Wednesday, October 4, 2017

తెలుగు ధారలో తడిచి పొయ్యాను !



తెలుగు  ధారలో  తడిచి  పొయ్యాను !

నా చిన్నతనంలోనే తల్లి పాలతో పాటు తెలుగు తల్లి పాటల్ని విన్నాను 
'అ ఆ' లతోనే అమ్మ వొడిలో శతకాల గురించి విన్నాను 
నాన్న ఒడిలో నిద్ర పోతూ భారతం పద్యాలు విన్నాను 
అవ్వ కోసం రామాయణ మహా భారత కథలు చదివి వినిపించినాను 
నా కోసం చందమామ , బాల మిత్ర కథల్లో మునిగి పొయ్యాను. 
బాబాయి కోసం కొమ్మూరి డిటక్టివ్ నవలలు చదివాను 
'జెండాపై కపి రాజు ', 'బావా ఎప్పుడొచ్చితివి నీవు ?' భారతం వీధి నాటకాల పద్య ఘోష లో నన్ను నేను మరచి పొయ్యాను.
పల్లె భజన బృందంలో మద్దెలగా మారాను
తంబుర్రా చేత బట్టి ' తొమ్మిది బొక్కల తోలు తిత్తి ఇది ' అని పాడేవాళ్ళ తత్వ గీతాల్ని విన్నాను 
బుడబుక్కల వారి బ్రహ్మోపదేశం లాంటి పాటల్ని ,
పసుపు రంగు బట్టలతో ధగ ధగ మెరిసి గుర్రాల మీద ఊరూరా తిరిగే వేమారెడ్ల వేమన శతకాల్ని విని కంఠతా పెట్టాను 
తోలు బొమ్మలాటలో తోలు బొమ్మల ఆటలు , పాటలు , భట్రాజుల హరికథలు మాధుర్యాన్ని చవి చూసాను .
తెలుగు వాచకంలో తెలుగు పద్యాల సౌరభాలకు ఉప్పొంగి పొయ్యాను .
' చేత వెన్న ముద్ద చెంగల పూదండ' , తల్లి నిన్న దలంచి పుస్తకం చేతన్ బూనితిన్ ' , 'ఆది వారము నాడు అరటి మొలచినది' , 'అయ్య వారికి చాలు ఐదు వరహాలు , పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు' నిద్రపోతున్నా చెవుల్లో గింగురు మనే పద్య గేయాలు.
ఆరవ తరగతిలో ' ఆవు సింహం ' కథ చదివి కన్నీళ్ల కడలినై పొయ్యాను.
పిల్ల లేగ దూడ అమ్మకై పడే తపన , అమ్మ లేగ దూడ కోసం విలపించిన తీరు నా మనస్సు కరుణతో విల విల లాడింది .
తెలిసి తెలియని వయసులో మా వూరి టూరింగ్ టాకీస్ సినిమాలో ' లవ్ కుశ ' సినిమా చూసి అందులోని పాటల , పద్యాల సుమధుర తెలుగు సోయగాన్ని చూసి ముగ్ధుడై పొయ్యాను. ' సందేహింపకు మమ్మా సీతమ్మ ' ఒక్క పాటేమిటి?' ' వినుడు వినుడు రామాయణ గాధ ' అన్ని అమృత రస మాధురీ తెలుగు రస గుళికలే! 
'భక్త ప్రహ్లాద ' సినిమాలో 'జీవము నీవే గదా' , ' నారాయణ మంత్రం ' పాటలు విని నన్ను నేనే ప్రహ్లాదుడిగా ఉహించు కొన్నాను .
ఆ రోజుల్లో hmv గ్రామఫోన్ రికార్డ్స్ మీద సన్నని సూది తాక గానే , ఆహూజా లౌడ్ స్పీకర్ల లోంచి వచ్చే మధుర మైన తెలుగు పాటలు విని ఆశ్చర్య పొయ్యాను .
' పిలిచే నా మదిలో, వలపే నీది సుమా' , 'పిలువకురా, అలుగుకురా', ' నీ లీల పాడెద ', ఏరువాక సాగారోయ్ ' , పయనించే ఓ చిలుకా , ఎగిరిపో పాడై పోయెను గూడు ' లాంటి పాటలు ఈ నాటికి గుర్తు.
ఒక్కొక్క పాట విన్నప్పుడు , జీవితంలో సాగిన ఒక్కొక్క మజిలీ గుర్తు .
కాలేజి చదివే రోజుల్లో , 'చెయ్యేసి చెప్పు బావా ?' విన్నప్పుడు ప్రేమ గుబాళింపు,
' ఓ నాన్న నీ మనసే వెన్న ' అనే పాట విన్నప్పుడు నాన్న నా కాలేజి ఫీజు కోసం పడే అవస్థ ,
'శంకరా భరణం ' పాటలు విన్నప్పుడు మా శ్రీమతి తో తొలి పరి చయం ,
' ఈ జీవన తరంగాలలో , ఆ దేవుని చదరంగంలో ' పాట విన్నప్పుడు మా అమ్మ జ్ఞాపకం,
' తొమ్మిది తూటుల తోలు తిత్తి ఇది .. తుస్సు మనుట ఖాయం' అని విన్నప్పుడు మా తాత గారి కైవల్యం గుర్తుకు రావడం..

ఇలా ఇలా చెప్పుకొంటూ పొతే , మనిషికి, భాషకు, పద్యానికి, పాటకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం లోనూ.
ఇప్పటికి తెలుగు గీతాలు అమరామరమైనవి . అవి ఎప్పటికీ మన చెవుల్లో గింగురు మని మ్రో!గుతూనే ఉంటాయి.
ఈ దేహం మమేకం తెలుగులో !
ఈ ఆత్మ మమేకం తెలుగులో !
ఎందుకంటే నేను తెలుగు కవిని !
తెలుగే నా ఆధారం!
తెలుగే నా జీవనం !
తెలుగే నా ప్రాణం  !

( రాసిన కాలం 1990)



No comments:

Post a Comment