Tuesday, October 27, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (22)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 

ఇరవై రెండవ భాగం(22)

--------------------++++++-------------------------





ఆ రోజు రాత్రి పడుకొన్నాడన్న మాటే గానీ వీర కేశవ రెడ్డి గారికి నిద్ర పట్ట లేదు. అమ్మవారు రంగంలో చెప్పిన విషయం ఇంకా అర్థం కావడం లేదు. అలాగే ఆ రాత్రంతా అదే ఆలోచిస్తూ నిద్ర పొయ్యాడు.


ఆ రాత్రి  వేకువ జామున రెడ్డి గారికి. ఒక కల వచ్చింది.   ఎవ్వరో ఒక దివ్య శక్తి   కన బడి మీకు పుట్టబొయ్యే బిడ్డల్ని మార్చుకోండి నాయనా..అంతా మంచి జరుగుతుంది‌ అని చెప్పి నట్లయింది.  ..ఒక్క సారిగా ఉలిక్కి పడి లేచాడు. అంతే .ఆ తరువాత నిద్ర పోకుండా ఈ విషయమే ఆలోచించాడు. తెల్లవారి ఝామున వచ్చే కలలు నిజమవుతుందని అంటారు . తెల తెల్ల వారుతోంది. ఆ కల నిగూడార్థం ఇప్పుడిప్పుడే అర్థ మవుతోంది..


అమ్మ వారు చెప్పినట్లు రెండు కుండలు మార్చు కోవాలి..అంటే..అంటే... ఈ విషయం చెబితే నాయుడు గారు ఒప్పుకొంటాడా? అసలు తమ భార్యలు ఈ మార్పిడిని అసలు ఒప్పుకోరు. తొమ్మిది నెలలు మోసి  ప్రసవించిన స్వంత బిడ్డను వేరే వారికి ఇవ్వడానికి ఏ తల్లయినా ఎలా ఒప్పుకొంటుంది? కానీ మళ్ళీ  అదే జరిగితే ఈ పుత్ర శోకాన్ని భరించ లేము..ఈ సారి  ఏదయినా జరగ రానిది జరిగితే తమ భార్యలు భరించ గలరా? 


తెల్ల వారింది.


పరుగు పరుగున కాలకృత్యాలు ,  అల్పాహారం ముగించు కొని వీర కేశవ రెడ్డి  నాయుడు గారి పల్లెకు బయలు దేరారు. ఇంటిలో గూడా ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్ళి పొయ్యాడు.


నాయుడు గారి పల్లెకు ఇంత తెల్ల వారుతూనే  అర్ధాంతరంగా వచ్చిన రెడ్డి గారిని చూసి రెడ్డప్ప నాయుడు ఆశ్చ్యర్య‌ పొయ్యాడు. 


" కబురంపితే నేనే వస్తిని గద అప్పా ? " అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" కొంచెం పని ఉండాదిలే అన్నా ..అందుకే వచ్చినాను. నీతో కొన్ని రహస్యాలు మాట్లాడల్ల" అనగానే ఇద్దరూ ఒక రహస్య గది లోనికి వెళ్ళి మాట్లాడుకొన్నారు.


నిన్న రంగం లో జరిగిన కథ, అమ్మ వారు తన కలలో కనబడిన విషయం..కుండలు మార్చు కోవడమంటే పుట్టే బిడ్డల్ని మార్చు కొంటే పుత్ర శోకం ఉండదని ..జరిగిన దంతా వివరంగా చెప్పాడు వీర కేశవ  రెడ్డి.


ఆశ్చ్యర్యంగా అంతా విన్నాడు నాయుడు గారు.

"అది జరుగుతుందా? అసలు ఈ అడోళ్ళు ఒప్పుకొంటారా? "అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు.


" అదంతా నేను చూసు కొంటానులే అన్నా" అన్నాడు రెడ్డి గారు.

***************************************************

తొమ్మిది నెలలు గడిచాయి.


ఆ రోజు ఉదయం నుండే   ఇటు రెడ్డి గారి భార్యకు, అటు నాయుడు గారి భార్యకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. 


" జాగ్రత్త వహించాలి ఈ సారయినా..మొన్న పంతులు గారు చెప్పిన ప్రకారం నువ్వు పండ్రెండు గంటలు బిడ్డ మొహం చూడగూడదంట..మొదటి సారి చూసే టప్పుడు అద్దంలో నీ బిడ్డ మొహం చూడల్లంట" 

అని చెప్పునాడు వీర కేశవ రెడ్డి..


" అట్లాగే...బిడ్డ బాగు కంటేనా? " అని తలూపుంది రెడ్డి గారి భార్య.

**************************************************

నాయుడు గారి పల్లెలో గూడ రెడ్డప్ప నాయుడు భార్య పక్కన కూర్చొని ఇదే విషయం చెప్పినాడు.


" ఇన్ని రోజులూ బిడ్డలు లేరని బాధ పడుతున్నాం ..పండ్రెండు గంటలు చూడకుండా వుండ లేనా ? " అన్నదామె.


ఇద్దరూ నాలుగైదు గంటల తేడాతో పండంటి మగ బిడ్డల్ని ప్రసవించారు. మంత్ర సానులంతా తమ పనులు చేసుకొని ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు మళ్ళీ పొద్దున్నే వస్తామని.


అర్థ  రాత్రి దాటింది. వూరంతా గాఢంగా నిద్ర పోతోంది.

గాఢాంధ కారం. కుక్కలు ఎక్కడో పోట్లాడుకొంటున్న శబ్ధం. వీర కేశవ రెడ్డి గారి ఒక పెద్ద కుండను రెండుగా విడదీసి అందులో గడ్డి వేసి దానిమీద మెత్తటి గుడ్డలు వేసి అప్పుడే పుట్టిన పురిటి పసి బిడ్డను తీసుకొని అందులో పండ బెట్టి, నెత్తిన తలపాగా చుట్టుకొని , కుండను నెత్తిన పెట్టుకొని దొడ్డి దారిన గాడాంధ కారంలో కలిసి పొయ్యాడు.


ఒక చరిత్ర తిరిగి రాయాలంటే కొందరు వ్యక్తులు త్యాగాలు చెయ్యాలి. అనూహ్య మైన నిర్ణయాలు తీసు కోవాలి.


అలనాడు శ్రీ కృష్ణ పరమాత్ముని వసుదేవుడు కంసుని బారి నుండి రక్షించడానికి ఒక గంపలో యమునా నదిని దాటి యశోదమ్మ చేతిలో పెట్టాడు గదా! ఆ. చరిత్రే ఇప్పుడు రెండు వంశాలకు, రెండు గ్రామాలకు పునరావృతమయ్యింది.


అదే ఇప్పుడు రెండు కుటుంబాల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు, రెండు గ్రామాల ప్రజల క్షేమం కొరకు వీర కేశవ  రెడ్డి గారు, రెడ్డప్ప నాయుడు గారు గొప్ప నిర్ణయం తీసుకొన్నారు.


చుట్టూ గాడాంధ కారం.. కప్పలు బెక బెకమంటున్నాయి. ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి.  కీచు రాళ్ళ శబ్ధం విన బడుతోంది..తీతవ పక్షులు రాగాలు తీసుకొంటూ ఆకాశంలో  అరుచు కొంటూ వెడుతున్నాయి. రెడ్డి గారు‌ బాహుదా నది వైపు వడివడిగా అడుగులు వేశాడు.


నాయుడు గారి పల్లె నుండి  రెడ్డప్ప నాయుడు గారు అలానే బయలు దేరి నారు.


రాళ్ళు రప్పలు దాటుకొంటూ బాహుదా నదిలో దిగారు ఇద్దరూ..మోకాలి నీటిలో నడచు కొంటూ  ఒక్క సారిగా ఇద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు.


నక్షత్రాల వెలుగు తప్ప వెన్నెల వెలుగు గూడా లేదు. గాఢమైన మబ్బుల మధ్య చందమామ కనబడడం  లేదు.


వణుకు తున్న చేతులతో ఇద్దరూ బిడ్డల్ని కుండలతో సహా మార్చుకొని వెంటనే బయలు దేరారు.


ఆ హృదయాలు ఎంత వేదన చెందుతున్నాయో..ఆ కళ్ళల్లో తడిని ఇద్దరూ గమనించ లేక పొయ్యారు.


ఇద్దరి గమ్యం మూడవ కంటికి తెలియ కుండా ఇల్లు చేరడమే..


రాత్రి మూడు గంటలు దాటింది.‌ 


వీర కేశవ రెడ్డి గారు ఇల్లు చేరి బిడ్డను తన భార్య పక్కన పండ బెట్టి ఏమీ తెలియని వాడిలా తన గది లోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు.


అట్లాగే  రెడ్డప్ప నాయుడు గారు గూడా పొంగుతున్న దుఖాన్ని ఆపుకొంటూ బిడ్డను తల్లి పక్కన చేర్చి పడుకొన్నాడు.


విధి ఎలా ఆడిస్తే అలా ఆడాలి మనుషులు. ఏది ఎలా జరుగు తుందో అలాగే  జరుగుతుంది..మనుషులు మనం  నిమిత్త మాత్రులం!


వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకొన్నాడనే సామెత ఇలాంటి సందర్భంలో గుర్తుకు వస్తుంది గదా! 

***********************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  మూడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.

No comments:

Post a Comment