Monday, February 6, 2017

రాస పల్లి కథలు ( 3 ) - కొలిమి ఆచారన్న

రాస పల్లి కథలు ( 3 )  - కొలిమి ఆచారన్న 

నేను మా రాస పల్లి లో సిన్నప్పుడు స్యానా సంగతులు జరిగినాయి . నా కపుడు ఎనిమిది ఏళ్ళు . ఒక సారి ఏమయిందంటే మా ఊర్లో కొలిమి గురువాచారి అనే ఆసామీ ఉండేవాడు . ఆయన కొలిమిలో కమ్మీలను కాల్చి రైతులకు కావల్సిన ఇనుప పనిముట్లను చేసిచ్చే వాడు. ఆ పనికి రైతులు రూపాయో , అర్థ రూపాయి దుడ్లు ఇచ్చేవారు . ఆ రోజుల్లో అర్ధణా , అణా అంటే శ్యానా ఇలువ ఉండేది . అర్ధణా ఆంటే మూడు పైసలు, అణా అంటే ఆరు పైసలు. రూపాయికి పదహరు అణాలు ఇచ్చేవారు. బొట్టు అనేది గూడా ఉండేది. మధ్యలో రాగి నాణేనికి బొక్క ఉండేది. మా నాయన నా కెప్పుడో గాని దుడ్లు ఇచ్చేవాడు గాడు. ' నీ కెందుకబ్బా దుడ్లు? అనేవాడు . నాకు కోపం వచ్చేది బాగా . కమ్మర కట్లు, పాగం పప్పు, ఉడక బెట్టిన గెనుసు గడ్డలు , పబ్బిల్లలు అమ్మే వాళ్ళు సాయబులు . నాకు కొనుక్కొని తినల్ల అని బలే ఆశ. కానీ మా నాయన దుడ్లు ఇస్తే గదా ! దుడ్ల కోసం నేను సింతకాయలు కొట్టేవాడిని సింత తోపుల్లో . పండు సింత కాయలకు మా ఊళ్ళో ఇపుడు సెప్పిన వన్నీ ఇచ్చేవాళ్ళు . గానీ సింత తోపుల్లో రెడ్లు సూసి నారంటే , నా పని అయిపోయినట్లే ! సింత బరీకే తీసుకోని గొడ్డును కొట్టినట్లు కొడతారు. అందుకే నేను సింత మాన్లు ఎక్కి కాయలు కొయ్యాలనుంటే గూడా స్యానా బయ పడే వాడ్ని. అందుకే రాళ్లు ఇసిరి కాయలు ఎన్ని కింద పడాతాయో , అవన్నీ ఏరుకొని , షరాయి జోబీల్లో నింపుకొనేవాడిని . ఊర్లో బుట్టల్లో అమ్ముకోనే సాయబుల దగ్గర కావల్సినివి సింతకాయలు ఇచ్చి తినే టోడిని . నేను స్కూలు నుండి వస్తానే , మా ఇంటి పక్కనన్నే ఉండే గురువాచారన్న కొలిమి దగ్గర కుసుండే వాడ్ని . నాకు ఎర్రగా కాలే ఇనప కడ్డీల్ని , పెద్ద సుత్తితో గట్టిగా సాగదీస్తూ కొట్టే శబ్దాన్ని ఇనాలంటే స్యానా కుసాలుగా ఉండేది . కొలిమి ఆచారి కొడుకు గాలి కోసం తోలు తిత్తుల్ని పైకి కిందకు ఊదే వాడు . అయి నిప్పుల్ని రాసుకొని బాగా మండేవి . ఆ నిప్పుల్లో ఇనుప కడ్డీల్ని పెట్టి కావాల్సిన మడక సామాన్లు జేసే వాడు మా గురువాచారన్న . ఒక్క రోజు , గురవన్న కొడుకు ర్యాల ! అప్పుడు నన్ను పిలిచి నాడు ఆచారాన్న .
' రేయ్ సామి! నువ్ ఊదతావా కొలిమి తిత్తి ? ' అన్నాడు .
నాకు స్యానా కుసాలు అన్పించింది .
' నేను ఊదతా అన్నా ' అన్నాను.
'సరే ఊదరా ' అన్నాడు .
'ఒక తిత్తి పైకెత్తితే గాలిని పీల్సి , ఇంకో తిత్తి కింద వదిలితే గాలిని కొలిమి లోకి వదలు ' అని ఆ పనిని నాకు నేర్పించి నాడు .
నాకు స్యాన నవ్వు వచ్చింది . పైకి కిందకు ఒక అర్థ గంట తోలు తిత్తుల్ని తిప్పినాను . అపుడే భుజాలు లాగుతుండాయి. సేతులు నొప్పి పుడతా ఉండాయి .
'ఉ ...ఊదాక్ ' అని గట్టిగా అరసినాడు గురవన్న .
బయపడి ఊదడం నిలిపినాను .
మళ్లి గట్టిగా 'ఊదు ' అన్నాడు గురవన్న.
నేను ఎక్కడో చూస్తూ తిత్తుల్ని ఊదలేదు .
' నీకు పప్పులు , కమ్మర కట్లు కొనిస్తా లేరా ! ఊదు సామీ ' అన్నాడు గురవన్న .
ఆ మాట ఇంటానె నాకు ఎక్కడ లేని సక్తి వచ్చి , గట్టిగా స్పీడు గ తిత్తుల్ని ఊదినాను . అంతలో ఆ ఊదుడుకు ఒక పెద్ద అగ్గి రవ్వ గురవన్న రొమ్ము మీద పడింది .
అంతే , 'అమ్మ నా కొడకా , సంపితివి గదరా .... ఆపు ...యూదాక్ ' అని గట్టిగా తిట్టినాడు .
నాకు బయ్యం ఏసీ , ఒక్క సారి పైకి లేసి పరిగెత్తినాను .
' పట్టు కొండి , దొంగ ముండా కొడుకుని ' అని గురవన్న నిప్పు తొక్కిన కోతి లా అరసినాడు .
నాకు ఒళ్ళంతా కంపరం వచ్చి , మా ఇంటి ఎనకాల ఉన్న గడ్డి వాములో దాక్కొన్నాను . రాత్రంతా అక్కడే ఉండాను బయపడి . మా అమ్మ , నాయన ఒకటే ఏడ్పు . గురవన్న తిట్టని తిట్టు తిట్టకుండా శాపనార్థాలు పెట్టినారు . పొద్దున కోడి కూస్తానే , మా యమ్మ , నాయనకు తెలియకుండా నా సాప మీద పడుకొని నిద్ర పొయినాను . తర్వాత గురవాచారన్న మొహం సూడనే లేదు . పదేళ్ల తర్వాత గురవా చారన్న నన్ను గుర్తు పట్టి , ఆ విషయం సెప్పుకోని ఒకటే నవ్వు.
కూలబడి నవ్వి, నవ్వి సచ్చి నాము మేమిద్దరమూ ఆ రోజు .
---------------------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment