Sunday, April 24, 2016

వానమ్మ వానమ్మ వానమ్మా!



పల్లవి :
 అమ్మ  వానమ్మ  వానమ్మ  వానమ్మా
దివి నుంచి  భువికి  దిగి రావమ్మా                     // అమ్మ //

చరణాలు :

తప్పులెన్నో  చేసినామమ్మా
మమ్ము క్షమియించి  కిందికి  రావమ్మా          // అమ్మ //

వాన సుక్కల్ని ఒడిసి పట్ట  లేదమ్మా
ఇంకుడు  గుంతల్ని  తవ్వ లేదమ్మా            // అమ్మ //

అడవుల్ని  నరికి వేసినామమ్మో
చెట్లన్నీ తగల బెట్టి నామమ్మో                   //అమ్మ //

దోసిళ్ళతో  నీరు   నింపుతామమ్మా
లోగిళ్ళలో  చెట్లు  పెంచుతామమ్మా           // అమ్మ //

దయ చేసి  కిందకు  రావమ్మా
నీకు  చేతులెత్తి  మొక్కుతామమ్మా          // అమ్మ //

మేఘాలు  మా పైకి తోలమ్మా
మా ఊర్ల చెరువులు  నింపమ్మా            //అమ్మ //

గుంత లన్నీ తవ్వి నామమ్మా
చుక్క  నీరు   ఇక వదల బోమమ్మా    // అమ్మ//


భానుమూర్తి
24. 04. 2016








Tuesday, April 19, 2016

చెరువు

చెరువు
----------


అలా  ఎంత సేపు  నడుస్తున్నానో  నాకే తెలియదు
సాయంకాలపు  నీరెండ  నన్ను చుట్టేసు కొనింది
మా వూరి  చెరువు గట్ల మీద
ఆమె ప్రవాహం లా నాకు ఎదురయింది
తీతవ పక్షులు పాడుతున్న  రాగాలు
చెరువు నీళ్ళల్లో  దోబుచులాడుతున్న  చేపల నక్షత్రాలు
ఆ సాయంకాలం  నా గుండెల్లో ఒక  పల్లె రాగమై  పలికింది
ఆమె  నా  ఎదురుగా  నిలబడింది
ఆకసాన  మేఘాలు  పన్నీటి తుంపర్లను  పంపించాయి
ఆమె కొంగు నా మీద  ఛత్రమై  గాలిలో ఎగిరింది
ఆమె వక్ష సంపద  నా   రెటినాలో  చిత్రమై నిలిచింది
ఆమె సిగ్గుల  మొగ్గయి బుగ్గలు నిగ్గయి
పసిడి కెంపుల కాంతిలో మెరుస్తున్నాయి
అప్పుడెప్పుడో  రెక్కల మనుషులు
గగనంలో  కనబడి మాయ మయి నట్లుగా
ఆమె  హటాత్తుగా  ఒక వసంతమై నిలిచింది
అవును ..... ఒక  పది  ఉగాదుల  తర్వాత
ఒక మహా యుగమై  ఆమె నన్ను పలకరించింది
అలా ఎంతసేపు ఆమె కళ్ళల్లో ని అమాయకత్వాన్ని
చూ స్తున్నన్నో నాకే తెలియదు
ఇళ్ళకు  వెడుతున్న పశువుల గంటల శబ్దం
ఎగురుతున్న గోధూళి  వాసన
సన్నని జల్లులు అందించిన కమ్మని మట్టి వాసన
కనుల ముందు బాపు  బొమ్మలా  ఆమె 
నా ఉచ్వాస  నిశ్వాసాల  సవ్వడిని  నియంత్రిస్తున్నాయి
తూరుపుదిక్కున  ఇంద్ర ధనస్సు దిగి వచ్చిన  దేవ కన్యలా
ఆమె  వదనం  సంధ్య కాంతిలో  మెరుస్తోంది
అవును ...
పది సంవత్సరాల్లో ఎంత  మార్పు?
పండక్కి వచ్చారా బాబు గారు?
చిగురు టాకులు తిని మదించిన కోయిల లా వుంది ఆమె స్వరం
ఆమె  గాలికి ఎగిరిపోతున్న పమిట సర్దుకొంటూ
మాటలు  గద్గద స్వరంలోంచి  బయటకు  రాలేక  కన్నీటిని  కురిపించాయి
నువ్వు వివాహితవా ? బాల్య  వివాహమా?
దక్షిణం దిక్కు ఉరుములు మెరుపులు
ఒక్క సారిగా ఉలిక్కపడ్డ పక్షులు
వలయా కారంలో తిరుగు తున్నాయి
పసి వాడని ప్రాయంలో పెళ్లి 
పదేళ్ళకే  వైధవ్యమా ?
ఎంతమంది  పూర్ణమ్మలు బలి అవుతున్నారో ?
ఆమె  చిటికెన వ్రేలు పట్టుకొని
ఏడు  అడుగులు నడిచాను
నాకు తెలుసు  .....
ఈ చెరువు గట్ల మీద మహా ప్రళయం  జరుగుతుందని
రెండు సమాధుల మధ్య  కత్తుల  యుద్ధం  జరుగుతుందని
రెండు పల్లెల  మధ్య  భీకర పోరు  జరుగుతుందని
రేపు తెల్లవారదు ...
చీకటి  కొన్ని సార్లు  ఉదయిస్తుంది
చీకటి కొన్ని  సార్లు  తెగిస్తుంది
కట్టు బాట్లు  ముళ్ళను తెంపి
సరిహద్దు కంచెల్ని దాటి
చీకటి చూపిన బాటలో
గమ్యం  చేరే వరకు  నడుస్తూనే ఉన్నాము

నాకు తెలియదు ....
పత్రికలో అక్షరాల సందేశం చదివే దాకా ...
వందల సంవత్సరాల  క్రితం  కట్టిన
ఆ పురాతన చెరువు  గట్టు తెగి పడి  పోయిందని
రక్త సిక్త మైన  చెరువు నీరు
రెండు పల్లెల్ని  ముంచే సిందని

మనిషి  కట్టుబాట్లకు
చెరువు బలి అయింది !
---------------------------------------------------------------------




 
వారణాసి భానుమూర్తి రావు
13.04. 2016











Sunday, April 10, 2016

నోబెల్ సోల్ !

నోబెల్ సోల్ !



 మా క్షురకుని  కత్తి
నా మెడ మీద  నుండి  పీక  వరకు వచ్చినా
లేశ మైన  భయం లేని నాకు
అతడి నోటి వెంబడి  వచ్చే 
సమస్యా లంకారా వ్యక్త అవ్యక్తా వ్యంగ చతురోక్తుల
సామాన్య ,రాజకీయ, సాంఘిక , చలన చిత్ర ఆవ్రతమై
నిరంకుశ  , నిర్మోహ  , నిరవధిక  వాగ్ధాటి పటిమకు
ఆశ్చర్య  పోతూ   భయ పడి పోతాను  నేను !

అతని క్షురకాలయంలో
పిల్లలు పెద్దలు  ముళ్ళ మీద
కళ్ళు పెట్టి   వాళ్ళు  కాలాన్ని నములుతూ
వార్తా పత్రికల  కథల  లోకి  విహరిస్తూ
కేశ   ఖండన  కాలాన్ని  బేరీజు  వెసుకొంటుంటారు

కులం , మతం  అడగని
ధనిక పేద తెలియని అపరిచిత , పరిచిత వ్యక్తుల
క్షురకర్మ  చెయ్యడమే అతని పని
నిజంగా  అతను  నాకు గొప్ప సంస్కర్త
మహాత్ముడు , మహితాత్ముడు

ప్రపంచాన్ని ఒక్క
ముక్కలో  విడమరచి  అర్థం చెప్పే మహా జ్ఞాని
ఆర్థిక  సంస్కరణలు
తమ  వృత్తికి  ఉరిత్రాళ్ళైనై
మల్టీ నేషనల్ కంపనీలు ఏసీ  గదుల్లో పెట్టిన
సలూన్లు  తమ పాలిట బలి  పీఠాలయినై
అని నాతొ అన్నప్పుడు  ఒక భయం
అతని  ముఖంలో  ప్రస్పుట మయింది


 కాలం తెచ్చిన  మార్పులు
ఇంటి అరుగుల మీద నుండి
లక్జరీ ఫైవ్  స్టార్  ఏసీ  సలూన్ల దాక
ఎలా ఎగబడింది కథ చెబుతూ
నా గుబురు గడ్డాన్ని ట్రిమ్ చేస్తాడు

వంద రూపాయలు ఉంచుకోమ్మన్నా
పనికి తగ్గ డబ్బు తీసుకోని
మూడు పదులు తో సరిపెట్టుకొన్న
మా బార్బెర్ నిజంగా నాకు దేవుడే !

దేశాన్ని కబళించే కింగ్ ఫిశర్లు  , 2జి రాజులు ,
కోట్లు మింగిన  రాజకీయ వాదులు
కబ్జా లు చేసే భూబకాసురులు
కల్తి  వ్యాపారం చేసే నకిలీ  వ్యాపారస్తులు
కిడ్నీ లు అమ్ముకొనే దొంగ డాక్టర్లు
పసి పాపల్ని  అమ్ముకొనే  నర్సులూ
ఇంతమంది రాక్షసులు  తిరుగుతున్న ఈ దేశంలో
మా బార్బెర్  ఒక  నోబెల్  సోల్ !



భానుమూర్తి  వారణాసి




Wednesday, April 6, 2016

అమ్మ - ఒక అమ్మాయి

అమ్మ - ఒక  అమ్మాయి


మనస్సును వివస్త్ర చేసి
అనుమానంతో  అవమానించి
చీర  కోంగుతొ వ్రేలాడ దీసిన  ఆమె శవాన్ని
అబద్దాల  పోస్ట్  మార్టం లో  ఖననం చేసి
రెండవ పెళ్ళికి  సిద్ద మయ్యే మగాసురులకు  వందనం !

బస్సుల్లో , రైళ్లల్లో
కార్లల్లో , సినిమా హాళ్లల్లో
హాస్టల్లో , కాలేజిలల్లో
స్కూళ్ళల్లో , షూటింగ లల్లొ
వెంట  బడి  , వెంట బడి
ఆమె  స్త్రీత్వాన్ని జుర్రుకోవాలని చూసే మగాధములకు వందనం  !

మామ , తాత , బాబాయి
నాన్న , అన్న , అంతా మనవాళ్ళే
ఎదురింటి అంకుల్ , పక్కంటి  టీచర్
సంగీతం నేర్పించే మాష్టారు
వాళ్ళ తిమ్మరి   చూపులు భరించే శక్తి లేక
మౌనంగా రోదించే  చిన్నారికి
గొప్ప వ్యవస్థ ను  అందించిన మగ సమాజానికి  వందనం !

నఖ శిఖ పర్యంతము
కళ్ళ తోనే అందాలను జుర్రుకొని
ద్వందార్తాలతో  ప్రేమను ఒలక బోసి
పని కంటే ప్రేమ పనులకు  ఇంక్రిమెంట్ ఇస్తూ
పరువాలను ఒలకబోసిన వారికి ప్రమోషన్ లిస్తూ
ఆఫీసుల్లో  రొమాన్సు డ్రామా లాడుతున్న మగ అధికారులకు వందనం !

మగతనం ఉన్నదని  విర్రవీగకు మగ మహారాజా !
'భూమ్మీద సుఖ పడితే  తప్పు లేదురా'  అన్న పాత పాట ను పాడకు
జంతువుకు మనిషికి తేడా లేదని నిరూపించకు
మన అమ్మ గూడా ఒక ఆడదేగా ?
ఉద్రేకంలో  తప్పు చేసి  ఊచలు  లెక్క బెట్టకు !





 

Saturday, April 2, 2016

చెట్టు - పక్షులు

చెట్టు - పక్షులు
----------------------
ఆ  చెట్టు మీద 
వేలాది  పక్షులు 
సాయంత్రం కాగానే  
చిరు చిరు నక్షత్రాలయి
 కొమ్మల రెమ్మల మీద దాక్కొంటాయి

పగలంతా ఎక్కడో  తిరిగి తిరిగి
మళ్లి  ఆ చెట్టు  గూటికే చేరి
కబుర్లను  కడుపు నిండా పంచుకొంటాయి

రెక్కల్ని   రెప రెప లాడిస్తూ
కొమ్మల  చిగురు టాకుల  పరుపుల మీద
రాత్రి నిద్రకు సిద్ద మవుతాయి

ఒక్కొక్క సారి  చల్లని గాలి
స్పృశించిన  పక్షులు
కొత్త  రాగాలు పాడు కొని
మురిసి పోతుంటాయి

కొన్ని అమ్మ పక్షులు
బిడ్డల కోసం  కట్టుకొన్న
పొదరిల్లులో దూరి
పిల్లల నోటిలో
గోరు ముద్దల్ని తినిపిస్తాయి

చిరు జల్లులు  కురిస్తే
రెక్కల్ని విదిలిస్తూ
 ఆనంద నృత్యాల్ని  చేస్తాయి

ఆ చెట్టు మీద  వేలాది పక్షులు
సుప్రభాత గీతాల్ని పాడుతాయి
ప్రభాత వేళలో
గుంపులు గుంపులు గా
ఆకాశంలో  ఎగిరి  నాట్యాలు  చేస్తాయి

ఇన్ని వేలాది పక్షుల్ని మోస్తున్న
ఆ చెట్టు  నాకు ఒక గొప్ప మాతృదేవతే !

అన్నం కోసం  ఆరాట పడినా
ఒకరి కడుపు కొట్టి  బ్రతికే స్వార్థం లేక
సహ  జీవనం చేస్తూ
మానవత్వాని చాటుతాయి పక్షి జాతులు

ఒక కాకి మరణిస్తే
వేలాది కాకులు ఆకాశం లో తిరిగి  చింతిస్తాయి

గాలి పటం మాంజా లో చిక్కుకొని
ప్రాణాల్ని పోగోట్టు కొంటున్న కాకిని చూసి
వేలాది కాకులు ఆకాశంలొ గోల పెడుతున్నాయి

బాల్కొనీ లో కూర్చొని   'చెట్టు పక్షుల' కవిత రాసుకొంటున్న నాకు
మా  పదేళ్ల అమ్మాయి చెప్పే వరకు
ఆ  కాకి  పడుతున్న అవస్థ గుర్తుకు రాలేదు

పొడుగాటి కర్ర తో మా బాల్కనీ గోడ ఎక్కి
మాంజా  దారాన్ని లాగి రెక్క లెగరక
విల విల లాడుతున్న  కాకిని  కాపాడాను

మా అమ్మాయి కళ్ళల్లో  ఆనంద బాష్పాలు
నన్ను మళ్ళి మనిషిని  చేశాయి !


భాను వారణాసి / 02. 04. 2016