాలుగు సొలిగెల నెయ్యి .  నూరు రూపాయలు సేతిలో పడితే తిరపతికి అందరమూ పోతాము నాయనా! " అని మా నాయన కథంతా సెప్పె.

బియ్యం గూడా శేరు రూపాయి అని మా నాయన చెప్పినాడు.  అందుకే మేము నూకలు కొనుక్కొని రాగి సంగటి చేసుకొని తింటాము. బియ్యం ధర ఎక్కువంట.

నాకు ఏ ఇసయ మైనా మా నాయన పూస గుచ్చి నట్లు చెప్తాడు.‌ అందుకే నాకు అన్ని ఇసయాలు మా అన్న ,   అక్క కంటే నాకే బాగా తెలుసు.‌  చానా విసయాలు నేను మా నాయన దగ్గరే నేర్చు కొన్నా! ఎందుకంటే నేను సిన్న కొడుకును గదా!  అందుకే మా నాయనకు నేనంటే స్యానా ఇష్టం.

రెండు , మూడు  నెలల తరువాత మా నాయన నూరు  రూపాయలు సంపాయించి నాడు.

ఒక మంచి రోజు సూసు కొని పొద్దున్నే ఆరు గంటలకు స్నానాలు చేసి ,  మంచి బట్టలు ఏసు కొని , నేను మా నాయన , మా  అమ్మా, మా యన్న , మా యక్క  ఇంటిలో ఎంకటేస్వర సామి పటానికి టెంకాయ కొట్టి అందరమూ తిమ్మాపురం క్రాసు కాడికి నడుసుకొంటా పోతిమి.

అమ్మ సిత్రాన్నము , గడ్డ పెరుగన్నము  టిఫిన్  గిన్నెల్లో కట్టుకొని  గుడ్డ మూత కట్టి  బిగించె.‌ ఇంకా మా యమ్మ మేము  తినేదానికి అప్పచ్చులు , కారాలు , చుట్టలు ,  పప్పు బిళ్ళలు , కారం  బెట్టి వేయించిన  అనప కాయ గింజలు ,   వేయించిన చెనిక్కాయ గింజలు , పాగం పప్పు వుంటలు , జొన్న బొరుగుల బెల్లం కలిపిన వుంటలు అన్నీ ఎత్తుకొని తిత్తిలో పెట్టుకొని  ఇల్లు బీగాలు  వేసుకొని నడిస్తిమి.‌ ఈ రెండు రోజులూ గొడ్డూ గోదా తిండి కోసం మా ఇంటి పక్కనున్న మా మామోళ్ళకు జాగరత్త గా చూసుకోమని చెప్పితిమి.మాకు కోడి పెట్టలు , పుంజులు  నాలు గైదు వుండాయి .వాటి కోడి పిల్లలు పదో ఇరవై వుండాయి.‌రాత్రి అయిందంటే ఆటిని పెద్ద గంపల కింద చేర్చల్ల . ఆ పని మా అత్తోళ్ళకు చెప్పి నాము. నాలుగైదు మేకలుండాయి‌. ఆటిని మేతకు తీసుకొని పోవల్ల అని మా మామా వాళ్ళకు చెప్పితిమి.

మా ఇంటిలో కాపలాగా అంజి  అనే కుక్క వుండాది.‌
మేము పోతా వుంటే అది ఏడుపు మొగం ఏసుకొని చూస్తావుండాది. దానికి తిండీ గూడా మా రవణమ్మ అత్తకు చెప్పినాము.

అంతే కాదు మా ఇంటిలో రాజా , రాణి అనే రెండు పిల్లులు ఉండాయి. అయి మా అమ్మకు , నాకు అంటే స్యానా ఇష్టం . ఆటికి పాలు నేనే తాపిస్తా ప్రతి రోజూ.

అయి మా కొట్టంలో , చుట్టింట్లో , పసుల పాకలో తిరిగే ఎలకల్ని పట్టుకొని బాగా తినేస్తాయి.

" అమ్మా..రాజా , రాణికి పాలు ఎట్లా? " అని ఏడుపు మొహం వేసుకొని అడిగినాను నేను.

" రెండురోజులే గదా నాయనా! ఎలకల్ని తిని వుంటాయిలే ! " అనింది మా యమ్మ.

కానీ నాకు ఏ మూలనో పిల్లుల్ని‌ చూస్తా వుంటే బాధగా ఉండాది.

అవి‌ మ్యావ్ మ్యావ్ అని నా వొడిలో కూర్చొని ఆడుకొంటా వుంటాయి.

యాడికైనా  పోవాలంటే పెద్ద పీకు లాట.‌ అన్నీ సూసుకొని బోవల్ల. అందుకే ఇంట్లో ఎవ్వరో ఒక్కరుండల్ల‌.

తిమ్మాపురం‌ క్రాసు కాడికి వస్తానే  పీలేరుకు పొయ్యే ఎర్ర బస్సు నిలబడింది.

సంతోషంగా అందరమూ బస్సెక్కినాము.
నేను బస్సు ఎక్కి ఆరేడు నెలలు అవుతావుంది.‌అప్పుడెప్పుడో కలకడ శివరాత్రి తిరనాలకు కలకడ వరకూ బస్సెక్కి నాము అందరమూ.

నేనూ,  అక్కా, అన్నా  ముగ్గురు కూర్చొనే సీట్లో కూర్చొన్నాము‌ . అక్క ,  నేనూ కొట్లాడు కొన్యాము.  కిటికీ పక్కన ఎవరు కూర్చో వల్ల అని కొట్లాట. నేను గట్టిగా ఏడిస్తే నన్ను కిటికీ పక్క కూర్చో బెట్టిరి.‌ అక్కేమో ఏడుస్తా అమ్మ పక్కన  వుండే కిటికీ పక్కన కూర్చొండె .

కిటికీ పక్కన కూర్చొంటే గాలి చల్లగా ముక్కులకు , చెవులకు కొడుతోంది.‌ రోడ్డు పక్కన వుండే పల్లెల్ని , మనుషుల్ని ,  గుట్టల్ని చూస్తా వుంటే కుశాలుగా ఉండాది‌. మా యన్న నా మీద పడి పడి బయటకు తొంగి చూస్తా వుండాడు.

బస్సు పీలేరు బస్టాండు చేరింది.‌ అక్కడ నుండి పీలేరు రైల్వే స్టేషన్ కెడితే తిరపతికి వెళ్ళే రైలు వచ్చింది.‌

మేమంతా రైలు బండి ఎక్కినాము.  ఆ రైలు  బండి పాకాల మీదుగా తిరపతికి  పోతుంది. మా కందరికీ ఆ బొగ్గుల రైలు చూస్తా వుంటే ఎంతో సంతోషము వేసింది.‌ బస్సు కంటే రైలులో హాయిగా వుంది మా పయానం‌.
అప్పుడు ఒక తమాషా జరిగింది.

మేమంతా పాకాల  బొగ్గు  ఇంజన్  రైల్లో పోతావుంటే  నేను ఇంకో  బోగీ లోకి మా అమ్మా నాయనకు తెలీకుండా ,  సెప్పకుండా ఎల్లి పోతి.  మా యమ్మ  ఒకటే ఏడుపు .  మా నాయన కాళ్ళూ , సేతులూ వణకతా వుంటే నేనుండే బోగీకొచ్చి రెండు దెబ్బలు పీకి, బిగీన రెట్ట పట్టుకొని లాక్కోని పాయె!  నేను ఏడస్తావుంటే , మా యమ్మ అక్కడ అత్తిరాసాలు అమ్మే ఒకాయప్పకు  అణా ఇచ్చి అత్తిరాసాలు రెండు  కొన్నిచ్చె. నేను ఏడుపు మానేస్తి. 

మా యమ్మ నన్ను గట్టిగా పట్టుకొని తిరపతి దాకా వదలనే వదల్లా!

అప్పుడప్పుడూ మేము తెచ్చు కొన్న అప్పచ్చులు తింటా వుంటిమి.   మద్యాహ్నము మా యమ్మ తెచ్చు కొన సిత్రాన్నము , పెరుగన్నము చిన్న ప్లేట్లల్లో పెట్టి      ఇచ్చె. అందరమూ బాగా తిన్యాము.‌    మా నాయన రైలు ఆగి నప్పుడల్లా టేషన్ లో వుండే కుళాయల దగ్గర నీళ్ళు మర చెంబుల్తో పట్టుకోనిచ్చి మాకు తాపిస్తా వుండె‌.

సాయంకాలం ఆరు గంటలకు రైలు తిరపతికి చేరె.
మా నాయన స్యానా సార్లు తిరపతికి  వచ్చినాడు గాబట్టి ఆయప్పకు  అన్నీ తెలుసు.‌

ఆ రాత్రికి తిరపతిలో ఉండల్నా , కొండకు పోవల్నా అని మాట్లాడు కొంటిమి అందరమూ.

కొండకే పోదామని అమ్మ చెప్పె.  బస్టాండుకు  పోయి కొండకు పొయ్యే బస్సు ఎక్కినాము. బస్సులు వస్తా వుణ్డాయి. పోతా వుండాయి.

దూరంగా కొండ మీద వుండే గోపురం వరకూ లైట్లు కనబడతా వుండాయు.  కొండ మీద శంఖు చక్రాలు లైట్ల వెలుతురులో కనబడతా వుండాయి.

బస్సు కొండకు  కదిలింది. బస్సులో జనాలు ఒక్క సారిగా " గోవిందా ! గోవిందా ! " అని గట్టిగా అరచి నారు.  మేము గూడా  "  గోవిందా  " అని గట్టిగా అరిస్తిమి.

రాత్రి ఎనిమిది గంటలకు బస్సు కొండ చేరింది.
మా నాయన మమ్మల్ని అందర్నీ గట్టిగా పట్టుకొని ఒక ధర్మ సత్రానికి పిలుచు కొని పాయె.‌

ఆ రాత్రి అక్కడే పడుకొని , పొద్దున్నే కల్యాణ కట్ట కు పోవల్ల అని మా నాయన చెప్పె.

"కల్యాణ కట్టలో దేవుడు వుంటాడా నాయనా? " అని నేను అడిగినాను.

ఆ  మాటలకు మా నాయన పగల బడి నవ్వె.
" కల్యాణ కట్టలో నీకు బోడి గుండు చేస్తారు . "అని అన్యాడు మా నాయన.

ఆ రాత్రి మా యమ్మ తెచ్చు కొన్న అన్నం మూట విప్పె.అదే ఆ రోజు అందరమూ తిని అక్కడ్నే బొంతలు కింద పరచు కొని పడుకొంటిమి.

మా యమ్మ తెచ్చిన గిన్నెలు అన్నీ  శుభ్రంగా కడుక్కొని మా పక్కన్నే పడుకొన్యాది.

కొండ మీద బాగా చలి పెడతా వుంది.‌ మా యమ్మ తెచ్చు కొన్న దుప్పట్లు మాకు కప్పింది.

ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పొయ్యామో మాకే తెలీదు.
**************************************
పొద్దున్నే తెల్ల వార తానే లేచి కల్యాణ కట్ట కాడికి పోయినాము అందరమూ.

అక్కడ గుండు కొట్టే వాళ్ళ దగ్గర నన్ను కూర్చో బెడతానే ఆయప్ప కొన్ని వేడ్నీళ్ళు  నెత్తిన చల్లి జుట్టు నంతా నీటితో తడిపె. నాకు బయ మేసి ఏడిస్తిని. మా యమ్మ , మా నాయన పక్కన కూర్చొని ధైర్యం చెప్పిరి.

" ఈ యప్ప నాకు గుండు కొట్టిస్తే   నాకు ఎంటికలు  మళ్ళా రావు గదా? " అని గట్టిగా ఏడుస్తా అన్యాను.

నా మాటలకు గుండు కొట్టే ఆయప్ప , మా యమ్మా , మా నాయనా పగల బడి నవ్విరి.

" రెండు నెలల్లో ఇంకా బాగా వొత్తుగా , నల్లగా వస్తాయి. అప్పుడు నువ్వు నీ స్నేహితుల మాదిరి క్రాపు వుంటుంది . యాల ఏడ్చేది? " అని మా అమ్మ నవ్వతా అనె.

" పుట్టిన ఎంటుకులు తీస్తా వుండారు గదా ? కత్తి పెట్టే ముందు కానుకలు పెట్టండి " అనె  ఆ గుండు గొరిగే  ఆయప్ప.

మా నాయన జోబీలో వుండే అర్థ రూపాయి బిళ్ళ ఆయప్పకు ఇచ్చె.

" గోవిందా! " అని ఆయప్ప నా నెత్తి మీద కత్తి పెట్టి బర బర మని గొరిగె.

గుండు చేసిన తరువాత నాకు చ్యానా హాయిగా ఉండినాది.

నాకు బోడి గుండు చేసిన తర్వాత నాకు మా వాళ్ళను చూసి స్యానా ఇస్మయం కలిగింది.

వరసగా మా అమ్మ గూడా గుండు చేసుకొనె. మా నాయన , మా అక్క , మా అన్న అందరూ గుండు చేసు కొనిరి . మేము ఐదు మంది బోడి గుండ్లతో కోనేటికి పోయి అక్కడ స్నానాలు చేస్తిమి.

అక్కడొకాయన  మా  బోడి గుండ్లకు గంధం బాగా పూసినాడు.  కత్తి వాటు మంట ఒక్క సారిగా తగ్గి పాయె. మా గుండులు  చల్లగా అనిపించె.
ఆయప్పే మాకు అందరికీ గోవింద నామాలు పెట్టినాడు.

ఆయప్పకు మా నాయన ఒక అర్థ రూపాయి బిళ్ళ చేతిలో పెట్టె.

మేమందరమూ ఆ తరువాత సర్వ దర్శనం లైనులో నిలబడితిమి. అందరూ గుండ్లు చేసుకొని గోవిందా , గోవిందా అని గట్టిగా రెండు చేతులూ ఎత్తి అరుస్త వుండారు.

మా నాయన నాకు  కాళ్ళు నొప్పి వస్తా వుండాయంటే నన్ను భుజాల మీద ఎక్కించు కొన్నాడు. నేను మా నాయన గుండు పట్టుకొని  ఎత్తులో‌ కూర్చొన్నా!

నాలుగైదు గంటలో దేవుని దర్శనం అయింది.

ఎంకటేస్వర సామి ఆ దీపాల కాంతిలో వెలిగి పోతున్నాడు. ఆ విగ్రహం చూసి మాకు
భక్తి భావం ఎక్కువయి , అందరమూ గట్టిగా " ఏడు కొండల వాడా! గోవిందా! " అని అన బడితిమి.

మా అమ్మ ఏడుస్తా వుండాది.

" సామీ ! నీ దర్శనం అయింది . మమ్నల్ని , మా బిడ్డల్ని ,  మా గొడ్డూ గోదల్ని , మా వూరిని సల్లగా చూడు నాయనా! గోవిందా! ఏడు కొండల వాడా! ఆపద మొక్కుల వాడా! " అని గట్టిగా అరచె.

మా అమ్మతో పాటి మేము గూడా గట్టిగా అరిస్తిమి.

దర్శనం అయిన తరువాత మా అమ్మ  మొక్కులు చెల్లించల్ల అని హుండీలో దాచుకొన్న దుడ్లు కొన్ని ఏసె.

ప్రసాదం తీసుకొని గుడి బయటకు అందరూ వస్తిమి.

మాకు ఈ  తిరపతి యాత్ర జీవితాంతం గుర్తుండి పోయింది.

ఎంతయినా మా సిత్తూరోళ్ళకు ఈ ఎంకన్నే  దిక్కు గదా?

******************************************
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

12.11.2022

.

5 comments:

  1. కథావస్తువు చాలా మందికి అనుభవమే కానీండి కథనం మాత్రం అద్భుతంగా ఉంది. వారి ప్రాంత మాండలికం సొగసుగా ఉంది. మంచి కథ పోస్ట్ చేసారు మీరు.

    // “ ఎంతయినా మా సిత్తూరోళ్ళకు ఈ ఎంకన్నే దిక్కు గదా?” // … “సిత్తూరోళ్ళకు” మాత్రమేనా, కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నా కూడా తెలుగు ప్రజలందరికీ “ఎంకన్న” మీదే ఎక్కువ గురి కదా.

    ఇంతకూ ఈ రాచపల్లి గారెవరు? వారి పరిచయం ఏమిటి? కాస్త వివరించగలరా?

    ReplyDelete
  2. కథను చదివి మీ స్పందనను తెలియ చేసినందుకు ధన్యవాదములు. ‌రాచపల్లి నా జన్మ స్థలం. ‌అక్కడే నేను పుట్టినాను.‌ అది చిత్తూరు జిల్లా ‌లో పీలేరు దగ్గర ఉన్న ఒక గ్రామం.నా చిన్ననాటి అనుభవాలను , చూసిన సంఘటనలను క్రోడీకరించి రాచపల్లి కథలు అని‌ ఒక సిరీస్ ను‌ పోస్ట్ చేశాను. అందులోని కథ ఇది ఏడవది. ఈ నెలలో నా కథల సంపుటి ' పెద్ద కొడుకు ' అనే కథల సంపుటి ని బిజయ వాడలో 20 వ తేదీ అవిష్కరిస్తున్నాను.

    ReplyDelete
  3. రచయిత మీరేనా? సంతోషం. వ్రాస్తుండండి 👍.

    మీ పుస్తకావిష్కరణ సందర్భంగా అభినందనలు.

    ReplyDelete
  4. నా కథలు , కవితలు చాలా మటుకు నా బ్లాగ్ లో post చేశాను.‌ నేనిది వరకే నాలుగు పుస్తకాలు అవిష్కరించాను. ‌‌1. సాగర మథనం 2. సముద్ర ‌ఘోష 3. మట్టి వేదం‌ 4. సంస్కార సమేత రెడ్డి నాయుడు ( నవల) 5. ఇప్పుడు పెద్ద కొడుకు ( కథల సంపుటి)

    ReplyDelete